ఎమ్బీయస్: పద్మశ్రీ అందుకున్న ఏకైక హాస్యనటి – మనోరమ

సినిమా వాళ్లందరమూ ఒక కుటుంబంలాటి వాళ్లం. నన్ను “ఆచ్చి” అని పిలుస్తారందరూ. అంటే అమ్మ అని. అదే నాకు ఆనందం. వేరే ఏ బిరుదూ అక్కర్లేదు.

9 ఏళ్ల క్రితం అక్టోబరు 10న దివంగతురాలైన తమిళ హాస్యనటి మనోరమకు 2002లో పద్మశ్రీ ఎవార్డు వచ్చింది. అప్పుడు ఆమె ఒక ఆంగ్ల పత్రికకు యిచ్చిన యింటర్వ్యూలో విషయాలను ప్రస్తావిస్తూ, నేను మేనేజింగ్ ఎడిటరుగా ఉన్న ‘‘హాసం’’లో ఒక వ్యాసం రాసి, ‘పద్మశ్రీ ఎవార్డు అందుకున్న తొలి హాస్యనటీమణి – మనోరమ’ అని కాప్షన్ పెట్టాను. 22 ఏళ్ల తర్వాత కూడా మరో హాస్యనటికి ఆ ఎవార్డు రాలేదు. అందుకని ‘ఏకైక’ అనగలుగుతున్నాను. తమాషా ఏమిటంటే ఐఎమ్‌డిబి వంటి ప్రఖ్యాత వెబ్‌సైట్ కూడా పద్మశ్రీ వచ్చిన నటీనటులు అంటూ యిచ్చిన లిస్టులో మనోరమ పేరు రాశారు కానీ హిందీ రంగంలో అదే పేరుతో ఉన్న హాస్యనటి ఫోటో, వివరాలు యిచ్చారు. దక్షిణాదిన మరో మనోరమ ఉందని, ఆవిడ 6 భాషల్లో (నాలుగు దక్షిణాది భాషలు ప్లస్ హిందీ ప్లస్ సింహళ) 1500 వరకు సినిమాలు వేసిందని వారి దృష్టికి రాలేదు. అది దురదృష్టకరం.

తమిళ సినిమాలలోనే ప్రధానంగా నటించినా మనోరమ “శుభోదయం”, “అల్లరి ప్రియుడు”, “పరదేశి” వంటి పలు చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచితురాలే. “కుఁవారా బాప్” (తెలుగులో ‘పెళ్లికాని తండ్రి’‌), “దో ఫూల్” (తెలుగులో ‘అనుభవించు రాజా అనుభవించు’) సినిమాలలో మెహమూద్‌కు జంటగా నటించడం ద్వారా, అనేక తమిళ డబ్బింగు సినిమాల ద్వారా ఆంధ్రప్రేక్షకులను అలరించిన మనోరమ అంటే తనక్కూడా ఇష్టమేనని భానుమతి అన్నారు. “బామ్మమాట బంగారుబాట” సినిమాలో ఆమె వేసిన పాత్ర తమిళ ఒరిజినల్ వెర్షన్ “పాటీ సొల్లదు తట్టాదే”లో మనోరమ నటించినదే! నటనలో ‘వెర్వ్’, ‘గస్టో’, డైలాగులో చెప్పడంలో ఊపు, ఉత్సాహం మనోరమకు సహజలక్షణాలు.

మనోరమ అసలు పేరు గోపీశాంత. 1937లో ఒక గ్రామంలో పేద యింట జన్మించింది. పాచి పని చేసి, సంసారం యీడ్చుకుని వస్తున్న తల్లి రోగగ్రస్తురాలు కావడంతో, 11వ ఏట చదువు మానేసి పనిమనిషిగా చేరింది. అప్పట్లో నాటక సభలు ఊరూరా తిరిగి నాటక ప్రదర్శనలు యిచ్చేవి. అలా వాళ్ల ఊరు వచ్చిన ‘‘వైరమ్ నాటక సభ’’ అనే ట్రూపు ‘‘అండమాన్ కాదలి’’ అనే నాటకం వేయడానికి వచ్చినపుడు, సడన్‌గా ఒక నటి రాలేక పోవడంతో యీమెకు ఆ పాత్ర యిచ్చారు. అలా 12వ ఏట తను స్టేజి ఆర్టిస్టు అయింది. వేషంతో పాటు పాట పాడింది కూడా. డ్రామా డైరెక్టరే యీమెకు ‘మనోరమ’ అని పేరు పెట్టాడు. దానిలో చిన్నాచితకా వేషాలు వేస్తూన్న రోజుల్లో వాళ్ల జిల్లాకు వచ్చిన ఎస్ఎస్ రాజేంద్రన్‌ను కలిసింది. తర్వాతి రోజుల్లో శివాజీ, ఎమ్జీయార్‌లకు దీటుగా హీరోగా ఎదిగిన అతను అప్పట్లో నాటకాలు వేస్తూండేవాడు. ఈమె డైలాగ్ డెలివరీ చూసి ముగ్ధుడై, మా ‘ఎస్ఎస్ఆర్ నాటక మన్రమ్’లో వేషాలు వెయ్యి’ అని ఆహ్వానించాడు. అలా అతని ట్రూపులో వందలాది నాటకాలు వేసింది.

వాళ్లు వేసిన ఒక నాటకం ‘‘మణిమకుటం’’ కరుణానిధి రాసినది. అతని స్నేహితుడు కణ్ణదాసన్ నాటకం చూడడానికి వచ్చి, మనోరమ యాక్టింగు చూసి మెచ్చుకుని నేను తీయబోయే సినిమాలో వేషం నీదే అన్నాడు. ఆ మాట విని జానకిరామన్ అనే నిర్మాత అతని కంటె ముందే బుక్ చేసుకున్నాడు కానీ 40శాతం పూర్తయ్యాక ఆ సినిమా ఆగిపోయింది. దాంతో సినిమా రంగంపై ఆమె ఆశ విడిచింది. ఇంతలో ఆమె డాన్సు టీచరు ఒక సింహళ డైరెక్టరుకి సిఫార్సు చేస్తే, అతను 1957లో ‘‘సుకుమాలి’’ అనే సింహళ సినిమాలో హీరోయిన్ చెలికత్తెగా వేషం యిచ్చాడు. తర్వాత కణ్ణదాసన్ “మాలయిట్ట మంగై” (1958)లో హాస్య పాత్ర వేసే ఛాన్స్ యిచ్చాడు. నాటకాల్లో హీరోయిన్‌గా వేసిన దానిని, కమెడియన్‌గా వేయాలా? అని యీమె బేలగా అడిగితే కణ్ణదాసన్ ‘హీరోయిన్‌గా ఐతే ఐదు, పదేళ్లలో నీ కెరియర్ ముగిసిపోతుంది. ఇలాటి పాత్రలు వేస్తే దశాబ్దాల పాటు వేషాలు వస్తాయి.’ అన్నాడు. అదే నిజమైంది. ఆమె కెరియర్ 51 ఏళ్ల పాటు సాగింది. వెయ్యి సినిమాల్లో వేసినందుకు 1985లో గిన్నెస్ బుక్ ఆఫ్ వ(ర)ల్డ్ రికార్డ్స్‌లో ఎక్కింది. మనోరమ ఒక యింటర్వ్యూలో ‘‘హాస్యపాత్రలు వేసే సామర్థ్యం నాకుందో లేదో తెలియదు. సినిమాలలో ఛాన్సు దొరకడం కష్టం అని నాకు తెలుసు. ఈ పాత్ర నేను కష్టపడకుండా, స్టూడియోల చుట్టూ తిరగకుండా దానంతట అదే వచ్చింది. పైగా ఆఫర్ ఇచ్చింది కణ్ణదాసన్ వంటి మహా వ్యక్తి. ఇక హీరోయిన్ పాత్ర ఎందుకు రాలేదు అని గాని, దానికి నేను తగనా అని మథన పడడం కానీ జరగలేదు. ఛాన్సు వచ్చింది, అంది పుచ్చుకున్నాను.’’ అంది.

హాస్యనటనపై వ్యాఖ్యానించమంటే, ‘‘మనుష్యులను నవ్వించడం చాలా కష్టం. మొదట్లో ఎలా నవ్వించాలో తెలియక చాలా శ్రమపడేదాన్ని. క్రమంగా నా ప్రయత్నాలకు మంచి స్పందన రావడంతో నాకూ ధైర్యం పెరిగింది. కొత్త కొత్త ప్రయోగాలు చేసి చూసేదాన్ని. అవి విజయవంతం కావడంతో ఉత్సాహం పుట్టుకొచ్చి మరింత కష్టపడేదాన్ని. కారెక్టర్ ఆర్టిస్టులకు, కామెడీ ఆర్టిస్టులకు ఓ తేడా ఉంది. కారెక్టరు ఆర్టిస్టులు స్క్రిప్టులో ఉన్నది జాగ్రత్తగా చదివి డైలాగు డెలివరీ మీద శ్రద్ధ పెట్టి చెబితే చాలు. కానీ కామెడీ ఆర్టిస్టులు డైలాగుతో బాటు హావభావాలు కూడా ఎక్కువగా చూపాలి. ముఖ్యంగా ఇంప్రొవైజేషన్ ఎక్కువగా చేయాలి. పాత్రను రూపొందించడంలో డైరెక్టరుకే ఎక్కువ క్రెడిట్ పోయినా హాస్యపాత్రధారి కూడా చాలా ఇన్వాల్వ్ కావలసి వుంటుంది.’’ అంది. 5 దశాబ్దాల కెరియర్‌లో ఆమె ఎమ్ఆర్ రాధ, తంగవేలు, చంద్రబాబు, కరుణానిధి (హాస్యనటుడు), వికె రామస్వామి, తేంగాయ్ శ్రీనివాసన్, చో, ఎమ్ఆర్ఆర్ వాసు.. యిలా ఎందరో అనేక తరాల హాస్యనటులతో కలిసి నటించింది. చోతో 20 సినిమాలు వేస్తే, నాగేష్‌తో 50 వేసింది. 1970, 80లలో వెన్నిరాడై మూర్తి, సురళి రాజన్‌లతో కూడా వేసింది. తర్వాతి రోజుల్లో జనకరాజ్, పాండ్యరాజా, గౌండమణి, సెందిల్, వివేక్, వడివేలుతో కూడా వేసింది. హిందీలో మెహమూద్ సరసన ‘‘కుఁవారా బాప్’’లో, “దో ఫూల్”లలో వేసింది.

వారిని గురించి చెప్పమంటే ఆమె ‘‘నేను ఎంతోమంది హాస్యకళాకారులతో కలిసి నటించాను. కానీ హిట్ ఫెయిర్ అంటే నాగేష్ – మనోరమాయే! నాగేష్ నాకు గురువు. టైమింగ్ గురించి నాకెంతో నేర్పారు. మేమిద్దరం చాలా రిహార్సల్సు వేసేవాళ్లం. ప్రతీ రిహార్సల్స్‌ తోనూ ఇంప్రొవైజ్ చేసి మరిన్ని ‘గాగ్స్’ పెట్టేవాళ్లం. ఒక్కోప్పుడు రిహార్సల్ వేస్తూంటే మాకే బాగా నవ్వు వచ్చేసేది. మమ్మల్నే నవ్వించగలిగించిందంటే ఆ జోక్ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం కలిగేది. నేనూ, నాగేష్, వి.కె.రామస్వామి కలిసి నటించిన సినిమా “ముగరాశి”ని నేనిప్పటికీ మర్చిపోలేను. షూటింగు టైములో ఎంత పడిపడి నవ్వేవారమో చెప్పలేం. “తిల్లానా మోహనాంబాళ్” (1968) లో జిల్ జిల్ రమామణి పాత్రను విమర్శకులు, ప్రేక్షకులు కూడా మెచ్చారు. నాకూ అది ఇష్టమే.’’ అంది. ఆ సినిమాలో శివాజీ గణేశన్, పద్మిని, టిఎస్ బాలయ్య వంటి హేమాహేమీల సరసన వేసింది. వారిని చూసి యీమె జంకితే, దర్శకనిర్మాత ఎపి నాగరాజన్ ‘జిల్ జిల్ రమామణి తెర మీద మెరిసిందంటే అందరూ అందరి దృష్టీ నీ మీదే ఉంటుంది. వాళ్లని చూసి భయపడకు.’’ అన్నారట.

ఆ పాత్రతో పాటు ఆమెకు బాగా నచ్చినది ‘‘నడిగన్’’ (1990)లో వృద్ధ కన్య పాత్ర. మేనకోడళ్లను చాలా స్ట్రిక్ట్‌గా పెంచుతూ, వాళ్ల టీచరు ఉద్యోగం కోసం ముసలివాడిగా వేషం వేసుకుని వచ్చిన యువ హీరోని ప్రేమిస్తుంది. ‘‘ప్రొఫెసర్’’ (1962) హిందీ సినిమాలో లలితా పవర్ వేసిన పాత్రను యీమె తమిళంలో వేసింది. దీన్ని తెలుగులో ‘‘పెద్దింటి అల్లుడు’’ (1991)లో రీమేక్ చేసినప్పుడు ఆ పాత్రను వాణిశ్రీ ధరించింది. ‘‘చిన్నగౌండర్” (1992) సినిమాలో విజయకాంత్ తల్లిగా వేసిన పాత్ర కూడా ఆమెకు బాగా నచ్చిందిట. ఆమె నటన తమిళులకు నచ్చినట్లుగా తెలుగువారికి నచ్చదు. అతిగా అనిపిస్తుంది. ‘‘శుభోదయం’’ (1980)కు ముందు ఆమె వేసిన స్ట్రెయిట్ తెలుగు సినిమాలున్నాయో లేదో నాకు తెలియదు కానీ, ఆ సినిమాలో మాత్రం తెలుగు వారిని ఆకట్టుకుంది. విశ్వనాథ్ ఆమెకు ఆ పాత్ర యివ్వడానికి కారణం ఉంది.

‘‘శంకరాభరణం’’ సినిమా పూర్తి అయిపోయినా ఎవరూ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకి రావటం లేదు. ప్రివ్యూపై ప్రివ్యూ వేస్తూనే పోయారు. అందరూ వచ్చి ఆహాఓహో అనడం, కానీ కమ్మర్షియల్‌గా ఆడదు అని పెదవి విరిచి వెళ్లిపోవడం, యిదే జరిగింది. నిర్మాత. దర్శకుడు, నటీనటులు అందరూ విసిగిపోయారు. ఇంతలో ఒక ప్రివ్యూకి మనోరమ వచ్చింది. సినిమా చూసి విశ్వనాథ్ కాళ్ల మీద పడింది. ‘ఈవిడ సినిమాల్లోనే కాదు, బయటా ఓవరాక్షనే అన్నమాట’ అనుకున్నారు, యిదంతా గమనిస్తున్న చంద్రమోహన్. కానీ యీవిడ మనస్ఫూర్తిగా చేసిందన్న సంగతి వెంటనే అర్థమైంది. ఎందుకంటే ‘‘ఈ సినిమా తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఎవరికైనా యిచ్చారా?’’ అని అడిగి, లేదనగానే ‘‘అయితే నేను తీసుకుంటాను. ఇదిగో సుందరరాజన్, వెంటనే చెక్‌ యిచ్చేయ్.’’ అంది. ‘మేజర్’ సుందరరాజన్ అనే నటుడు ఆమె డిస్ట్రిబ్యూషన్ సంస్థలో భాగస్వామి. అతనో సారి చెప్పాడు – నడిగర్ సంఘం ప్రెసిడెంటుగా అతను తన హయాంలో ఓ బిల్డింగు కట్టించాట్ట. దాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన ఎమ్జీయార్ ‘నువ్వు చేసిన రెండు మంచి పనుల్లో యిదొకటి. రెండో మంచి పని ‘‘శంకరాభరణం’’ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం.’’ అన్నాట్ట.

‘‘శంకరాభరణం’’ తెలుగులో విడుదల కావడానికి ముందే తమిళనాట యథాతథంగా విడుదలకు సిద్ధమైంది. మనోరమ తీసుకుంది అనగానే తెలుగులో కూడా కొందరు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వచ్చారు. కొన్ని జిల్లాలు నిర్మాతే స్వయంగా విడుదల చేసుకున్నారు. ‘‘శంకరాభరణం’’ ఎలాటి ప్రభంజనం సృష్టించిందో, విశ్వనాథ్‌కు ఎంత పేరు తెచ్చిందో అందరికీ తెలుసు. ఆ కృతజ్ఞతతో ఆయన ‘‘శుభోదయం’’ సినిమాలో మనోరమకు వేషం యిచ్చారు. ఆ తర్వాత ఆమె అనేక తెలుగు సినిమాల్లో కూడా వేషాలు వేశారు. నాలుగు దక్షిణాది భాషలు, సింహళ, హిందీలలో కలిపి దాదాపు 1500 సినిమాలు వేశారు, 5 వేల నాటక ప్రదర్శనలు యిచ్చారు. “పుదియ పాదై” సినిమాకి జాతీయ స్థాయిలో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. ఫిల్మ్‌ఫేర్ ఎవార్డ్, తమిళనాడు ప్రభుత్వ సినిమా ఎవార్డుతో బాటు ప్రసిద్ధ కళాకారులకు యిచ్చే కలైమామణి అవార్డు కూడా వచ్చాయి. తమిళ సినిమాల్లో ఆమె పాడిన పాటలు 300 వరకు ఉన్నాయి.

తన గురించి చెప్పుకున్న యింటర్వ్యూలో ఆమె ‘‘అణ్ణాదురై రాసి, నటించిన “నాన్‌ కండ హిందూ రాజ్యమ్”లో నేను ఆయనతో బాటు నటించాను. అలాగే కరుణానిధి రాసి, నటించిన “ఉదయ సూర్యన్”లో ఆయన సరసన నేను నటించాను. ఈ రోజు నా ఉచ్చారణను అందరూ మెచ్చుకుంటారు. అది ఆయన పెట్టిన భిక్షే. రిహార్సల్స్‌లో కూడా ఉచ్చారణాదోషం వస్తే సహించేవారు కారు. అందరూ తప్పుల్లేకుండా తమిళం మాట్లాడాలని తపించేవారు. ఎమ్జీఆర్‌తో తెరపై నటించాను. చాలా మర్యాద ఇచ్చి మాట్లాడేవారు. జయలలిత గురించి చెప్పనే అక్కర్లేదు. తనంటే నాకెంతో ఇష్టం. మేం యిద్దరం కలిసి 25 సినిమాల్లో వేశాం. నేను ఫుల్ డ్రామా డైలాగులు రాత్రికి రాత్రి నేర్చేసుకునేదాన్ని. అంతా నా జ్ఞాపకశక్తిని చూసి ఆహో, ఓహో అనే వారు. కానీ జయలలితను చూశాక జ్ఞాపకశక్తి అంటే ఏమిటో నాకు తెలిసి వచ్చింది. అసిస్టెంటు డైరక్టరు వచ్చి ఒక్కసారి డైలాగు చదివి వినిపిస్తే చాలు, అక్షరం పొల్లు పోకుండా అప్పచెప్పేయ గలిగేది. టేక్స్ మధ్య డైలాగులు బట్టీపట్టేదే కాదు. హాయిగా ఓ పుస్తకం చదువుకుంటూ కూచునేది. కానీ టేకు ఇచ్చేటప్పుడు పెర్‌ఫెక్ట్. డాన్స్ స్టెప్సూ అంతే. నాతో కబుర్లు చెబుతూ ఉండేది. డాన్స్ మాస్టర్ తక్కిన ఆడపిల్లల చేత ప్రాక్టీసు చేయిస్తుంటే అలవోకగా చూస్తూ ఉండేది. అంతే! షాట్‌కి పిలిస్తే ప్రతీ స్టెప్ కరక్టుగా వేసేసేది. నన్ను కూడా తనతో బాటు కూచుని కబుర్లు చెప్పమనేది. “తల్లీ, నీకు చూస్తేనే వచ్చేస్తుంది. నాకు మాత్రం ఒకటి రెండు సార్లయినా రిహార్సల్స్ వేసి తీరాలి. నన్ను పోనీ” అనేదాన్ని.

పద్మశ్రీ ఎవార్డు వచ్చినపుడు మారుతున్న రోజుల గురించి అడిగితే, పాతరోజులకు, ఇప్పటి రోజులకు ముఖ్యమైన తేడా ఎక్విప్‌మెంట్ లో వచ్చింది. ఇదివరకు డైలాగ్స్ కంఠతా పట్టడం, షూటింగులో తడబడకుండా చెప్పడం చాలా అవసరం. ఇప్పుడు “డబ్బింగ్ లో చూసుకోవచ్చులే” అంటున్నారు. సినిమా తొలి రోజుల్లో పాటలకే ప్రాముఖ్యం. ఆ తర్వాత, మా తరంలో డైలాగులకు ప్రాధాన్యం. ఇప్పుడు కొత్త డైరెక్టర్లు వచ్చి అలా చెబితే ఓవర్ యాక్టింగ్ అంటున్నారు. మెలోడ్రామా వద్దంటున్నారు. ఎలా చేసినా నాకు ఇష్టమే. యాక్టింగ్ అప్పుడూ ఎంజాయ్ చేసాను, ఇప్పుడూ చేస్తున్నాను. ఆర్టిస్టులలో కూడా తేడా వచ్చింది. అప్పట్లో డైరెక్టర్లన్నా, హీరోలన్నా హడిలిచచ్చే వాళ్లం. ఇప్పుడంతా కాజువల్. ఇదీ ఒకందుకు మంచిదే! ఏ పాత్ర అయినా సరే, నటిస్తూ ఉంటేనే నాకు బాగుంటుంది. కొన్ని దశాబ్దాలుగా యాక్టింగ్‌కి అలవాటు పడిపోయాను. ఇప్పటికీ నాలుగు రోజులు షూటింగు లేకపోతే పిచ్చెక్కిపోతుంది. సినిమా వాళ్లందరమూ ఒక కుటుంబంలాటి వాళ్లం. నన్ను “ఆచ్చి” అని పిలుస్తారందరూ. అంటే అమ్మ అని. అదే నాకు ఆనందం. వేరే ఏ బిరుదూ అక్కర్లేదు. ఎన్ని అవార్డులు వచ్చినా ప్రజాభిమానానికి సాటిరావు.’’ అంది.

ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే, తన 17వ ఏట డ్రామా ట్రూపు మేనేజర్‌ని పెళ్లాడి ఆ పై ఏడాదే ఒక కొడుకుని కన్నది. ఆ పై ఏడాది భర్తతో విడిపోయింది. కొడుకుని తనే పెంచింది. ఆమె మనవడు డాక్టరు. నటన ద్వారానే కాక, సినిమాల పంపిణీ ద్వారా కూడా చాలా అర్జించింది. కానీ ఆమె వ్యక్తిగత జీవితం అంత్యదశలో సజావుగా సాగినట్లు లేదు. ఆమెకు మతి స్థిమితం తప్పిందనే వార్తలు వచ్చాయి. కొడుకు మద్యానికి బానిసయ్యాడు. కరోనా రోజుల్లో 2020లో నిద్రమాత్రలు మింగి ఆస్పత్రి పాలయ్యారు. దానికి ఐదేళ్ల క్రితమే 2015లో మనోరమ తన 78వ ఏట మరణించింది. మరణానికి పూర్వం రెండేళ్ల పాటు అస్వస్థతతో యిబ్బందులు పడింది. వీటి మాట ఎలా ఉన్నా, హాస్యనటనలో ఆమెకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు సినిమాల్లో కొంతకాలం పాటు ఓ వెలుగు వెలిగిన కోవై సరళకు స్ఫూర్తి నిచ్చినది మనోరమే అని చెప్పాలి. (ఫోటో – శివాజీ గణేశన్, నగేశ్, చో, సత్యరాజ్‌లతో)

– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2024)

[email protected]

15 Replies to “ఎమ్బీయస్: పద్మశ్రీ అందుకున్న ఏకైక హాస్యనటి – మనోరమ”

  1. ఐతే కొన్నాళ్ళ పాటు జలకాన్ని మోయకూడదని సన్నియాసం తీసుకొన్నావు పసాదు… అలీబాబా దొంగల ముఠా ను మొస్తే నిన్ను ఊస్తారని తాత్కాలిక విరామం ఇచ్చుకొన్నావు…

  2. 1990 ల్లో పోలీస్ బ్రదర్స్ సినిమాలో నటన జనానికి తెగ నచ్చింది. చివరిరోజుల్లో మతి స్థిమితం లేకుండా తిరుమల లో కనిపించి వార్తల్లోకెక్కింది.

  3. A tale of sorrow, a mournful sight,

    Where shadows darken, and hope takes flight.

    A sister’s anguish, a mother’s despair,

    A wound that festers, a burden to bear.

    A cruel injustice, a heartless crime,

    A stolen future, a wasted time.

    A cry for justice, a plea unheard,

    A broken spirit, a soul embittered.

    In shadowed corners, where truth resides,

    A silent suffering, a wound that hides.

    A plea for mercy, a chance to mend,

    A fragile hope, that knows no end.

  4. తెలుగు లో నిర్మలమ్మ ,,తమిళం లో మనోరమ గారు..

    ప్రేక్షకులని అలరించారు.

    వారి ఆత్మ కి శాంతి కలుగు గాక.

  5. హిందీ ప్రొఫెసర్ సినిమా తెలుగులో ఎన్టీఆర్ తో ‘భలే మాస్టారు’ పేరుతో రీమేక్ చేసారు. అది మర్చిపోయినట్టున్నారు….

Comments are closed.