ఈయన ఒకందుకు తాగించాడు..ఆయన మరొందుకు తాగాడు అన్నట్లుంది జనసేనలో వ్యవహారం. పార్టీని మనోహర్ నడుపుతూ వుంటాడు..తాను సినిమాలు చేసుకోవచ్చు అన్నది పవన్ ప్లాన్. పార్టీని తన చేతుల్లోకి ఇస్తే, తను లెఫ్టినెంట్ గా చక్రం తిప్పుకోవచ్చు అన్నిది మనోహర్ ఆలోచన. ఇలా నడచిపోతోంది ఇన్నాళ్లుగా.
కానీ ఇప్పుడు మళ్లీ కొత్తగా మరో లెఫ్టినెంట్ రంగ ప్రవేశం చేస్తున్నట్లు కనిపిస్తోంది. జనసేనాధిపతి సోదరుడు నాగబాబు తాను మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు. అంతే కాదు జనసేన వార్షిక సమావేశాలకు వేదిక రూపకల్పన సమయంలో అంకురార్పణ కూడా ఆయనే చేసారు. సభ నిర్వహణ విషయంలో యాక్టివ్ గా పాల్గొంటున్నారు.
నాగబాబుకు మెగా అభిమానులు కావచ్చు, మాజీ ప్రజారాజ్యం కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, జనసేన అభిమానులు కావచ్చు. చాలా మందితో పరిచయాలు వున్నాయి. వారందరితో ఓపిగ్గా కలిసిపోయి, మాట్లాడగల చాతుర్యం వుంది. వాస్తవానికి ఇన్నాళ్లూ పార్టీని ఆ విధంగానే నడుపుకుంటూ వస్తున్నది నాదెండ్ల మనోహర్ నే. కొన్ని అధికారికంగా, మరి కొన్ని అనధికారికంగా, ఆంధ్ర లోని దాదాపు అయిదారు జిల్లాల్లో జనసేన కమిటీలు వున్నాయి.
ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ, కృష్ణ, గుంటూరు జిల్లాల మీద జనసేన దృష్టి సారించి వుంది. వీటిలో కృష్ణ, గుంటూరు జిల్లాల్లో నిలదొక్కుకునేందుకు గట్టిగా కృషి చేస్తుంది. ఇక్కడ జనసేన ఎక్కువగా తేదేపాకు సాయపడడానికే కృషి చేయాల్సి వుంటుంది. అది లోపాయకారీగా అయినా.
ఈస్ట్, వెస్ట్ అన్నది జనసేనకు గట్టిగా అవకాశాలు వున్న ప్రాంతాలు. అది సినిమా అయినా, రాజకీయం అయినా. అందువల్ల అక్కడ తేదేపా లోపాయికారీగా జనసేనకు సహకరించాల్సి వుంటుంది. విశాఖను వదులుకోవడానికి తేదేపా అస్సలు అంగీకరించదు.
ఇలా లోపాయకారీ పొత్తులకు చాలా లెక్కలు వున్నాయి. ఇవన్నీ చూసుకోవడానికి నాదెండ్ల మనోహర్ కు ఎంత సమయమూ చాలదు. ఇలాంటి టైమ్ లో పార్టీ తరపున ఎవర్ని నిలబెట్టాలి అన్న నిర్ణయం నాదెండ్ల మనోహర్ కు వదిలేయకుండా పవన్ ఓ కన్ను వేసి వుంచాల్సి వుంది. ఆయనకు అంత సమయం లేదు.
అందుకే నాగబాబు ను రంగప్రవేశం చేయిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీలయినంత వరకు జనసేనలో జరుగుతున్న వ్యవహారాలను గమనిస్తూ వుండడం, కార్యకర్తలతో టచ్ లో వుండడం, ఎక్కడ, ఎవరు పోటీకి బెటర్ అనేది ఆలోచించడం వంటి బాధ్యతలు నాగబాబు కు లోపాయకారీగా అందిస్తారని, కేవలం తెలుగుదేశంతో పొత్తు, భాజపా వ్యవహారాలు వంటి పెద్ద పనులు మనోహర్ చూసుకుంటారని టాక్ వినిపిస్తోంది.