సినిమాల్ని చెక్కుతూనే ఉంటాడు సుకుమార్. ఈ ఏడాది అనుకున్న సినిమా వచ్చే ఏడాదికి రిలీజ్ అవుతుంటుంది. బహుశా ఈ విషయంలో రాజమౌళి తర్వాత స్థానం సుకుమార్ దే అవ్వొచ్చు. అయితే ఈసారి మాత్రం సుకుమార్ నుంచి ఈ స్థాయిలో చెక్కుడు ఉండకపోవచ్చు. పుష్ప సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేయబోతున్నాడు ఈ దర్శకుడు. దీనికి కొన్ని కారణాలున్నాయి.
రీజన్-1 – బన్నీ-కొరటాల సినిమా
ఆల్రెడీ ఈ ప్రాజెక్టు ఎనౌన్స్ చేశారు. 2022 అంటూ ప్రీ-లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆచార్య పూర్తయిన వెంటనే కొరటాల ఈ సినిమా స్టార్ట్ చేస్తాడు. ఆచార్య కోసం ఇప్పటికే చాలా రోజులు వెయిట్ చేసి విసుగెత్తిపోయి ఉన్నాడు ఈ దర్శకుడు. ఇలాంటి టైమ్ లో బన్నీ కూడా లేట్ చేస్తే కష్టమే. అందుకే కొరటాల కోసమైనా పుష్ప సినిమాను తొందరగా పూర్తిచేయాలనుకుంటున్నాడు సుకుమార్.
రీజన్-2 – సుకుమార్-విజయ్ దేవరకొండ సినిమా
అటు సుకుమార్ కూడా మరో సినిమాకు కమిట్ అయి ఉన్నాడు. కొరటాల ఎలాగైతే తన ఫ్రెండ్ ను నిర్మాతగా మారుస్తూ సినిమా ఎనౌన్స్ చేశాడో… సుకుమార్ కూడా కేదార్ అనే వ్యక్తిని నిర్మాతగా పరిచయం చేస్తూ విజయ్ దేవరకొండతో సినిమా ప్రకటించాడు. వీలైనంత త్వరగా పుష్ప కంప్లీట్ చేసి ఆ మూవీ స్టార్ట్ చేయాలి. పైగా ఈ కేదార్ అనే వ్యక్తి, బన్నీ ఫ్రెండ్స్.
రీజన్-3 – లాక్ డౌన్ ఎఫెక్ట్
లాక్ డౌన్ తో ఇప్పటికే 7-8 నెలలు ఆలస్యమైంది పుష్ప సినిమా. ఇలాంటి టైమ్ లో ఈ మూవీని మరింత డిలే చేయడం మంచిది కాదు. అందుకే లాక్ డౌన్ టైమ్ లోనే షాట్ డివిజన్స్, షెడ్యూల్స్ అన్నీ పక్కాగా రెడీ చేసి పెట్టుకున్నాడు సుకుమార్. కాబట్టి పుష్ప సినిమా ఈసారి ఆలస్యమయ్యే ఛాన్స్ లేదు.
రీజన్-4 – 2021 రిలీజ్
ఇవన్నీ ఒకెత్తయితే.. రిలీజ్ మరో ఎత్తు. ఈ సినిమాను ఎలాగైనా 2021లో రిలీజ్ చేసి తీరాలి. ఎందుకంటే.. బన్నీ నుంచి ఓ సినిమా వచ్చి ఇప్పటికే 10 నెలలవుతోంది. వీలైనంత త్వరగా మరో సినిమా థియేటర్లలోకి రావాల్సిందే. లేదంటే ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్ తప్పదు.
ఈ కారణాలన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తే.. ఈసారి సుకుమార్, పుష్ప సినిమాను తొందరగానే పూర్తిచేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీప్రాంతంలో జరుగుతోంది.