Mechanic Rocky Review: మూవీ రివ్యూ: మెకానిక్ రాకీ

ఇంటర్వల్ వరకు ఓపిగ్గా కూర్చుని, విసుగొచ్చి ఇంటికెళ్లిపోకుండా ధైర్యం చేసి సెకండాఫులో కూర్చుంటే తప్ప “బాగానే ఉందే” అనే ఫీలింగ్ రాదు.

చిత్రం: మెకానిక్ రాకీ
రేటింగ్: 2.5/5
తారాగణం: విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్, సునీల్, నరేష్, హైపర్ ఆది, హర్షవర్ధన్, హర్ష చెముడు, రఘురాం రదితరులు
కెమెరా: మనోజ్ రెడ్డి కాటసాని
ఎడిటింగ్: అన్వర్ ఆలి
సంగీతం: జేక్స్ బెజోయ్
నిర్మాత: రాం తాళ్లూరి
దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి
విడుదల తేదీ: 22 నవంబర్ 2024

విశ్వక్ సేన్ హీరో అనగానే ఒక మోస్తరు అంచనాలు సహజం. ఉన్నంతలో రొటీన్ కి భిన్నంగా ఉండే సినిమాలు చేస్తాడని ఒక నమ్మకం. పైగా రిలీజ్ కి ముందు చాలా హైప్ ఇచ్చాడు. ఊహించని ట్విస్టులున్నాయన్నాడు. ఉన్నాయో లేదో చూద్దాం.

కథలోకి వెళ్తే రాకేష్ నగుమోము అలియాస్ రాకీ (విష్వక్) ఒక మెకానిక్ గ్యారేజ్ తో పాటూ డ్రైవింగ్ స్కూల్ కూడా నడుపుతుంటాడు. ఆ గ్యారేజ్ అతని తండ్రిది (నరేష్). అది కూడా రాకీ తాత (విష్వక్) నుంచి సంక్రమించిన ఆస్తి. ఆ తాత చనిపోతూ గ్యారేజ్ జాగ్రత్తగా చూసుకోమని కొడుక్కి చెప్పి పోతాడు. అన్నమాట ప్రకారం ఆ గ్యారేజ్ ని పెంచి పెద్దది చేసి తన వారసుడైన రాకీని కూడా అక్కడే పనిచేయిస్తుంటాడు.

ఈ మెకానిక్ షెడ్డులో పని మొదలుపెట్టడానికి ముందు, రాకీ కి ఒక కాలేజ్ ఫ్రెండ్ ఉంటుంది. ఆమె పేరు ప్రియ (మీనాక్షి). ఆమె అన్నయ్య (విశ్వదేవ్ రాచకొండ) ఆత్మహత్య చేసుకుంటాడు. తండ్రి అంతకు ముందే పోతాడు. ఆ క్రమంలో కష్టాల్లో ఉన్న ఆమెకు సాయం చేసే పని పెట్టుకుంటాడు మెకానిక్ రాకీ. ఈలోగా రాకేష్ తండ్రి కూడా చనిపోతాడు.

ఇదిలా ఉండగా మాయ (శ్రద్ధ శ్రీనాథ్) మెకానిక్ రాకీ దగ్గర డ్రైవింగ్ స్కూల్ లో చేరుతుంది. మధ్యలో రంకిరెడ్డి అనే ఒక కబ్జాదారుడు (సునీల్) ఆ మెకానిక్ షెడ్డుని కబ్జా చేయబోతాడు. ఈలోగా చనిపోయిన అతని తండ్రి పేరు మీద 2 కోట్లు ఇన్సూరెన్స్ ఉందని, ఆ డబ్బు వస్తుంది కనుక రంకిరెడ్డి మొహాన కొంత కొట్టి ఆ కబ్జా నుంచి తప్పించుకోవచ్చని దారి చూపిస్తుంది మాయ. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఆసక్తికరమైన కథ.

కానీ పైన చెప్పిన కథ వింటుంటే రొటీన్ గా అనిపిస్తుంది. అలాగని అసలు కథ చెబితే గుట్టు విప్పినట్టు అవుతుంది. కనుక కథ ఏంటంటే నచ్చినా నచ్చకపోయినా ఇంతవరకే చెప్పి ఊరుకోవాల్సిన పరిస్థితి.

ఒక మంచి కథని చక్కగా రాసుకున్నారు. కానీ సగమే చక్కగా రాసుకున్నారు. అది కూడా సెకండాఫ్ మాత్రమే. ఆ కథ పైన చెప్పలేదు. ఊహించని ఆ డబల్ ట్విస్టులవల్ల ఈ సినిమా బాగుందనిపిస్తుంది. కానీ మొదటి సగం మాత్రం అసహనానికే అసహనం కలిగించేంత దయనీయంగా ఉంది.

పాటలొచ్చినప్పుడు హాలు బయటికొచ్చి పచార్లు చేయాలనిపించడం, ఇంటర్వల్ అవ్వక ముందే బయటికెళ్లి ఏ కాఫీయో తాగాలనిపించడం, ఇంటర్వల్ అవ్వగానే ఇక చాల్లే అని పూర్తిగా హాల్లోంచి వెళ్లిపోవడం..లాంటివి ఏ ప్రేక్షకులైనా చేస్తే ఆ క్రెడిట్ దర్శక రచయితలకే ఇవ్వాలి.

సెకండాఫ్ పకడ్బందీగా రాసుకుని ఫస్టాఫుని రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఏదో ఫిల్ చేసినట్టు ఉంది. ఒక్క చోట కూడా ఫీల్ లేదు. కామెడీ పండలేదు. డైలాగుల్లో టైమింగ్ సెన్స్ లేదు.

సినిమాకి ఎప్పుడైనా సెకండాఫ్, క్లైమాక్స్ కీలకం. అలాగని అవొక్కటీ బాగుంటే పాసైపోదు. ఫస్టాఫ్ కూడా పాస్ మార్కులు వేయించుకోవాలి కదా. సినిమాకి మొదటి సగం కూడా ఎంతముఖ్యమో, అది ఎలా ఉండకూడదో చెప్పడానికి ఉపయోగపడే పాఠం ఈ సినిమా.

సరే విమర్శ పక్కనపెట్టి ప్రశంసలజోలికి వెళ్దాం. ఏ మాత్రం ఆడియన్స్ ఊహకి అందకుండా సెకండాఫులో ఇచ్చిన ట్విస్ట్ అద్భుతంగా ఉంది. శ్రద్ధా శ్రీనాథ్ ఎందుకుందిరా బాబు.. అని ఫస్టాఫ్ చూస్తున్నంతసేపూ అనిపించినా, సెకండాఫులో ఆమె నటన పైచేయిగా నడిచింది. స్క్రీన్ ప్లే రైటింగ్ ని మెచ్చుకుని తీరాలి.

రాకీగా విశ్వక్ సేన్ నటన బాగుంది. తనకి తగిన క్యారెక్టర్ ని ఎంచుకున్నాడు. కానీ అనుకున్నట్టుగా ప్రధమార్ధం మీద దృష్టి పెట్టుంటే మరింత మంచి అనుభూతిని మిగిల్చేవాడు. డ్యాన్సులు గట్రా ఉన్నా, పాటల ప్లేస్మెంట్లన్నీ బోర్ కొట్టే ఫస్టాఫులో ఉండడం వల్ల అస్సలు ఆకట్టుకోలేదు. అలాగే ఫ్లాష్ బ్యాకులో తాత పాత్ర కూడా చేసాడు విశ్వక్. అది అత్యంత చిరాకుగా ఉంది. అసలా పాత్రని ఏ జానర్ అనుకుని చూడాలో అర్ధం కాదు.

మీనాక్షి చౌదరి జస్ట్ ఓకే. నటించడానికి ఒకటి రెండు సీన్లు ఉన్నాయి తప్ప, కథని డ్రైవ్ చేసేంత కీలకమైన సీన్లలా లేవవి. కనుక ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది తప్ప ఇంపాక్ట్ కలిగించిందని మాత్రం చెప్పలేం.

వైవా హర్షా ఉన్నా వేస్టయ్యాడు. అతని మీద రాసుకున్న సీన్లు, డైలాగులు పెద్దగా నవ్వించలేదు. డాన్ గా సునీల్ ది ఒక సర్ప్రైజ్ పాత్ర. తండ్రిగా నరేష్ ఓకే. “35” లో హీరోగా మెప్పించిన విశ్వదేవ్ రాచకొండ కూడా తన పాత్ర వరకు బాగానే చేసాడు. హర్షవర్ధన్, రోడీస్ రఘు సరైన పాత్రలు పోషించారు.

టెక్నికల్ గా చూసుకుంటే పాటలు పరమ వీక్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని జస్ట్ ఓకే అనొచ్చు తప్ప, ఇప్పుడున్న ట్రెండ్ కి, స్టాండర్డ్ కి ఇంకా చాలా బాగుండాల్సిన పరిస్థితి.

అసలీ కథని హీరో ఎలివేషన్లు, బిల్డప్పులు, మూస పాటలు లేకుండా ఒక ఆర్గానిక్ ఫ్లోలో తీయొచ్చు. అప్పుడు ఇది “మహారాజ” టైపు సినిమా అనేంత గొప్పగా తయారై ఉండేది. సో-కాల్డ్ మాస్ జనం కోసం అనే నెపంతో.. భారీగా ఖర్చు పెట్టేసి, ఫార్ములాకి లోబడి సినిమా తీస్తే ఇలాగే “సగం బాగుంది”, “పావు బాగుంది” లాంటి అభిప్రాయాలే వెల్లడవుతాయి.

ఓవరాల్ గా చెప్పుకుంటే, సెకండాఫులో ట్విస్టులు, శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర హైలైట్. ఇంటర్వల్ వరకు ఓపిగ్గా కూర్చుని, విసుగొచ్చి ఇంటికెళ్లిపోకుండా ధైర్యం చేసి సెకండాఫులో కూర్చుంటే తప్ప “బాగానే ఉందే” అనే ఫీలింగ్ రాదు. విడుదలకి ముందే ఈ “మెకానిక్” మొదటి సగాన్ని రిపేర్ చేసుకుని రోడ్డెక్కాల్సింది. అలా చేయకపోవడం వల్ల డొక్కుబండిలో ప్రయాణం చేస్తున్న అనుభూతి కలిగింది చాలావరకు. మంచి కథని సక్సెస్ చేయడంలో సగమే పాసయ్యాడు ఈ “మెకానిక్ రాకీ”. బండి బ్యాక్ సైడ్ అనబడే సెకండాఫ్ పర్ఫేక్ట్ షేపులో ఉంది కానీ, ఫ్రంట్ సైడ్ అనబడే ఫస్టాఫ్ మాత్రం సొట్టపడి షేపవుట్ అయ్యింది.

బాటం లైన్: రిపేరు అవసరం

8 Replies to “Mechanic Rocky Review: మూవీ రివ్యూ: మెకానిక్ రాకీ”

  1. Director second half ni korean/hollywood film nundi ni lepi untadu, first half own writing gaa connect cheyyadaniki try chesadu, kani work kaledhu, sync kaledhu. Aa original korean/hollywood film peru chepthe, memu danne OTT lo choostamu.

Comments are closed.