ఎమ్బీయస్‌ : పవన్‌కి ఛాన్సుందా? – 7

ఢిల్లీని ఎదిరించడం చేతనే ఎన్టీ రామారావు హీరో అయ్యారు. చనిపోయి 18 ఏళ్లయినా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఈనాడు మరో ఎన్టీయార్‌ కావాలి. కనీసం ఎన్టీయార్‌ దగ్గరదాకా వచ్చే నాయకుడైనా కావాలి. అతనికి నిజాయితీ…

ఢిల్లీని ఎదిరించడం చేతనే ఎన్టీ రామారావు హీరో అయ్యారు. చనిపోయి 18 ఏళ్లయినా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఈనాడు మరో ఎన్టీయార్‌ కావాలి. కనీసం ఎన్టీయార్‌ దగ్గరదాకా వచ్చే నాయకుడైనా కావాలి. అతనికి నిజాయితీ వుండాలి, మాస్‌ హీరో యిమేజి వుండాలి. తెలుగు వారి జరిగిన అన్యాయం గురించి కిరణ్‌ నిజాయితీగా మాట్లాడినా అతనికి గ్లామర్‌ లేదు. ప్రజలను ఉత్సాహ పరిచి, ఉద్రేక పరిచి సెన్సిటైజ్‌ చేయగల చేవ లేదు. 2009లో చిరంజీవి రంగప్రవేశం చేసినపుడు అతనికి మొదట్లో ఛాన్సు వుండింది. కానీ అతి త్వరలోనే ఎన్టీయార్‌తో సరిపోలడని తెలిసిపోయింది. ఆ స్టామినా లేదు, ఆ కన్విక్షనూ లేదు. ఉపన్యాసాలు బట్టీపట్టి చెప్పినట్టు వచ్చాయి. ఫీలై గుండెలోతుల్లోంచి మాట్లాడినట్లు రాలేదు. 18 సీట్లు గెలిచినా పార్టీ నడపలేక చిరంజీవి కాళ్లు చాపేయడంతో యీయన తెరమీద మాత్రమే హీరోరా అనిపించాడు. కాంగ్రెసులో కలిపేయడంతో పదవీలాలసుడు అనిపించుకున్నాడు. తన ప్రాంతానికి యింత అన్యాయం జరిగినా పదవిని పట్టుకుని వేళ్లాడుతూండడంతో సాధారణ కాంగ్రెసు నాయకుడి స్థితికి దిగజారిపోయాడు. 

ఇప్పుడు పవన్‌కు మళ్లీ ఆ ఛాన్సు కనబడుతోంది. ప్రజారాజ్యం ప్రచారం సమయంలోనే చిరంజీవిలో కంటె పవన్‌లో ఎక్కువ కన్‌విక్షన్‌, బెటర్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కనబడ్డాయి. అన్నగారు కాంగ్రెసులో కలవడం అతను హర్షించలేదు అనే మాట ప్రచారంలో వుండడం చేత యితనికి ఒక కన్విక్షన్‌ వుంది అనే మాట ప్రజల్లో వుంది. దీనికి తోడు అతను మంచి వక్త. విషయం తెలిసి మాట్లాడుతున్నట్లు, ప్రాంప్టింగ్‌ అక్కరలేదన్నట్లు తోస్తుంది. చిరంజీవి మరీ మర్యాదస్తుడు, మొహమాటస్తుడు. ఇటీవల కిరణ్‌ మీద విరుచుకుపడడం తప్ప ఆయన వేరెవరి గురించి పరుషంగా మాట్లాడగా వినలేదు. పవన్‌ నిర్భయంగా కుండబద్దలు కొట్టి మాట్లాడినట్లు కనబడుతుంది. మొన్న ఉపన్యాసంలో తెరాస నాయకులను విమర్శించిన తీరులోనే అది మళ్లీ తెలిసింది.

ఇలాటి పవన్‌ తన పార్టీకి జనసేన అని పేరు పెట్టారు. నిజమే, యూత్‌ ఫోర్సును సేనగా మార్చుకునే శక్తి అతనికి వుంది. దాన్ని పెట్టుకుని ఏం చేయవచ్చు? హిట్లర్‌ జర్మన్‌ యువతను ఎలా ప్రేరేపించగలిగాడో పవన్‌ ఓ సారి అతని జీవితచరిత్ర చదివితే మంచిది. ''హిట్లర్‌ – ఎ కెరియర్‌'' అని క్రిస్టియన్‌ హెరెన్‌డార్ఫర్‌ డైరక్టు చేసిన రెండున్నర గంటల డాక్యుమెంటరీ (http://www.amazon.in/Hitler-A-Career/dp/B007ZXQM02) వుంది. పరమాద్భుతమైన డాక్యుమెంటరీ అది. దానిలో యివన్నీ చక్కగా విశదీకరించాడు. జర్మనీ ఆర్థికమాంద్యంలో కూరుకుపోయినపుడు అతను యువతకు మానిఫెస్టోలు యివ్వలేదు, సూత్రాలు వల్లించలేదు. వాలంటీర్లుగా పనిచేద్దాం రండి అంటూ నిర్మాణాత్మకమైన పనుల్లో వాళ్లను యిన్‌వాల్వ్‌ చేశాడు. వాళ్లు ఆడుతూ పాడుతూ పనిచేశారు. ప్రజలు తమకున్న దాంట్లోనో వాళ్లకు గంజి (సూప్‌) పోశారు. 

ఇప్పుడు సీమాంధ్ర నిర్మాణానికి గాని, తెలంగాణ పునర్నిర్మాణానికి గాని కావలసింది లక్షల కోట్ల నిధులు కాదు. అవి కేంద్రం ఎలాగూ యివ్వదు. కర్నూలు వరదసహాయ నిధులే యిప్పటిదాకా మనకు చేరలేదు. ఇక యివేం యిస్తారు? ఇచ్చినట్లుగా చూపించినా అవి ఎంపీలను కొనుక్కోవడానికి ఖర్చయిపోతాయి. మనకు హ్యూమన్‌ రిసోర్సెస్‌ వున్నాయి. విభజన తర్వాత నిరుద్యోగ సమస్య పట్టి పీడించబోతోంది. ఉపాధి దొరక్కపోతే వాళ్లు చెడుమార్గాలు పట్టి సమాజంలో అశాంతి కలిగిస్తారు, హింసామార్గాలు పడతారు. దాన్ని నిరోధించాలంటే పవన్‌ వంటి గ్లామరున్న వారు ముందుకు వచ్చి 'కేంద్ర నిధులపై ఆధారపడకుండా కాలువలు తవ్వుదాం, గడ్డపార పట్టండి, మీతో ఫోటో దిగుతాను' అంటే చాలు. ఇది పెద్ద వింతేమీ కాదు. యుద్ధ సమయంలో హాలీవుడ్‌ నటులు సైనికుల మధ్యకు వెళ్లి హుషారు చేస్తూ వుంటారు. ప్రజల వద్ద నల్లదో, తెల్లదో చాలా డబ్బు వుంది. విరాళాలు యిచ్చే మంచి మనసు కూడా వుంది. యువత యిలాటి నిర్మాణాత్మక కార్యక్రమాల్లో మునిగితే ధనసహాయం దానంతట అదే వస్తుంది. పవన్‌ పేర రాష్ట్రనిర్మాణం సాగుతుంది. నాయకులు లేక అల్లాడుతున్న తెలుగుజాతికి కనీసం ఒక ఐకాన్‌ దొరుకుతాడు. 

దీనికోసం అతని పార్టీ ఎన్నికలలో నిలబడాలా? వద్దా? నిలబడవచ్చు. ప్రశ్నిస్తానంటున్నాడు కాబట్టి ఒంటరిగానే పోటీ చేయాలి. ఎంతమంది మంచి అభ్యర్థులు దొరికితే అందర్ని నిలబెట్టాలి. ఓట్లలో 5-10 శాతం వచ్చినా నష్టం లేదు. ఒకళ్లిద్దరు నెగ్గినా అసెంబ్లీలో అందర్నీ నిలదీయవచ్చు. ఈ లోపున పైన చెప్పిన పనులు చేపడితే వచ్చే ఎన్నికలకు పెరగవచ్చు. అవి ఐదేళ్ల తర్వాతే వస్తాయని ఏమీ లేదు. అస్థిరప్రభుత్వాలు ఏర్పడితే మధ్యంతర ఎన్నికలు కూడా రావచ్చు. 

'ఇదంతా మీ పిచ్చి వూహ, యిలా ఎందుకు జరుగుతుంది? పవన్‌కు అంత సీన్‌ లేదు' అని మీరనవచ్చు. ఉందో లేదో నాకూ తెలియదు. ఉంటే బాగుండునని నా ఆశ. అసలంటూ ఐడియా వుంటే సీను క్రియేట్‌ చేయవచ్చు. ఐడియా కూడా వుందో లేదో నాకు తెలియదు. 'ఇంత కసరత్తు చేయడం దేనికి? మోదీకి జై, చంద్రబాబుకి జై అంటే వాళ్లు ఓ పది సీట్లు యిస్తారు. నేనూ ఒక నాయకుణ్ని అనిపించుకోవచ్చు.' అని పవన్‌ అనుకుంటున్నారేమో తెలియదు. ''అత్తారింటికి దారేది?'' సినిమాలో పవన్‌ తన అసిస్టెంటుపై కసురుకుంటాడు – 'ముందే ప్లాను వేసుకోవడానికి నేనేమైనా మేనత్తను యింటికి ఎలా తీసుకురావాలి? అనే పుస్తకం రాస్తున్నానా? పరిస్థితులు ఎలా నడిపిస్తే అలా వెళ్లిపోవడమే' అని. ఇప్పటివరకు ఆయన చేసినది చూస్తూంటే ఆ డైలాగే గుర్తుకు వస్తోంది. విభజనలో బిజెపి పాపాన్ని విస్మరించి మోదీని వాటేసుకుంటున్నందుకు అందరూ విమర్శిస్తున్నారు. రేపు టిడిపితో కలిపి వాటేసుకుంటే ఆయన పాత్ర మరింత పరిమితమవుతుంది. 

ఎన్నికల తర్వాత ఆయన మాట పట్టించుకోవలసిన పని టిడిపికి గాని, బిజెపిగాని లేదు. అవినీతి రూపుమాపండి, పండగలకు సెలవులు ఎత్తివేయండి వంటి డిమాండ్లు చేస్తే 'నీకు రాజకీయం ఏమీ తెలియదు, వెళ్లి వేషాలేసుకో' అంటారు. అతని పార్టీ ఎమ్మేల్యేలకు పదవులు ఆఫర్‌ చేసి తమ పార్టీలోకి లాక్కుంటారు. ప్రజారాజ్యం పార్టీ ఎమ్మేల్యేలను కట్టడి చేయలేకనే చిరంజీవి తన పార్టీని కాంగ్రెసుపాలు చేశారని అందరికీ తెలుసు. ఈ కేసులో చంద్రబాబు అవుతారు. ఆయన కాంగ్రెసు కంటె డేంజరు. మావగార్ని దింపడానికి బావమరదుల్ని, తోడల్లుణ్ని ఎలా వాడుకున్నారో, ఆ తర్వాత వాళ్లకు ఎలా చుక్కలు చూపించారో చూశాం.  పవన్‌ యీ పరిస్థితిని వూహించలేక పోతున్నారంటే నమ్మలేం. అన్నీ తెలిసే ఏదో ఒక ప్రయోజనం ఆశించి బిజెపి, టిడిపిలతో చేతులు కలుపుతున్నారని ప్రజలు అనుకుంటే మాత్రం ఆయనకు పెద్దగా ఛాన్సు వుండదు. అలా కాకుండా విడిగా నిలబడి, పోరాడి, ప్రశ్నలు వేస్తూనే వుంటే, ప్రజలతో యింటరాక్ట్‌ అవుతూ యిన్‌స్పయిర్‌ చేస్తూ వుంటే తప్పకుండా ఛాన్సు వుంటుంది – యివాళ కాకపోతే రేపయినా!

(సమాప్తం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

Click here For Part-5

Click here For Part-6