భారత రాష్ట్ర సమితి పార్టీలో బాగా సీనియర్ నాయకుల్లో ఒకరు, కేసీఆర్ వద్ద అపరిమితమైన గౌరవమర్యాదలు పొందుతున్న కే కేశవరావు కూడా గులాబీ దళానికి గుడ్ బై చెప్పేశారు.
కాంగ్రెస్ నుంచి తీసుకువచ్చి కేసీఆర్, నెత్తిన పెట్టుకున్న నాయకుల్లో కేకే కూడా ఉంటారు. అలాంటి కేకే కూడా పార్టీని వీడిపోతున్న సందర్భం అనేది కల్వకుంట్ల చంద్రశేఖరరావును అసహనానికి గురిచేసింది. ఆయన ఆగ్రహించారు. ఎంతమంది పార్టీనుంచి వెళ్లిపోతున్నా.. పెద్దగా స్పందించని కేసీఆర్, కేకే వెళ్లిపోతుండడం పట్ల అసహనం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
కే కేశవరావు.. తాను భారాస నుంచి నిష్క్రమిస్తున్న సందర్భాన్ని కూడా చాలా మర్యాదపూర్వకంగా పూర్తి చేయాలనుకున్నారు. ఆయన స్వయంగా కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లారు. తాను పార్టీని వీడుతున్న సంగతిని స్వయంగా కేసీఆర్ కు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే కేకే మాట్లాడుతూ ఉండగానే.. సాకులు చెప్పవద్దంటూ కేసీఆర్ ఆయన పట్ల ఆగ్రహించినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ కు తాను చెప్పదలచుకున్నది కూడా పూర్తిగా చెప్పకుండా కేకే.. ఆయన ఫాంహౌస్ నుంచి మధ్యలోనే తిరిగిపోయారు.
కాంగ్రెసుతోనే సుదీర్ఘ అనుబంధం కలిగిఉన్న కే కేశవరావు.. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల్లో భారాసలో చేరారు. సీనియర్ నాయకుడు కావడంతో ఆ పార్టీలో కూడా ఆయనకు కేైసీఆర్ నుంచి ప్రాధాన్యం మంచిగానే లభించింది. కేసీఆర్ ఎప్పుడు కీలకమైన ప్రెస్ మీట్ పెట్టినా.. పక్కన కేకేను కూర్చోబెట్టుకునే వారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా గౌరవాన్ని కూడా ఆయనకే కట్టబెట్టారు.
అయితే రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పాలైన తర్వాత చాలా పరిస్థితులు మారుతున్నాయి. భారాస నుంచి అనేకమంది నాయకులు కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక్కరొక్కరిపై ఆకర్షణాస్త్రాలు ప్రయోగిస్తూ తమ జట్టులో కలిపేసుకుంటున్నారు. అందులో భాగంగానే.. నాలుగు రోజుల కిందట సీఎం రేవంత్, స్వయంగా కేకే ఇంటికి వెళ్లారు. ఆయనను తిరిగి కాంగ్రెసులోకి ఆహ్వానించినట్టుగా పుకార్లు వచ్చాయి. ఆ పుకార్లను నిజం చేస్తూ.. కేకే గురువారం నాడు కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లారు.
పదేళ్లపాటూ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అన్నిటినీ అనుభవించి.. ఓడిపోయినప్పుడు అందరూ పార్టీని వీడుతున్న తీరుమీద కూడా కేసీఆర్ ఆగ్రహించినట్లుగా తెలుస్తోంది. కేకేతో పాటు హైదరాబాదు నగర మేయర్ విజయలక్ష్మి కూడా భారాసను వీడి శనివారం కాంగ్రెసులో చేరబోతున్నారు.