‘ఇది మల్లెల వేళయనీ.. ఇది వెన్నెల మాసమనీ.. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది.. విందులు చేసింది’ అన్నారు దేవులపల్లి! కానీ ఆయన చెప్పిన కోయిన పాపం పొరబాటు పడింది. దాని వల్ల చాలా నష్టపోయింది కూడా. కానీ, ఇది రాజకీయ కోయిలలు కూతకు సిద్ధం అవుతున్న తరుణం!
‘ఇది పొత్తుల వేళయనీ.. సీట్లు పంచే సీజననీ.. తొందరపడి ఒక కోయిల ముందే కూస్తోంది.. సభలే పెడుతోంది..’ అని ఆ సినిమా గీతాన్ని కొంచెం సవరించి పాడుకుంటే ఇప్పటి పరిస్థితులకు అతికినట్టుగా సరిపోతుంది. ఇప్పుడు తొందరపడి కూస్తున్న కోయిల మరెవ్వరో కాదు.. జనసేన పార్టీలో నెంబర్ టూ నాయకుడు నాదెండ్ల మనోహర్.
తెలుగుదేశంతో పొత్తు ఉంటుంది గనుక.. ఈసారి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చి తీరుతాం అనే నమ్మకం జనసేన పార్టీకి ఉంది. జనసేన అధికారంలో భాగం పంచుకునే రోజు వస్తే.. పవన్ తర్వాత మంత్రి పదవి దక్కేది నాదెండ్లకే. వైఎస్ హయాంలోనే గెలిచినప్పటికీ.. మంత్రియోగాన్ని ఇప్పటిదాకా అనుభవించని నాదెండ్ల మనోహర్ కు కోరిక ఉంది.
అయితే తన సొంత నియోజకవర్గం తెనాలి తప్ప మరో చోట నుంచి గెలవగలిగే యోగ్యత ఆయనకు లేదు. అలాగని సొంత నియోజకవర్గం పొత్తుల్లో ఆయనకు దక్కుతుందో లేదో తెలియదు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో అక్కడ ఆయన మూడోస్థానంలో నిలిచారు. తెలుగుదేశం తరఫున పోటీచేసి ఓడిపోయిన మాజీ మంత్రి ఆలపాటి రాజాకు ఆయనకు వ్యత్యాసం కూడా చాలా ఉంది.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ పొత్తుల సంగతి తేల్చినప్పటికీ.. సీట్ల పంపకం విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. సర్వేలను బట్టి మాత్రమే సీట్లు అడుగుతామని, చాలా స్పష్టంగా చెబుతున్నారు. అయితే నాదెండ్ల మనోహర్ మాత్రం.. తాను ఈసారి తెనాలినుంచి పోటీచేయబోతున్నట్టు ముందే ప్రకటించుకున్నారు. జవాబుగా ఆలపాటి రాజా కూడా.. టీడీపీ తరఫున తాను తెనాలిలో పోటీచేసేది గ్యారంటీ అని ఎవరి కోసమూ త్యాగాలు చేసేది లేదని కూడా తేల్చి చెప్పేశారు. దాంతో రెండు పార్టీల మధ్య ఒక రకంగా ముసలం మొదలైంది.
తెనాలిలో జనసేనకు అంత గొప్ప బలం లేదనే కామెంట్ వస్తుంది గనుక.. నాదెండ్ల మనోహర్ ముందే జాగ్రత్త పడుతున్నారు. తెనాలి నియోజకవర్గంలో ఓ మోస్తరు బహిరంగ సభ నిర్వహించి.. పలువురు నాయకులు తమ పార్టీలో చేరినట్లుగా ఓ కార్యక్రమం నిర్వహించారు. తమాషా ఏంటంటే.. అందరూ వైసీపీ నుంచే వచ్చి జనసేనలో చేరిపోయారు. ఇలాంటి చిత్రమైన చేరికలు బహుశా తెనాలి నియోజకవర్గంలో మాత్రమే జరిగినట్టుగా ఉంది.
నిజంగా వైసీపీ వాళ్లు వచ్చి చేరారో, లేదా చేరిన వాళ్లంతా వైసీపీ వాళ్లని ప్రకటించుకున్నారో గానీ.. మొత్తానికి ఇలా బహిరంగసభలు, చేరికల పర్వం ప్రారంభించడం ద్వారా.. కోయిల తొందరపడి,జాగ్రత్తపడి ముందే కూసినట్లుగా అవుతోంది. పొత్తుల్లో సీట్ల పంపకం గురించి మాట్లాడేలోగా తమకు బలం ఉన్నట్టు బిల్డప్ కోసం తాపత్రయ పడుతున్నట్టు ఉంది.