మోడీ ప్రభుత్వ విధానాలను ఎవరైనా విమర్శిస్తే, వాటిని వ్యతిరేకిస్తే వాళ్లను దేశం నుంచి బహిష్కరించాలనే డిమాండ్లు తరచూ వినిపిస్తూ ఉంటాయి. మోడీ ప్రభుత్వ విధానాలను విమర్శించాల్సిన అవసరం లేదు, బీజేపీకి అనుకూలం కాదు అనే వాళ్లందరినీ భక్తులు బాయ్ కాట్ చేయాలని అంటూ ఉంటారు.
ఈ జాబితాలో బాలీవుడ్ హీరోల దగ్గర నుంచి చాలా మంది వ్యక్తులు, చాలా రకాల సంస్థలు, చాలా రకాల విధానాలు ఉన్నాయి. తమకు అనుకూలం కాదని అనిపించిన దేన్నీ సహించే తత్వం లేకుండా పోయింది. ఈ క్రమంలో దేశంలో, సోషల్ మీడియాలో బాయ్ కాట్ అనే ట్రెండ్ ఒకటి ఎప్పుడూ మనుగడలోనే ఉంది.
తమకు నచ్చని వారంతా పాకిస్తాన్ వెళ్లిపోవాలని భక్తులు తరచూ చెబుతూ ఉన్నారు. తమకు నచ్చని వారిని, నచ్చని వాటిని బాయ్ కాట్ చేయాలంటూ ఉంటారు. ఈ క్రమంలో… పంజాబ్, హర్యానా రైతులు మోడీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్న విషయం తెలిసిందే.
మోడీ ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై పంజాబ్, హర్యానాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉంది. సామాన్య రైతులు ఈ విషయంలో మండి పడుతూ ఉన్నారు. నెలలుగా వారి నిరసనలు కొనసాగుతూ ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఈ వ్యతిరేకతకు జడిసి ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోయింది శిరోమణి అకాళీదల్. రాష్ట్రంలో అధికారంలో లేని పార్టీ కేంద్రంలో ఉన్న అధికారాన్ని వదిలి వెళ్లిపోయిందంటే.. రైతుల్లో ఉన్న వ్యతిరేకత ఏ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు.
ఛలో ఢిల్లీ అంటూ రైతులు దేశ రాజధాని వరకూ తమ నిరసనలను హోరెత్తిస్తూ ఉన్నారు. మామూలుగా మోడీ భక్తులు ఇలాంటి వాటిని అస్సలు సహించరు. బాయ్ కాట్ అంటారు. మోడీ విధానాలను, బీజేపీ అనుకూలతను లేని వాళ్లు ఈ దేశంలో ఉండటానికి వీల్లేదు అనే అజెండా వీరి మాటల్లో, సోషల్ మీడియా పోస్టుల్లో బాహాటంగా వ్యక్తం అవుతూ ఉంటుంది.
మరి ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నది, మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ రోడ్డెక్కినది రైతులు. దేశంలోనే అత్యంత సారవంతమైన ప్రాంతాల్లోని రైతులు. భారీగా పంటలు పండించే రైతులు. అలాంటి రైతులు మోడీ విధానాలను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. వారిని బాయ్ కాట్ చేయాలనే వాదన మోడీ భక్తులు వినిపించాలిక, ఇన్ని రోజులూ బాయ్ కాట్ అంటూ రకరకాల కీవర్డ్స్ ను ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు.
ఇక ఇప్పుడు బాయ్ కాట్ ఫుడ్ మాత్రమే మిగిలి ఉంది! ఆహారాన్ని బహిష్కరించేసి, ఈ రైతులను పంజాబ్ నుంచి అటు పాకిస్తాన్ లోకి వెళ్లిపొమ్మంటే కానీ ఈ సమస్య పరిష్కారం అయ్యేలా లేదేమో! ఢిల్లీ చేరిన రైతులను తరిమికొట్టడానికి రేపోమాపో భక్తులు రంగంలోకి దిగుతారేమో!