బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఫిరాయింపులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లో చేరుతుండడంపై కేసీఆర్, ఆయన పార్టీ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. అలాగే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఫిరాయింపులపై కేసీఆర్ మాట్లాడ్డానికి సిగ్గుండాలన్నారు. ఫిరాయింపులకు పునాది వేసిందే కేసీఆర్ అని రేవంత్‌రెడ్డి అన్నారు. తన తప్పులకు కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం 100 రోజులు కూడా ఉండదని అన్నది కేసీఆర్ కాదా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తమ ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్ చేసిన కామెంట్స్‌నే బీజేపీ చేసిందన్నారు.
ప్రజలు ఎన్నుకున్న తమ ప్రభుత్వాన్ని కూల్చాలనే భావదారిద్ర్యంలో కేసీఆర్ ఉన్నారని ఆయన తప్పు పట్టారు. జగిత్యాల అభివృద్ధి కోసమే అక్కడి ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్‌లో చేరారని ఆయన అన్నారు. అయితే జగిత్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్‌రెడ్డి ఈ విషయంలో మనస్తాపం చెందారన్నారు.
తమ వైపు, అలాగే పీసీసీ నుంచి సమన్వయం చేయడంలో గందరగోళం వల్లే ఆయన ఆవేదనకు గురి అయ్యారని చెప్పారు. జీవన్‌రెడ్డి గౌరవానికి భంగం కలగకుండా చూస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.