టాలీవుడ్ 2024: ఇంట్లో ఈగ‌ల మోత‌, బ‌య‌ట ప‌ల్ల‌కి మోత‌!

హీరోల ఇమేజ్ లు, అభిమాన గ‌ణాల‌తో సంబంధం లేకుండా సినిమా బాగుంది అనే టాక్ తో హిట్ ను అందుకున్న తెలుగు సినిమాలు రొటీన్ గా త‌క్కువ‌గానే వ‌చ్చాయి.

2024 టాలీవుడ్ కు ఒక విచిత్ర‌మైన సంవ‌త్స‌రం. ఈ సంవ‌త్స‌రంలో భార‌త‌దేశంలో అత్య‌ధిక స్థాయి వ‌సూళ్ల‌ను సంపాదించుకున్న సినిమాల్లో.. టాప్ లో తెలుగు హీరోల సినిమాలే నిలుస్తున్నాయి! క‌లెక్ష‌న్ల విష‌యంలో బాలీవుడ్ కూడా టాలీవుడ్ కు ఈ సంవ‌త్స‌రం గ‌ట్టి పోటీ ఇవ్వ‌లేక‌పోయింది. 2024లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించుకున్న భార‌తీయ సినిమా క‌ల్కీ 2898 ఏడీ నిలుస్తోంది. ఇంకా పూర్తి లెక్క‌లు తేల‌న‌ప్ప‌టికీ వ‌సూళ్ల‌లో రెండో స్థానం పుష్ప 2 దేన‌ని ఇప్ప‌టికి చెప్పొచ్చు. పుష్ప 2 పూర్తి వ‌సూళ్లు క‌ల్కిని దాట‌తాయో లేదో చూడాల్సి ఉంది. అత్య‌ధిక వ‌సూళ్ల‌లో మూడో స్థానంలో బాలీవుడ్ సినిమా స్త్రీ 2 నిలుస్తోంది! ఇలా భారీ వసూళ్ల విష‌యంలో తెలుగు సినిమా మ‌రో సారి త‌న స‌త్తా చూపించింది.

బాహుబ‌లి సీరిస్, ఆర్ఆర్ఆర్, స‌లార్ .. ఇలాంటి సినిమాల ప‌రంప‌ర‌లో టాలీవుడ్ 2024లోనూ ప్యాన్ ఇండియా లెవ‌ల్లో త‌న ఆధిప‌త్యాన్ని చాటుకుంది! వ‌సూళ్లు అంటే తెలుగు సినిమా, తెలుగు సినిమా అంటే వ‌సూళ్లు అన్న‌ట్టుగా.. పూర్తి ఆధిప‌త్యం అయితే కొన‌సాగింది. తెలుగు సినిమాలు వ‌స్తున్నాయంటే.. ప్ర‌త్యేకించి ఉత్త‌రాది అయినా వీటిపై అమితాస‌క్తిని చూపించే ప‌రిస్థితిని ఈ సంవ‌త్స‌రం వ‌చ్చిన తెలుగు సినిమాలు కొన‌సాగించాయి! ఇది నాణేనికి ఒక‌వైపు!

ఈ వైపు గురించినే మ‌రింత‌గా మాట్లాడుకుంటే.. భారీ స్థాయి వ‌సూళ్ల‌ను, ఓపెనింగ్స్ ను పొందిన సినిమాలు ఈ సంవ‌త్స‌రం మ‌రిన్ని ఉన్నాయి. దేవ‌ర పార్ట్ వ‌న్, చిన్న సినిమాగా విడుద‌లైన భారీ వ‌సూళ్ల‌ను పొందిన హ‌నుమాన్ వంటి సినిమాలు కూడా తెలుగునాట ఆవ‌ల డ‌బ్బులు రాబ‌ట్టుకున్నాయి. ఇలా ఇండియా మొత్తం ఫిల్మ్ ఫీవ‌ర్ ను తెచ్చిపెట్టిన క‌నీసం ఆర‌డ‌జ‌ను సినిమాల‌ను విడుద‌ల చేసిందంటే ఇది టాలీవుడ్ స్థాయి మ‌రింత మెరుగుప‌డ‌టం అనే చెప్పొచ్చు!

ప్ర‌త్యేకించి క‌ల్కీ, పుష్ప 2 సినిమాల విడుద‌ల విషయంలో తెలుగు వారికి ధీటుగా ఇత‌ర భాష‌ల వాళ్లు ఆస‌క్తిని చూపించారు. బాలీవుడ్ సినిమాల‌కు మించిన క్రేజ్ తో ఈ సినిమాలు విడుద‌ల అయ్యాయి తెలుగు రాష్ట్రాల అవ‌త‌ల‌! మ‌రి ఆ అంచ‌నాల‌ను అవి ఏ మేర‌కు అందుకున్నాయి? అనేది వేరే చ‌ర్చ‌! అయితే ఆస‌క్తిని క్రియేట్ చేయ‌డంలో తెలుగు సినిమాలు సూప‌ర్ స‌క్సెస్ అయ్యాయి. మ‌న మార్కెటింగ్ టెక్నిక్స్ ఒక స్థాయిలో ఉన్నాయ‌ని చెప్పొచ్చు. ఈ రెండు సినిమాల టాక్, రిజ‌ల్ట్స్ ను చూసినా.. తెలుగునాట‌, ద‌క్షిణాదిన క‌న్నా.. ఉత్త‌రాదిన ఎక్కువ ఆస‌క్తిని సంపాదించాయి. ఒక‌వేళ తెలుగు రాష్ట్రాల్లోలా అక్క‌డ కూడా ఈ సినిమాల టికెట్ల రేట్ల‌ను చిత్తానికి అమ్ముకునే ప‌రిస్థితి అయితే.. వీటి క‌లెక్షన్లు ఇంకా రెట్టింపు స్థాయిలో ఉండేవేమో!

అయితే ఎంత‌సేపు మాట్లాడుకున్నా.. తెలుగు సినిమా అంటే క‌లెక్షన్లు, టికెట్ రేట్ల మీద ఆధార‌ప‌డ‌టం గురించినే మాట్లాడుకోవాల్సి వ‌స్తోంది! ఇదే ఈ టాలీవుడ్ విష‌యంలో పూర్తి నిస్పృహ‌ను క‌లిగించే అంశం! ఈ సంవ‌త్స‌రం ఇది ఎంత ప‌తాక స్థాయికి వెళ్లిందంటే.. భారీ స్థాయి టికెట్ రేట్ల‌కు జ‌డిసి ప్రేక్ష‌కులే థియేట‌ర్ల వైపుకు వెళ్ల‌డానికి సాహ‌సించ‌ని ప‌రిస్థితిని కూడా టాలీవుడ్ మూవీ మేక‌ర్లు తీసుకొచ్చారు! ప్ర‌భుత్వాలు కూడా సినిమా వాళ్లు చెప్పిన‌ట్టుగా టికెట్ల రేట్ల‌ను పెంచేయ‌డంతో.. ప్ర‌జ‌లే సినిమాల‌ను చూడ‌టానికి భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది! తొలి రెండు మూడు రోజుల టికెట్ల రేట్ల‌కు జ‌డిసి… సోమ‌వారం నుంచి సినిమా సంగ‌తి చూసుకుందామ‌ని కొంద‌రు అనుకుంటే, రెండో వారానికి సినిమాపై వ‌చ్చే టాక్ ను చూసి.. ఇక ఓటీటీలో చూసుకుందాంలే అనే ప‌రిస్థితీ వ‌చ్చింది! కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన‌ట్టుగా త‌యార‌వుతూ ఉంది ఇక్క‌డ ప‌రిస్థితి.

సినిమాల‌పై ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవ‌డానికి, వీలైన‌న్ని ఎక్కువ థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసి .. భారీ టికెట్ రేట్ల‌ను పెట్టి, వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ను చూపించుకోవ‌డానికి ప్ర‌భుత్వాల‌ను కూడా దారికి తెచ్చుకుంటే.. ఇంత చేశాకా ప్ర‌జ‌ల‌కు ఈ మొత్తం వ్య‌వ‌హారంపై విర‌క్తి పుడుతూ ఉంది. అంత భారీ టికెట్ పెడితే .. మిమ్మ‌ల్ని ఎవ‌రు టికెట్ కొని చూడ‌మ‌న్నారు.. ప్ర‌శ్న‌కు ఆ సినిమా వైపు వెళ్ల‌కుండా ప్రేక్ష‌కులే స‌మాధానం ఇచ్చే ప‌రిస్థితి వ‌చ్చింది! సినిమా టికెట్ ధ‌ర విష‌యంలో ఇప్ప‌టికే తెగే వ‌ర‌కూ లాగారు. అయితే ఇప్పుడు దాదాపు అది తెగిపోయిన‌ట్టుగా ఉంది. సినిమా టికెట్ ను నాలుగైదు వంద‌ల రూపాయ‌ల ధ‌ర‌కు తీసుకెళ్లిపోయిన నేప‌థ్యంలో, అధికారికంగానే విడుద‌ల అయిన రెండు మూడు రోజుల పాటు ఇలా, ఇంత‌కు మించిన ధ‌ర‌కు అమ్ముకుంటున్న నేప‌థ్యంలో.. ఇంత ధ‌ర అయితే చూడ‌లేమంటున్నారు ప్రేక్ష‌కులు. అందుకు తొలి రెండు రోజుల్లోనే ఖాళీగా క‌నిపిస్తున్న సీట్లే రుజువు! మ‌రి ఈ ప‌రిస్థితిని ఇలాగే కొన‌సాగిస్తే.. అది సినీ ప‌రిశ్ర‌మ‌కే ప్ర‌మాదం!

ప్ర‌భుత్వాలు త‌లూపుతున్నాయి క‌దా, అభిమానులు ఊగిపోతున్నారు క‌దా.. అని రెచ్చిపోతే.. పరిస్థితిలో తేడా వ‌చ్చేయ‌డానికి పెద్ద స‌మ‌యం లేద‌ని ఈ ఏడాది రుజువు అయ్యింది. ఇలా టికెట్ ధ‌ర‌లు ప్ర‌మాద‌క‌ర‌మైన స్థాయికి వెళ్లిపోయి, స్టార్ హీరోల సినిమాల‌కు ప్ర‌మాదఘంటిక‌ల‌ను మోగించ‌డ‌మ మొద‌లైన సంవ‌త్స‌రంగా కూడా 2024 ను ప్ర‌స్తావించుకోవ‌చ్చు. కేవ‌లం క్రేజ్ ను బ‌ట్టి కాకుండా.. టాక్ ను బ‌ట్టి టికెట్ ధ‌ర‌ల‌ను పెంచుకునే ప‌రిస్థితి రావ‌డం మొద‌లుకావొచ్చు భ‌విష్య‌త్తులో! అలాగే భారీ విడుద‌ల అని చెప్పి.. సోలో రిలీజ్ డేట్ ను చూసుకుని.. వంద‌కు 90 శాతం థియేట‌ర్ల‌లో ఒకే సినిమాను ప్ర‌ద‌ర్శించేసి..అయిన కాడికి క్యాష్ చేసుకునే ధోర‌ణి కూడా అంత మెరుగైందేమీ కాద‌ని ఈ ఏడాదే తెలుగు సినిమా నిరూపించింది.

వంద థియేట‌ర్ల‌లో విడుద‌లైతే ఎంత మంది తొలి రోజు థియేట‌ర్ కు వెళ‌తారో, రెండు వంద‌ల థియేట‌ర్ల‌లో విడుద‌లైనా అంతే మంది ఆ రోజున వెళ్తార‌ని ఈ ఏడాది ప‌లు సినిమాల భారీ విడుద‌ల‌ల‌తో రుజువు అయ్యింది. కాబ‌ట్టి.. పోటీ లేక‌పోయినా.. భారీ ఎత్తున విడుద‌ల‌ల వ‌ల్ల మ‌రుస‌టి రోజు సంగ‌తిని ప‌క్క‌న పెట్టి విడుద‌ల రోజునే తేడా వ‌స్తుంద‌ని, థియేట‌ర్ల రెంట్లు అద‌న‌పు భారం అని కూడా సినిమా రూప‌క‌ర్త‌ల‌కు ఈ ఏడాది వ‌చ్చిన సినిమాలు ప్రాక్టిక‌ల్ గా నిరూపించి చూపాయి!

ఇలా చెబుతూ పోతే.. భారీ విడుద‌ల‌లు, భారీ క‌లెక్ష‌న్లు అనేవి సినిమాల‌కు కేవ‌లం పాజిటివ్ కాద‌ని, వీటి వ‌ల్ల సినిమా ఆడే రోజుల సంఖ్య మ‌రింత కుంచించుకుపోతూ, థియేట‌ర్ల రెంట్ల భారం మ‌రింత‌గా ప‌డుతోంద‌ని స్ప‌ష్టం అవుతూ ఉంది. అయితే వీటి గురించి మాట్లాడ‌టానికి నిర్మాత‌లు రెడీగా లేరు. వీటి గురించి మాట్లాడితే హీరోల‌కు ఎంత కోపం వ‌స్తుందో వారికి తెలుసు కాబ‌ట్టి, కిక్కురుమ‌నే ప‌రిస్థితి కూడా లేదు! ఇలా హీరోల‌స్వామ్యంగా టాలీవుడ్ ప‌రిస్థితి కొన‌సాగుతూ ఉంది!

ఇంట్లో ఈగ‌ల మోత‌, బ‌య‌ట ప‌ల్ల‌కి మోత‌!

తెలుగు సినిమాలు భారీ వ‌సూళ్ల‌ను సంపాదించుకుంటున్నాయి, భారీ విడుద‌ల‌లు నోచుకుంటున్నాయి, ప్యాన్ ఇండియాలుగా వెలుగుతున్నాయి, బాలీవుడ్ కు మించి న గుర్తింపును సంపాదించుకుంటున్నాయి.. ఇవ‌న్నీ రుజువ‌వుతున్న స్టేట్ మెంట్లే! అయితే.. ఇలా బ‌య‌ట ప‌ల్ల‌కి మోత‌లు ద‌క్కుతున్నా, ఇంట్లో ఈగ‌ల మోత అన్న‌ట్టుగా.. మంచి సినిమాల కోసం తెలుగు ప్రేక్ష‌కులు మ‌ళ్లీ ప‌క్క భాష‌ల సినిమాల‌ను నెత్తికెత్తుకోక త‌ప్పని ప‌రిస్థితి కూడా కొన‌సాగుతూ ఉంది! ఈ ఏడాది తెలుగు వాళ్లు ఆద‌రించిన సినిమాల్లో ప‌క్క భాష‌ల సినిమాల వాటా గ‌ణ‌నీయంగా ఉంది!

త‌మిళ సినిమా మ‌హ‌రాజా తెలుగువాళ్లు ఇష్ట‌ప‌డిన సినిమాల్లో ఒక‌టి! మ‌ల‌యాళ సినిమా మ‌న్యుమేల్ బాయ్స్ అనువాదం అయ్యి తెలుగునాట కూడా ఆడియ‌న్స్ ను కూడా థియేట‌ర్ల‌కు ర‌ప్పించి, వారిని వెంటాడింది. ఇక మ‌హారాజా, మ‌న్యుమేల్ బాయ్స్ వంటి సినిమాలు ఓటీటీల్లో తెలుగునాట విప‌రీత‌మైన వీక్ష‌కాదార‌ణ పొందాయి. వీటి గురించి సోష‌ల్ మీడియాలో చ‌ర్చోప‌చ‌ర్చ‌లు న‌డిచాయి. భారీ వ‌సూళ్లు, భారీ ఓపెనింగ్స్ ల సంగ‌తిని ప‌క్క‌న పెడితే.. ప్రేక్ష‌కుడు ఎప్పుడూ కోరుకునేది మంచి సినిమా! చూసినందుకు ఒక మంచి ఫీల్ కోరుకుంటాడు. అలాంటి కోరిక‌ల‌ను తీర్చే తెలుగు సినిమాలు చాలా త‌క్కువ‌గానే వ‌చ్చిన సంవ‌త్స‌రం ఇది.

హీరోల ఇమేజ్ లు, అభిమాన గ‌ణాల‌తో సంబంధం లేకుండా సినిమా బాగుంది అనే టాక్ తో హిట్ ను అందుకున్న తెలుగు సినిమాలు రొటీన్ గా త‌క్కువ‌గానే వ‌చ్చాయి. ల‌క్కీ భాస్క‌ర్ త‌ర‌హాలో హిట్ గా నిలిచిన సినిమాల వాటా 2024లో చాలా త‌క్కువ‌గానే ఉంది. ఆ సినిమా కూడా ఒక బ‌డా బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన సినిమా కాబ‌ట్టి.. ప‌బ్లిసిటీకి అన్ని మార్గాల‌ను వాడటం అనేది అద‌న‌పు అడ్వాంటేజ్ గా నిలిచింది.

2024 సంవ‌త్స‌రం సంక్రాంతికి భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన గుంటూరు కారం సినిమా అంచనాల‌ను అందుకోలేక చ‌తికిల‌ప‌డ‌టంతో భారీ ఫెయిల్యూర్ తో మొద‌లైంది. ఆదిలోనే అలాంటి హంసపాదు ప‌డింది. పండ‌గ‌కే వ‌చ్చిన నా సామిరంగా ఫ‌ర్వాలేద‌నిపించ‌గా, సైంధ‌వ్ ప్రేక్ష‌కుల‌ను బెద‌ర‌గొట్టింది. ఆ ప‌రిస్థితుల‌ను హ‌నుమాన్ బాగా క్యాష్ చేసుకుంది! ఆ త‌ర్వాత ప‌లు చిన్న సినిమాల‌తో తొలి క్వార్ట‌ర్ గ‌డిచిపోయింది. వాటి మ‌ధ్య‌న వ‌చ్చిన ఆప‌రేష‌న్ వాలెంటైన్ డిజాస్ట‌ర్ గా న‌మోదైంది. ఆ వెంట‌నే వ‌చ్చిన గోపిచంద్ భీమా అదే స్థాయి ఫ‌లితాన్ని అందుకుంది. దాంతో పాటే విడుద‌లైన గామి ఆస‌క్తిని రేకెత్తించి మంచి వ‌సూళ్ల‌ను పొందింది. ఇక ప్రేక్ష‌కులు దిక్కుతోచ‌ని స్థితిలో ఉండ‌గా విడుద‌లైన టిల్లూ స్క్వైర్ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుని వంద కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల మార్కును దాటి బ‌డ్జెట్ తో పోలిస్తే సూప‌ర్ హిట్ గా నిలిచింది.

రెండో క్వార్ట‌ర్ ఆరంభంలో భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఫ్యామిలీ స్టార్ ట్రోలింగ్ మెటీరియ‌ల్ గా మిగిలిపోయింది. పెట్టిన బ‌డ్జెట్ లో స‌గం స్థాయి వ‌సూళ్ల‌ను కూడా సాధించ‌లేనంత స్థాయి డిజాస్ట‌ర్ గా ఇది నిలిచింది. ఆ స‌మ‌యంలోనే గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది, ఆ ఒక్క‌టీ అడ‌క్కూ వంటి ప్రేక్ష‌కుల్లో కాస్తో కూస్తో ఆశ‌లు రేపిన సినిమాలు వ‌చ్చాయి. అయితే ఇవేవీ పెట్టుకొన్న కొద్ది పాటి ఆశ‌ల‌కు కూడా న్యాయం చేయ‌లేక‌పోయాయి! కృష్ణ‌మ్మ‌, ప్ర‌తినిధి 2, భ‌జేవాయువేగం, గమ్ గ‌మ్ గ‌ణేషా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మ‌న‌మే, హ‌రోంహ‌రా.. ఇలాంటి వ‌ర‌స డిజాస్ట‌ర్ల‌తో బాక్సాఫీస్ వెళ‌వెళ బోయింది. ఆ స‌మ‌యంలో ప్రేక్ష‌కుల దృష్టంతా థియేట‌ర్ల మీద కాకుండా ఓటీటీ మీదే నిలిచింది. అక్క‌డ విడుద‌లైన త‌మిళ‌, మ‌ల‌యాళ అనువాద సినిమాల‌తో.. తెలుగు సినిమా చ‌ర్చ‌లో లేకుండా పోయిన ప‌రిస్థితుల్లో క‌ల్కీ వ‌చ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసి సెకెండ్ క్వార్ట‌ర్ ను ముగించింది.

ఒక మూడో క్వార్ట‌ర్ లో మ‌ళ్లీ క‌థ మొద‌ట‌కు వ‌చ్చింది. క‌ల్కీ థియేట‌ర్ల‌ను ఖాళీ చేసి వెళ్లిన త‌ర్వాత మ‌ళ్లీ ఊపునిచ్చే సినిమాల‌కు లోటు ఏర్ప‌డింది. క‌మిటీ కుర్రోళ్లు ఊర‌ట‌నివ్వ‌గా, డ‌బుల్ ఇష్మార్ట్, మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ సినిమాలు ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టి.. ఈ ఏడాది టాప్ డిజాస్ట‌ర్ సినిమాల్లో ముందు వ‌ర‌స‌లో నిలిచాయి. ఆయ్, మారుతిన‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం సినిమాలు థియేట‌ర్లో క‌న్నా ఓటీటీ విడుద‌ల త‌ర్వాత మెచ్చుకోబ‌డ్డాయి! హీరో క‌న్నా విల‌న్ హైలెట్ గా స‌రిపోదా శ‌నివారం మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకుంది. దేవ‌ర పార్ట్ వ‌న్ విడుద‌ల‌తో మూడో క్వార్టర్ ముగింపులో భారీ సినిమా వ‌చ్చింది.

నాలుగో క్వార్ట‌ర్ లో స్వాగ్, విశ్వం సినిమాలు కూడా ఓటీటీల్లో ఆడాయి కానీ, థియేట‌ర్ల‌లో కాదు. ఆ త‌ర్వాత క‌, ల‌క్కీ భాస్క‌ర్, అనువాద సినిమా అమ‌రన్ లు ఒకేవారంలో వ‌చ్చి బాక్సాఫీస్ కు కాస్త ఊర‌ట‌ను ఇచ్చాయి. వాటి వాటి స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఈ మూడు సినిమాలూ మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకుని సేఫ్ జోన్లో నిలిచాయి. అదే స‌మ‌యంలో అపుడో ఇపుడో ఎపుడో వంటి సినిమాలు వ‌చ్చి డిజాస్ట‌ర్ల ప‌ర్వాన్ని కొన‌సాగించాయి. సుహాస్ సినిమా జ‌న‌క అయితే గ‌నుక అతడి వైవిధ్య దారిలోనే కొన‌సాగినా, త‌గిన ఫ‌లితాన్ని అందుకోలేదు! ఆ సీజ‌న్లో టాప్ డిజాస్ట‌ర్ గా, ఈ ఏడాది భారీ డిజాస్ట‌ర్ల‌లో ఒక‌టిగా మట్కా నవంబ‌ర్ లో విడుద‌లైంది. అదే స‌మ‌యంలో వ‌చ్చిన మెకానిక్ రాఖీ మంచి ఫ‌లితాన్ని పొందింది. డిసెంబ‌ర్ ఐదున పుష్ప 2 రిలీజ్ తో మ‌రే సినిమా పోటీకి రాలేదు!

ప్యాన్ ఇండియా ఆరాటం, ప‌క్క భాష‌ల ఆదిప‌త్యం!

ఇక ఈ ఏడాదికి సంబంధించిన మ‌రో విశేషం.. ప‌క్క‌భాష‌ల న‌టులు, హీరోలు తెలుగునాట పూర్తిగా తిష్ట వేసుకుంటూ పోవ‌డం! ఇత‌ర భాష‌ల హీరోల‌కు గ‌తంతో పోలిస్తే తెలుగునాట మార్కెట్ మ‌రింత పెరిగింది. ఇత‌ర భాష‌ల క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌కు తెలుగు సినిమాలు రెగ్యుల‌ర్ అవ‌కాశాల‌ను ఇస్తూ ఉన్నాయి! మ‌రి ఒక చిత్ర ప‌రిశ్ర‌మ ప్యాన్ ఇండియా గా మార‌డం అంటే.. అది ఇక్క‌డ న‌టీన‌టుల‌ను, టెక్నీషియ‌న్ల‌ను ఇత‌ర భాష‌ల‌కు, భార‌త దేశ స్థాయికి తీసుకెళ్ల‌డం కాకుండా.. ఇత‌ర భాష‌ల న‌టులంద‌రినీ ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌పై రుద్దుతూ వారికి రెగ్యుల‌ర్ మార్కెట్ ను ఏర్పాటు చేయ‌డం అనే సూత్రాన్ని టాలీవుడ్ అమ‌లు ప‌రుస్తూ ఉంది!

త‌మిళ హీరో ధ‌నుష్, మ‌ల‌యాళీ హీరో దుల్కర్ స‌ల్మాన్ లు ఇప్పుడు తెలుగులో దాదాపు ఫుల్ లెంగ్త్ హీరోలు అయిపోయారు. క‌మ‌ల్, ర‌జ‌నీ, మ‌మ్ముట్టీ, మోహ‌న్ లాల్ ల‌ను సైతం అనువాద సినిమాల‌త‌నే చూశాం. అయితే ఇప్పుడు ఇత‌ర భాష‌ల హీరోల‌తో ఇక్క‌డ సినిమాలు చేస్తూ వారి భాష‌ల్లోకి అనువాదం చేయించే ప‌రిస్థితి వ‌చ్చింది. అదేమంటే.. తెలుగు సినిమా, ప్యాన్ ఇండియా అంటున్నారు! ఒక త‌మిళ క‌మేడియ‌న్లు ఇప్పుడు తెలుగు సినిమాల్తో త‌ప్ప‌నిస‌రిగా మారుతూ ఉన్నారు!

క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌ను అరువు తెచ్చుకోవ‌డం కామ‌నే కానీ, ఇప్పుడు మార్కెట్ పేరుతో ఇత‌ర భాష‌ల వాళ్ల‌ను మ‌నపై రుద్దుతున్నారు! మ‌న సినిమాలు అక్క‌డ ఆడ‌టం మాటేమిటో కానీ.. ఇప్పుడు విల‌న్లు, క‌మేడియ‌న్లు, హీరోలు.. ఇలా అంతా ప‌క్క భాష‌ల వాళ్లే తెర‌పై క‌నిపిస్తున్నారు. ఒక ద‌శ‌లో అనువాద సినిమాల ఆధిప‌త్యం తెలుగునాట సాగింది. ఆ త‌ర్వాత త‌మిళ ద‌ర్శ‌కుల‌కు మ‌న స్టార్ హీరోలు పోటీలు ప‌డి డేట్లు ఇచ్చి దెబ్బ తిన్నారు, అనువాద సినిమాల‌తో ఫేమ‌స్ అయిన విక్ర‌మ్, సూర్య, కార్తీ వంటి వాళ్ల‌కు తెలుగునాట అనువాద మార్కెట్ ఇప్ప‌టికీ స్ట‌డీగా కొన‌సాగుతూ ఉంది.

ఇప్పుడు డైరెక్ట్ త‌మిళ‌, మ‌ల‌యాళీ, క‌న్న‌డ హీరోలు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు, వారికి తోడు క‌మేడియ‌న్లు, విల‌న్లు తెలుగు సినిమాల్లో క‌నిపిస్తూ ఉన్నారు. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ల‌కు కూడా త‌మిళ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌ను పిలిపించుకుని, వ‌చ్చీ రాని తెలుగు వారి చేత మాట్లాడించే ప‌రిస్థితి వ‌చ్చేసింది! మ‌రి ప్యాన్ ఇండియా అంటే ఇటుది అటు వెళ్ల‌డ‌మా, లేక అటంతా వ‌చ్చి ఇటు ప‌డ‌ట‌మో అర్థం కాని ప‌రిస్థితి కూడా 2024 సినిమాలు చూపించాయి!

7 Replies to “టాలీవుడ్ 2024: ఇంట్లో ఈగ‌ల మోత‌, బ‌య‌ట ప‌ల్ల‌కి మోత‌!”

  1. Pushpa 2 had this issue. Day 1 tickets are available but we couldn’t go due to high price . 1st 3 days all collections were fake. It was a decent movie but spoiled by greedy producers.

  2. నిర్మాతలకు , డిస్ట్రిబ్యూటర్స కి టికెట్ ధర విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. వాడి ప్రొడక్ట్ వాడి ఇష్టం , అసలు ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఎందుకు? సినిమా చూడు అని ఎవడూ ఎవరినీ బలవంతం చేయలేరు కదా. ఈ విషయం లో కోర్టు కి వెళ్ళాలి , నిర్మాత లు

  3. అతని నోటి దూల తగ్గాలి,

    తొలి పొగరు దిగాలి అనుకుంటారే తప్ప జై ల్ శి క్ష పడాలి అని మెగా అభిమానులు ఎవరూ కోరుకోరు. అది కూడా ప్రత్యక్షంగా తన ప్రమేయం లేని పొరపాటు కూడా.

    తెలిసో తెలీకో తప్పుడు అంచనాలతో

    తప్పటడుగులు వేసి గాల్లో మేడలు క్రేజీగా కట్టుకొని ఉండచ్చు.

    ఇటువంటి సమయాల్లోనే బంధం విలువ తెలిసొస్తుంది. క్లౌడ్స్ క్లియర్ అయి గ్రౌండ్ రియాలిటీ తెలిసొస్తుంది.

    విషయం తెలిసిన వెంటనే తన ముగ్గురు మామలు కేర్ తీసుకుంటున్నారు తప్ప, నీ ఫ్రెండ్ వాళ్ళో వైఫ్ ఫ్రెండ్ వాళ్ళ హజ్బెండో కాదు.

Comments are closed.