ఎమ్బీయస్‌ : న్యూస్‌, వ్యూస్‌, రివ్యూస్‌ – 34

శిల్పాలూ సిగ్గు పడాల్సిందే..  Advertisement  ఆడవాళ్ల లోదుస్తులు అమ్మడానికి బట్టలషాపుల్లో దాదాపు నగ్నంగా శిల్పాలు నిలబెట్టడం (మేనిక్విన్‌) చూసి చూసి మనం అలవాటు పడిపోయాం కానీ  రీతూ తావ్‌డే అనే ముంబయి కార్పోరేటర్‌ అలా…

శిల్పాలూ సిగ్గు పడాల్సిందే.. 

 ఆడవాళ్ల లోదుస్తులు అమ్మడానికి బట్టలషాపుల్లో దాదాపు నగ్నంగా శిల్పాలు నిలబెట్టడం (మేనిక్విన్‌) చూసి చూసి మనం అలవాటు పడిపోయాం కానీ  రీతూ తావ్‌డే అనే ముంబయి కార్పోరేటర్‌ అలా సర్దుకోలేకపోయింది. ఆమె ‘‘మరాఠా ప్రతిష్ఠాన్‌’’ అనే సంస్థ నడుపుతుంది. ‘‘ఇది మన భారతీయ సంస్కృతి కానే కాదు. ఇళ్లల్లో ఆడవాళ్లు బట్టలు ఆరవేసినపుడు తమ లోదుస్తులు లోపలివైపున ఆరవేస్తారు, పరాయివాళ్లు వాటిని చూడకూడదని. అలాటిది యీ బట్టలషాపువాళ్లు యింత విశృంఖలంగా వాటిని ప్రదర్శనకు పెట్టడమే కాక, ఆ క్రమంలో స్త్రీ దేహంలో అంగాంగాన్ని చూపడమేమిటి? అయినా ఆ బమ్మలు ఎవరికోసం? నాతో సహా చాలామంది ఆడవాళ్లు వాటికేసి కన్నెత్తి కూడా చూడరు. తమ సైజు ఏమిటో ముందే తెలుసు కాబట్టి, లోపలికి వెళ్లి రంగు, గుడ్డ నాణ్యత, ధర – యిలాటివి దృష్టిలో పెట్టుకుని అవే చూపమని సేల్స్‌గర్ల్‌ని అడుగుతారు. అంటే యీ బమ్మల్ని పనీపాటా లేని మగాళ్ల కోసం పెట్టారన్నమాట. అవి చూసి వాళ్లల్లో వికారమైన ఆలోచనలు రావడం ఖాయం. ఒకసారి వచ్చాక అవి ఏ విధంగా రూపు దిద్దుకుంటాయో ఊహించలేం. అంతా వారివారి పెంపకంపై, సంస్కారంపై ఆధారపడి వుంటుంది.’’ అందామె. నటీమణి గుల్‌ పనాగ్‌ ఆ విషయంలో ఏకీభవించింది 
– ‘‘వాటి కేసి నా భర్త చూసే చూపులో, నా డ్రైవర్‌ చూసే చూపులో తేడా వుంటుంది. ఎందుకంటే మన మగవాళ్లు మహిళలను సాంప్రదాయకమైన దుస్తుల్లో చూడడానికే అలవాటు పడ్డారు. ఆధునికమైన దుస్తులు వేసుకున్నవారు కూడా కాస్త కాస్త కనబరుస్తారు. మరి యీ బమ్మలో! అవి దాచేది అంగుళాలలో వుంటుంది.’’  

ఈ వాదనల్లో బలం వుందని బృహత్‌ ముంబయి మునిసిపల్‌ కార్పోరేషన్‌కు తోచింది. మేనిక్విన్స్‌ను నిషేధించాలని 227 మంది సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇక దానితో ఫ్యాషన్‌ డిజైనర్లు, యాడ్‌ కంపెనీల వాళ్లు రీతూపై విరుచుకుపడ్డారు – ‘సినిమాల్లో, ఇంటర్నెట్‌లో నగ్నవనితలు కనబడటం లేదా?’ అంటూ. ‘‘అలాటివి కావాలనుకున్న వాళ్లే వాటిని చూస్తున్నారు. కానీ యిదేమిటి? రోడ్డు మీద వెళ్లేవాడు కూడా వీటిని తప్పించుకోలేకపోతున్నాడు.’’ అని రీతూ వాదిస్తున్నారు. ఆమె బిజెపి పార్టీకి చెందినదైనా ముస్లిము మహిళాబృందాలు ఆమెకు అండగా నిలిచాయి. అంతేకాదు, రీతూ యింటికి దగ్గర్లో వున్న బట్టలషాపుల వాళ్లు ఎందుకైనా మంచిదని వాళ్ల షాపుల్లో వున్న అమ్మాయిల బమ్మలకు టీ-షర్టులు తొడిగారు! అన్ని నగరాల్లోనూ యిలాటి మార్పులు వస్తే నిర్భయ కేసులు కాస్త తగ్గే అవకాశం తప్పకుండా వుంటుంది. 

మమత తప్పిన ఎంపీలు 

కలకత్తాలో సెప్టెంబరులో జరిగిన రక్తదాన శిబిరంలో మాట్లాడుతూ తృణమూల్‌కు చెందిన నలుగురు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే మమతా బెనర్జీ పనితీరును విమర్శించి ఆమె ఆగ్రహానికి గురయ్యారు. ‘‘దుర్గామాత అవతరించడానికి కూడా అనేకమంది దేవతల సహకారం కావలసి వచ్చింది. మమతా దీదీ యీ రోజు యీ స్థానంలో వున్నారంటే మాలాటి ఎందరో సాయపడ్డాం. కానీ ఆమె యిటీవలే పార్టీలో చేరిన కొందరి అండ చూసుకుని మమ్మల్ని పట్టించుకోవడం లేదు.’’ అని ఆక్రోశం వెళ్లబుచ్చారు వాళ్లు. వీరిలో అందరి కంటె ఎక్కువగా ఆవేదన వ్యక్తం చేసినది కునాల్‌ ఘోష్‌. ఒకప్పుడు శారదా చిట్‌ఫండ్స్‌కు చెందిన పత్రికకు చీఫ్‌ ఎడిటర్‌గా పని చేసిన ఘోష్‌ మమతాని శారదా గ్రూపుకు సన్నిహితంగా తీసుకెళ్లాడు. తర్వాత ఆ గ్రూపు అప్రతిష్టపాలు కావడంతో ఘోష్‌ ఫోన్‌ చేస్తే మమత తీసుకోవడం మానేసింది. అపాయింట్‌మెంట్లు యివ్వడం తగ్గించింది. శారదా గ్రూపు వలన లాభపడిన అనేకమందిని మంత్రులను ఆదరిస్తూనే తనను మాత్రమే బలిపశువును చేసిందని ఘోష్‌ గారి ఘోష. 

అతనితో పాటు ఆ రోజు రక్తదాన శిబిరంలో మాట్లాడిన వారిలో తపస్‌ పాల్‌ అనే బెంగాలీ నటుడు, శతాబ్ది రాయ్‌ అనే నటి వున్నారు. వీరిద్దరు తృణమూల్‌ తరఫున ప్రచారం చేసి ఎంపీలుగా ఎన్నికైనవాళ్లే. కానీ తపస్‌ యీ మధ్య మమతను చూడడానికి వెళితే అతన్ని బయట కుర్చీలో అరగంటసేపు కూర్చోబెట్టించింది. విజిటర్స్‌ స్లిప్‌ మీద పేరు రాసిచ్చాకనే లోపలకి రానిచ్చింది. ఇక అనేకమంది పార్టీ నాయకులు తనను అవమానిస్తున్నా వారిని మమత కట్టడి చేయడం లేదని శతాబ్ది రాయ్‌ ఫిర్యాదు. వీరందరిని ఒకే వేదికమీదకు తెచ్చినవాడు మరో ఎంపీ ఐన సోమేన్‌ మిత్రా. అతను రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడిగా వుండగానే మమతను కాంగ్రెసు నుండి బయటకు పంపాడు. కొన్నాళ్లకు రాజీ కుదిరి ఆమె పార్టీలో చేరినా ఆమె విధానాలను అతను పూర్తిగా ఆమోదించడు. అవేళ అతనేమీ మాట్లాడలేదు కానీ అతని భార్య శిఖా మిత్రా దుమ్ము దులిపేసింది. ఆవిడ ఆ పార్టీ ఎమ్మెల్యే. ఆమె గతంలోనే పార్టీని చెరిగేయడం వలన సస్పెన్షన్‌లో వుంది. అందుకని ఆమెను వదిలేసి పార్టీ డిసిప్లినరీ కమిటీ చైర్మన్‌ పార్థా చటర్జీ తక్కిన ముగ్గురికి షోకాజ్‌ నోటీసులు పంపించాడు.  సోమేన్‌ను మాత్రం వదిలేశాడు. అతను కఠిన చర్యలు వద్దని వారిస్తున్నాడు.

రాబోయే పార్లమెంటు ఎన్నికలలో కనీసం పదిమంది సిట్టింగు ఎంపీలకు టిక్కెట్లు యివ్వకూడదని మమత నిశ్చయించుకుందని, వారిలో తాము కూడా వున్నారని తెలిసే వీళ్లు యిలా తిరగబడ్డారని భోగట్టా. మమతకు కోపం వచ్చి పార్టీలోంచి తీసేసినా వీళ్లు నిరుద్యోగులై పోరు. తపస్‌, శతాబ్దిలకు సినిమా రంగం వుంది. కునాల్‌ ఘోష్‌కు పత్రికా రంగం వుంది. సోమేన్‌కు సొంతంగా ఓటు బ్యాంకు వుంది, యిమేజి వుంది. కబీర్‌ సుమన్‌ అనే ఎంపీ మమతాను వ్యతిరేకించి బయటకు వెళ్లిపోయినా అతను గాయకుడు కాబట్టి చెల్లిపోయింది. వీళ్లకూ అదే ధైర్యం. ఈ తిరుగు-బావుటా వెనక కాంగ్రెస్‌ హస్తం వుందని మమతా అనుమానం. అందుకే కునాల్‌ ఘోష్‌ను పార్టీ నుండి సస్పెండ్‌ చేసింది. అతను వెంటనే శారదా స్కామ్‌లో విషయాలు బయటపెడతానంటూ ప్రకటించాడు. అంతే పోలీసులు వెంటబడి, విచారణపై విచారణ చేసేస్తున్నారు.  

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]

                                                        Click Here For Archieves