చిన్న రాష్ట్రాలకోసం ఉద్యమించే ప్రతీవారూ 'చిన్న రాష్ట్రాలే ప్రగతి సాధిస్తాయి. ఉదాహరణకి పంజాబ్ చూడండి' అంటూ వుంటారు. పంజాబ్‌లో నదులెక్కువ కాబట్టి, వ్యవసాయం ఉధృతంగా చేసేస్తుంటారు కాబట్టి నిజంగా వెలిగిపోతోందేమో అనుకుంటాం. అదంతా ఉత్తిదిట. 1984 వరకు రెవెన్యూ సర్ప్లస్ (వ్యయం కంటె ఆదాయం ఎక్కువ) రాష్ట్రంగా వుంది కానీ అప్పణ్నుంచి టెర్రరిజం పెరగడంతో ఆర్థిక కార్యకలాపాలు దెబ్బ తిన్నాయి. శాంతి లేనిచోట అభివృద్ధి వుండదు కదా, పైగా టెర్రరిజాన్ని అదుపు చేయడానికి పోలీసు వ్యవస్థపై, సైన్యంపై చాలా ఖర్చు పెట్టవలసి వచ్చింది. ఆ కాలంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటె ఎక్కువగా డెఫిసిట్ పంజాబ్‌కే వుండేది. 1995 ప్రాంతానికి వచ్చేసరికి జిడిపి (అభివృద్ధి రేటు)తో పోలిస్తే అప్పు జాతీయంగా 2.5% వుంటే పంజాబ్‌లో 5% వుంది. దాన్ని ఎలా సవరించాలా అని చూడలేదు పంజాబ్ పాలకులు. రెండేళ్లలో అది 7% అయింది. అలా అలా ఒకప్పుడు దేశంలో అగ్రగామిగా వున్న రాష్ట్రం ఋణభారంతో కృంగిపోసాగింది. 1998-99 సంవత్సరంలో ఏడాదిలో 10 రోజులు మాత్రం క్యాష్ బాలన్సు వుంది. తక్కిన అన్ని రోజులూ ఓవర్డ్రాఫ్టే! కేంద్రం మందలింపులు, ఉద్యోగుల జీతాలు ఆలస్యం కావడాలు.. వీటన్నిటికీ అలవాటు పడింది పంజాబ్.
ఇంకో పదేళ్లు గడిచేసరికి పంజాబ్ ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వం మరింత పెరిగి ప్రస్తుతం రూ.1.02 లక్షల కోట్ల రూ.ల ఋణానికి చేరింది. గత నెలలో ఉద్యోగుల జీతాలే కాదు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు యివ్వలేకపోయింది. తన ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బు పుట్టించవలసి వచ్చింది. పరిస్థితి యింత ఘోరంగా వుందేమిటని పాత్రికేయులు అడిగితే ఉపముఖ్యమంత్రి పెద్ద డాబుగా 'అభివృద్ధి చెందిన దేశాలన్నిటికీ అప్పులున్నాయి.' అన్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఖఱ్చు పెట్టినపుడు ఋణాలు తప్పవు కానీ పంజాబ్ ప్రభుత్వం తీసుకుంటున్న అప్పుల్లో 80% పాత అప్పులపై వడ్డీలకు పోతున్నాయి. పోనీ సంక్షేమ పథకాలు వెలగబెడుతున్నారా అంటే అవీ సవ్యంగా నడవటం లేదు.
ఆటా-దాల్ స్కీము అని పెద్ద హంగామాతో మొదలుపెట్టి కొన్ని నెలల తర్వాత ఆపేశారు. మళ్లీ ప్రారంభించినపుడు బకాయిలు తీర్చలేదు. ఉచిత విద్యుత్ అంటూ రోజుకు 4-5 గంటల కంటె విద్యుత్ యివ్వటం లేదు. కొత్త స్కూళ్లు ప్రారంభిస్తామని ప్రకటనలు చేస్తారు కానీ యిప్పుడున్న స్కూళ్లలో వున్న 35,000 ఖాళీలను భర్తీ చేయడం లేదు. ప్రభుత్వ యంత్రాంగంపై అయ్యే ఖర్చులో మాత్రం ఏ లోటూ చేయడం లేదు. ఖరీదైన కార్లు, విదేశీయాత్రలు యితోధికంగా పెరుగుతున్నాయి.
ఈ అధ్వాన్న పరిస్థితిపై పంజాబ్ పాలకులను నిలదీస్తే వాళ్లు చెప్పే కారణాలు – 1) శత్రుదేశమైన పాకిస్తాన్‌తో సరిహద్దు వుండడం చేత రక్షణకు ఖర్చు అవుతోంది (గుజరాత్‌కు కూడా యీ సమస్య వుంది మరి) 2) పంజాబ్‌కు సముద్రతీరం లేదు, రవాణాకు ఎక్కువ ఖర్చు అవుతోంది (దేశంలో 20 రాష్ట్రాలకు యీ సమస్య వుంది, కొత్తగా తెలంగాణ చేరుతోంది) 3) స్పెషల్ స్టేటస్ హోదాతో పన్నుల రాయితీలు యిస్తున్న హిమాచల్ ప్రదేశ్ పక్కనే వుండడం వలన పరిశ్రమలు అక్కడకు తరలిపోతున్నాయి. (హర్యాణాకూ యీ సమస్య వుందిగా). పాలించడం చేతకాకపోతే యిలాటివి ఎన్నయినా చెప్పవచ్చు. నీతి ఏమిటంటే – రాష్ట్రం చిన్నదా, పెద్దదా అన్నది క్వశ్చన్ కాదు. పాలకులు మంచివాళ్లా కాదా అన్నది పాయింటు.
– ఎమ్బీయస్ ప్రసాద్