ఏపీలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెత్తిపైన బీజేపీ రాజకీయంగా పాలు పోస్తోంది. మరోసారి జగన్ అధికారంలోకి రావడానికి చేయాల్సిన దాని కంటే ఎక్కువే ఆ పార్టీ చేస్తోంది. టీడీపీతో పొత్తు పెట్టుకుని, రాజకీయంగా మాత్రం జగన్‌కు ప్రయోజనం కలిగించేలా ఆ పార్టీ చర్యలున్నాయి.
తాజాగా ఉమ్మడి విశాఖ జిల్లా అరకు సీటు తీసుకుని, జగన్‌కు బంగారు పల్లెంలో ఆ సీటును బీజేపీ అప్పగిస్తోంది. బీజేపీ ప్రకటించిన 10 స్థానాల్లో, ఇప్పటికే టీడీపీ తన అభ్యర్థులను ప్రకటించిన రెండు స్థానాలున్నాయి. వాటిలో అనపర్తి, అరకు. అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అక్కడ ఫలితం ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక అరకు విషయానికి వస్తే… ఇది ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం. ఇక్కడి నుంచి దన్ను దొర అనే వ్యక్తికి ఎంతో ముందుగానే చంద్రబాబునాయుడు సీటు ప్రకటించారు. దన్ను దొరతో పాటు మరొకరికి పొత్తు ధర్మాన్ని చంద్రబాబు విస్మరించి, టికెట్లు ప్రకటించారనే కోపంతోనే పవన్‌కల్యాణ్ కూడా రెండు సీట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.
దన్ను దొర బలమైన నాయకుడు. గిరిజన పోరాటాల నుంచి ఆయన నాయకుడిగా ఎదిగారు. చంద్రబాబు ఎంపిక చాలా మంచిదనే అభిప్రాయం ఉంది. గత ఎన్నికల్లో అరకులో ఇండిపెండెంట్‌గా బరిలో దిగిన దన్ను దొర రెండో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. టీడీపీ అభ్యర్థి కిడారి శ్రవణ్ మూడోస్థానానికి పరిమితం అయ్యారు. గత ఎన్నికల్లో అరకు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి చెట్టి ఫల్గుణ గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి కిడారి శ్రవణ్‌కు 19, 929 ఓట్లు , దన్ను దొరకు 27,660 ఓట్లు వచ్చాయి.
ఈ దఫా వైసీపీ తరపున రేగం మత్స్య లింగం బరిలో నిలిచారు. టీడీపీ, వైసీపీ మధ్య నువ్వానేనా అన్నట్టు పోటీ వుంటుందని అంతా భావించారు. అయితే బీజేపీ తన అభ్యర్థిగా పంగి రాజారావును ప్రకటించడంతో ఒక్కసారిగా వైసీపీకి అనుకూల వాతావరణం ఏర్పడింది. వైసీపీ సునాయాసంగా గెలుస్తుందనే చర్చకు తెరలేచింది. మోసపోయిన దన్ను దొర మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. అప్పనంగా వైసీపీకి బీజేపీ ఒక సీటు ఇచ్చినట్టే. ఇది జగన్‌పై బీజేపీ పాలుపోసినట్టు కాకుండా మరేమవుతుంది?