కొణిదెల పవన్ కల్యాణ్ ఓరిమి గల చతురుడు

ఓరిమి ఉన్నవాడికి మంచి ఫలితం లభిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. పవన్ కల్యాణ్ అందుకు నిదర్శనం అని అనాలి.

Strength is nothing but, knowing your Weakness నీ బలహీనతల గురించిన పూర్తి అవగాహన ఉండడమే.. అసలైన బలం! అవును– తాను బలవంతుడనని విర్రవీగేవాడు ఏదో ఒక ప్రతికూల క్షణంలో బోల్తాపడతాడు. కానీ.. తన బలహీనతల గురించి అవగాహన ఉన్నవాడు.. ఎప్పటికీ జాగ్రత్తపడుతుంటాడు. బోల్తాపడే పరిస్థితి రాదు. బలహీనతలు తెలుసు గనుక.. శక్తికి మించిన పనులు చేయడు. నిజం చెప్పాలంటే.. అదే అతని అసలైన బలం అవుతుంది.

ఈ రెండు రకాల వ్యక్తిత్వ లక్షణాలు ఒకే వ్యక్తిలో ప్రోదిచేసుకుని కనిపించడం సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే. అందుకు మన కళ్లెదుట ఉన్న ఉదాహరణే.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్. ఆయనకు కేవలం తన బలహీనతల గురించిన అవగాహన మాత్రమే కాదు.. అపూర్వమైన ఓరిమి, సంయమనం కూడా ఉన్నాయి. ఎంత ఆవేశం ఉన్నదో, అంతటి సహనం ఉంది. తప్పటడుగులు పడినప్పుడు దిద్దుకోవడానికి వెనుకాడని.. అహంరహిత ధోరణి ఆయన బలం. అందుకే.. అన్నచాటు తమ్ముడిగా సినీరంగ ప్రవేశం చేసిన కుర్రవాడు.. ఇవాళ అన్న ఇమేజికి అందనంత ఎత్తులో.. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా, తన రెక్కల కష్టంతో, తనను తాను ప్రతిష్ఠించుకున్నాడు. పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ ప్రస్థానమే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ.. ‘‘కొణిదెల పవన్ కల్యాణ్.. ఓరిమిగల చతురుడు’’

‘‘ఒక వయసులో కమ్యూనిస్టు కాకుండా ఉండే వాడు, ఒక వయసు దాటిన తర్వాత.. కమ్యూనిస్టు ఆలోచనల నుంచి బయటకు రాకుండా ఉండేవాల్లు ఎవరూ ఉండరు’’ అని ఒక ముతక సామెత ఉంటుంది. ఈ తరహా సిద్దాంతాన్ని కొంచెం అటు ఇటుగా మార్చి చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో ‘ఒక దశలో ఆలోచనా రహితమైన దూకుడుతోను.. ఒక దశ దాటిన తర్వాత.. మానావమానాలు లెక్కించని లౌక్యమూ, తగ్గవలసి వస్తే వెనుకాడని పరిణతి లేనివాళ్లు ఉండరు’ అని చెప్పుకోవచ్చు. ఈ రకమైన సూత్రాన్ని సిద్ధాంతీకరిస్తే గనుక.. ఆ సిద్ధాంతానికి అచ్చు గుద్దినట్టుగా సరిపోయే వ్యక్తిత్వం గల నాయకుడు పవన్ కల్యాణ్ మాత్రమే.

పవన్ కల్యాణ్ ప్రజారాజ్యం పార్టీలో యువజన విభాగానికి అధ్యక్షుడుగా ఉన్నప్పటి సంగతులను గుర్తు చేసుకోండి. అప్పుడున్న ఆవేశాన్ని గుర్తు చేసుకోండి.. వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి అనల్ప ప్రజాదరణ గల నాయకుడిని బహిరంగ వేదికల మీదినుంచి ఆయన ఎలాంటి మాటలు అన్నారో.. ఎలాంటి వివాదాల్లో చిక్కుకున్నారో కూడా గుర్తు చేసుకోండి. యువరాజ్యం అంటే అది ఒక ప్రత్యేకరాజ్యం అనే తరహాలో అప్పట్లో పవన్ కల్యాణ్ వ్యవహరించారు. చిరంజీవి పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత.. తనకు ఎంతో అయిష్టమైన నిర్ణయం అయినప్పటికీ.. మెదలకుండా ఊరుకుండిపోయారు.

జనసేన పార్టీ ఆవిర్భావం చాలా ఘనంగా ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవిని కూడా కాంగ్రెసుతో విలీన నిర్ణయానికి తూర్పార పట్టారు. అయితే చాలా వ్యూహాత్మకంగా 2014 ఎన్నికల్లో పోటీచేయకుండా కూటమి విజయానికి పనిచేశారు. అప్పట్లో ఆయన కూటమికోసం పని చేసినంత మాత్రాన అదంతా కూడా.. ఆయనలోని పరిణతి అనుకోవడానికి వీల్లేదు. అప్పటికి తను పెట్టిన జనసేన బొడ్డూడని పార్టీ అనే సంగతి ఆయనకు తెలుసు. ఆ ఒక్క ఎన్నికలకు ఊరుకుంటే.. ఆ తర్వాత.. ఎన్నికల ప్రపంచం మొత్తం తనదే అనే వ్యూహంతో బహుశా ఆయన 2014లో ఉన్నారు. కూటమి గెలిచింది. అయిదేళ్లపాటూ చంద్రబాబునాయుడు కు సహకరిస్తూ, చేదోడు వాదోడుగా ఉంటూ సాగిపోయారు. 2019 ఎన్నికలకు సరిగ్గా ముందు.. ఒక్కసారిగా పవన్ కల్యాణ్ లో చైతన్యం వచ్చింది.

పైన చెప్పుకున్న సిద్ధాంతం ప్రకారం మొదటి దశలోని వ్యక్తిత్వంతో ఆయన ఆ సమయంలో ఉన్నారు. ఆలోచనా రహితమైన దూకుడు ఉన్న దశ అది. 2019 ఎన్నికల్లో తన పార్టీ సొంతంగా బరిలోకి దిగితే.. రాష్ట్రవ్యాప్తంగా ఘనవిజయం సాధించడం గ్యారంటీ అనే భ్రమలోనే ఉన్నారు.

గెలిచేది లేదని తెలుసు కానీ, పార్టీ రాష్ట్రవ్యాప్తంగా వేళ్లూనుకోవడానికి ప్రజలకు పరిచయం కావడానికి రాష్ట్రమంతా పోటీచేయడం ఒక్కటే మార్గమనే ఉద్దేశంతో మాత్రమే ఒంటరిగా పోటీచేశారని కొందరు అభిమానులు వ్యాఖ్యానిస్తారు గానీ అది నిజం కాదు. అలాగే ఆ ఎన్నికల్లో ఆయన బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు గానీ.. అదేమీ ప్రభావశీలమైన పొత్తు కాదు. ఒంటరిగా పోటీచేస్తున్నట్టే భావించవచ్చు. తాను సొంతంగా పోటీచేసి అధికారంలోకి వచ్చేస్తున్నానని, సీఎం అయిపోతున్నానని పవన్ కల్యాణ్ చాలా బలంగా అనుకున్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన కనుల ఎదుట పొరలు తొలగిపోయాయి.

పరాజయం ఎదురైన వెంటనే.. ఆయన ఎన్డీయే కూటమిలోకి ఎంట్రీ ఇచ్చారు. సీట్ల బలం ఉన్న నాయకుడు కాకపోయినప్పటికీ.. పవన్ కల్యాణ్ అపరిమిత ప్రజాదరణ కారణంగా.. అలాంటి బంధానికి కేంద్రంలో అధికారంలో ఉన్న భాజా అంగీకరించింది. కిందామీదా పడుతూ.. భాజపాను వీడకుండా ఆ జట్టులోనే ఉన్నారు. 2024 ఎన్నికలు వచ్చిన వేళకు తెలుగుదేశాన్ని కూడా ఆ జట్టులోకి తీసుకోవడంలో.. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడడంలో అంతా తానై, కీలకమైన ఇరుసుగా మారి వ్యవహరించారు.

చంద్రబాబు జైల్లో ఉండగా..

నిజానికి 2024 ఎన్నికల నాటికి పార్టీల పొత్తు ఊహాగానాల్లో సాగుతూ వచ్చిందే తప్ప.. వాస్తవరూపం దాల్చడం చాలా చిత్రంగానే జరిగిందని చెప్పాలి. చంద్రబాబునాయుడు ఓడిపోయిన రోజు నుంచి కూడా.. సామాజిక వర్గం పరంగా ఎంతో బలమైన వర్గానికి ప్రతినిధి అయిన పవన్ కల్యాణ్ తో మళ్లీ జట్టు కట్టాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఆయన తన వన్ సైడ్ లవ్ ను బహిరంగంగా వ్యక్తం చేశారు కూడా. కానీ పవన్ వైపు నుంచి కించిత్తు స్పందన లేదు.

అలాంటి ఉన్నపళంగా.. పవన్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని.. ఎన్నికలకు వెళ్లబోతున్నామని, రాష్ట్రంలో జగన్ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వకుండా చూస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసే వాతావరణాన్ని సందర్భాన్ని స్వయంగా జగన్మోహన్ రెడ్డి కల్పించారు. చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు.. పరామర్శకు వెళ్లిన పవన్ కల్యాణ్ అప్పటికప్పుడు.. పొత్తుల సంగతిని కూడా ప్రకటించేశారు. అరెస్టు జరగకపోయి ఉన్నా సరే.. పొత్తు ప్రకటన వచ్చేదే! కానీ కొంత ఆలస్యం అయ్యేది. అంత తొందరగా ఆ ప్రకటన రావడం అనేది కేవలం జగన్ పుణ్యమే.

ఒకవైపు బిజెపితో వారి కూటమిలో భాగస్వామిగా ఉంటూ మరోవైపు తెలుగుదేశంతో కలిసి పోటీచేస్తామని ప్రకటించిన తర్వాత.. రాగల ఒత్తిడిని ఎదుర్కోవడంలోనే పవన్ కల్యాణ్ సంయమనం పరిణతి మనం అర్థం చేసుకోవాలి. అప్పటికి ఆయనలోని రాజకీయ చతురత, లౌక్యనీతి పూర్తిగా వికసించాయి. పొత్తు ప్రకటన గురించి ప్రత్యర్థులు ఎవరు ఎలాంటి వెటకారాలు చేసినా.. పవన్ కల్యాణ్ పట్టించుకోలేదు. చాపకింద నీరులా తన పని తాను చేసుకుపోయారు.

చంద్రబాబునాయుడును ఎన్డీయే కూటమిలోకి అనుమతించాలా వద్దా అనే విషయంలో బిజెపిలో చాలా తర్జన భర్జనలు జరిగాయి. ఏపీలో అసెంబ్లీని దక్కించుకోవడం బిజెపి లక్ష్యం కాదు. కానీ.. పవన్ కల్యాణ్ తో ఉన్న పొత్తు బంధాన్ని వాడుకుని.. ఏపీలో బలమైన పార్టీగా/కూటమిగా ఎదగాలని వారు అనుకున్నారు. చంద్రబాబును కూడా జట్టులోకి రానిస్తే ఆ పాచిక పారదని భావించారు. వారు ఈ మీనమేషాలు లెక్కిస్తుండగానే.. వారిని ఒప్పించడానికి పవన్ కల్యాణ్ నానా పాట్లు పడ్డారు. ఢిల్లీ పెద్దలను పొత్తులకు ఒప్పించేందుకు నానా మాటలు పడాల్సి వచ్చిందని ఆయన స్వయంగా చెప్పుకున్నారు కూడా.

అక్కడే ఆయనలోని పరిణతి మనకు కనిపిస్తుంది. ఆయన లెక్కవేసుకున్నది ఒక్కటే. ఎట్టి పరిస్థితుల్లోనూ 2024 ఎన్నికల్లో అధికాకర పీఠం మీదికి వచ్చి తీరాలి. బిజెపితో మాత్రమే ఉంటే.. ఆ రెండు పార్టీలు కలిసి కొంత బలంగా ఎన్నికలపై ప్రభావం చూపగలవు తప్ప.. సీట్లు గెలవడం అసాధ్యం అని ఆయనకు తెలుసు. అందుకే త్యాగాలు చేసి మరీ మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకునేందుకు చూశారు.

అలాంటి పరిస్థితుల్లో తమకు దక్కే సీట్లు త్యాగం చేయడం అనేది జనసేన వంటి పార్టీనుంచి ఊహించలేం. సీట్ల విషయంలో బిజెపి డిమాండ్లు భారీగా ఉండగా, చంద్రబాబునాయుడు ఇద్దరికీ కలిపి 30 సీట్లకు మించి ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన తర్వాత.. పవన్ కల్యాణ్ చాలా సంయమనంతో కాస్త తగ్గి సీట్లు బిజెపికి త్యాగం చేసి.. మొత్తానికి ఘన విజయంలో తన పాత్రను నిరూపించుకున్నారు.

చంద్రబాబుతో అపురూప సమన్వయం

తెలుగుదేశం– జనసేన పార్టీల కార్యకర్తలు అక్కడక్కడా చెదురుమదురుగా చిన్న పంతాలకు పోతుండవచ్చు గాక.. కానీ ఈ రెండు పార్టీల అధినేతల మధ్య అపూర్వమైన సమన్వయం ఉందని ఒప్పుకుని తీరాలి. డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే ఇదివరకటి రోజుల్లో ఎలాంటి ప్రయారిటీ ఉండేదో మనకు తెలుసు. అలాంటిది చంద్రబాబు ప్రతి విషయంలోనూ పవన్ కల్యాణ్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన మాటకు విలువ ఇస్తున్నారు. ఆయన తనంతగా తీసుకుంటున్న నిర్ణయాలకు విలువ ఇస్తున్నారు. ముఖ్యమంత్రికి చెప్పకుండా పవన్ కల్యాణ్ ఒక నిర్ణయం తీసుకున్నా సరే.. దానిని గౌరవించే స్థితిలో ప్రభుత్వం ఉంది.

పవన్ కల్యాణ్ కూడా అంతకంటె ఎక్కువగానే చంద్రబాబు పాలన పట్ల గౌరవ ప్రపత్తులను ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇక అహంకారం మొదలవుతుందని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ సొంతంగా పోటీచేసే ఉద్దేశంతో రాష్ట్రమంతా పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు, భిన్నమైన వ్యూహాలను అనుసరిస్తూ సాగుతారని ఎవరైనా అంచనా వేస్తే అదంతా పొరబాటేనని పవన్ కల్యాణ్ నిరూపించారు. రాష్ట్రానికి ఇంకా సుదీర్ఘకాలం పాటు చంద్రబాబునాయుడు నాయకత్వం అవసరం ఉంది. రాష్ట్రాన్ని ఆయన మాత్రమే సరైన దిశలో నడిపించగలరు.. అనే తరహా మాటలు తరచూ వల్లిస్తూ.. ప్రభుత్వంలో తన పూర్తి బాధ్యతాయుతమైన పాత్రను నిరూపించుకుంటున్నారు పవన్ కల్యాణ్.

2019 ఎన్నికల నాటి దూకుడును పవన్ కల్యాణ్ పూర్తిగా వదలిపెట్టేశారని, ఆయన ఇప్పుడు పూర్తిగా రాజకీయలౌక్యంతో మాత్రమే నడుచుకుంటున్నారని ఏకపక్షంగా అనడానికి కూడా వీల్లేదు. అధికారంలో ఉన్నా సరే.. ఆయనలోని దూకుడు ఇంకా అలాగే మిగిలిఉంది. అనేక సందర్భాల్లో ఆయన బయటకు తీస్తున్నారు. తిరుమల లడ్డూ విషయంలో ఆయన సనాతన దీక్ష చేసినా, కాకినాడ సముద్రం ‘సీజ్ ది షిప్’ అంటూ రంకె వేసినా.. ఆయనలోని దూకుడుకు అవి నిదర్శనాలు. ఒకవైపు తన ఒరిజినాలిటీని కాపాడుకుంటూ మరోవైపు పరిపాలకుడిగా సంయమనాన్ని, పరిణతిని కూడా మరింతగా వృద్ధి చేసుకుంటూ పవన్ కల్యాణ్ ముందుకు సాగుతున్నారు.

ఓరిమి ఉన్నవాడికి మంచి ఫలితం లభిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. పవన్ కల్యాణ్ అందుకు నిదర్శనం అని అనాలి. ప్రారంభంలో ‘తన బలహీనతలను తెలుసుకోవడమే అసలైన బలం’ అని చెప్పుకున్నట్టుగా.. పవన్ కల్యాణ్ తన బలాన్ని సరిగ్గా గుర్తించారు. తన బలహీనతల్ని సరిగ్గా అంచనా వేసుకోలిగారు. అందుకే ఆయన ఇవాళ్టి తెలుగు రాజకీయాల్లో ‘ఓరిమిగల చతురుడి’గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

.. ఎల్. విజయలక్ష్మి

20 Replies to “కొణిదెల పవన్ కల్యాణ్ ఓరిమి గల చతురుడు”

  1. గెలిచిన వాడికి ఎన్ని తాటాకులయిన కట్టవచ్చు ! ఇదీ ముతక సామెతే. ఒంటి కన్ను రాజు ని శుక్రాచార్యుడు, శివుడు “etc” అని పొగిడి విత్తం పట్టుకుపోయిన ఒక చాటువు కవి తార్కాణం.

    1. ,ఒ రే య్ బ్రో క ర్ కు క్క. ….. నీ క్రి మి న ల్. కు క్క. జ ల గ. లా. రా జ కీ యా ల

      కో సం. * బా బా య్ నీ. పై కీ పా పిం చ లే దు

  2. గే..టాంధ్ర పైత్యం.! ఆర్టికల్ మధ్యలో అంతా పవన్ కళ్యాణ్ మీద ఏడుపే.! ముందూ వెనుకా మాత్రం ప్రశంసలు.! చాలా కష్టపడి వుంటాడు ‘ఎమ్..కట్’ రెడ్డి.! ఏడువ్ రెడ్డీ.. నీ ఏడుపే, ఆయన ఎదుగుదల.!

Comments are closed.