ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో వేలాది ఎకరాల భూములను నిషేధిత జాబితాలో ఉంచుతూ తీసుకున్న నిర్ణయం కలకలం రేపింది. ఈ విషయమై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి తెలిసి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో ఈ మొత్తం సమస్యకు కారణమైన టీటీడీ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. సమస్య తెలిసిన వెంటనే స్పందించి సంబంధిత ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే మాట్లాడ్డంతో తిరుపతి ప్రజానీకం ఆందోళనను తగ్గించగలిగారు. అసలేం జరిగిందంటే…
ఈ నెల 23న తిరుపతిలో సుమారు 2,300 ఎకరాలను నిషేధిత జాబితా (22ఎ)లో చేరుస్తూ రిజిస్ట్రేషన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో దేవాదాయ, ప్రైవేట్ భూములు కూడా ఉన్నాయి. రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో తమ స్థలాలు చేరడంపై ప్రైవేట్ వ్యక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వివిధ అవసరాల రీత్యా అమ్మకానికి, అలాగే బ్యాంక్‌లో ష్యూరిటీ ప్రాసెస్ సాగుతున్న క్రమంలో నిషేధిత జాబితాలో ఉన్నాయనే సమాచారం తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ విషయాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరెడ్డి దృష్టికి భూయజమానులు తీసుకెళ్లారు.
సమస్య తీవ్రతను తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే సీఎంవో ఉన్నతాధికారులు, ఐజీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, ఎండోమెంట్ కమిషనర్‌తో ఆయన స్థల యజమానుల సమక్షంలోనే ఫోన్లో మాట్లాడినట్టు తెలిసింది. స్థానిక ప్రజాప్రతినిధి అయిన తనకు తెలియకుండా, నష్టం కలిగించేలా వ్యవహరించడంపై ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తమ భూముల్ని కాపాడుకునే క్రమంలో, తిరుపతిలోని ప్రైవేట్ ఆస్తుల్ని కూడా నిషేధిత జాబితాలో చేర్చాలని టీటీడీ ఉన్నతాధికారుల విజ్ఞప్తి మేరకే… నిషేధిత జాబితాలో చేర్చినట్టు చివరికి తేలింది.
ఎమ్మెల్యే ఆగ్రహంతో టీటీడీ తిరుపతి జేఈవో ఆ మరుసటి రోజే అంటే 24వ తేదీ ఎండోమెంట్ కమిషనర్‌కు లేఖ రాసిన విషయాన్ని తిరుపతి ఎమ్మెల్యే ఇవాళ వెల్లడించారు. తాము గతంలో పంపిన సర్వే నంబర్లలో ప్రైవేట్ ఆస్తులను కూడా గుర్తించామని, అందువల్ల తిరిగి సవరణ జాబితా పంపుతామని ఎండోమెంట్ కమిషనర్‌కు టీటీడీ తిరుపతి జేఈవో లేఖ రాశారు. ఇదిలా వుండగా ఎమ్మెల్యే విడుదల చేసిన ప్రకటనలో సమస్యకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం ఇస్తామని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లకు ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.
తానెప్పుడూ ప్రజా ప్రయోజనాల కోసమే పనిచేసేవాడినే అని తెలిపారు. కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సమస్యను పరిష్కరించే బాధ్యత తనదని ఎమ్మెల్యే భూమన స్పష్టం చేశారు. ఇదిలా వుండగా సమస్య ఉత్పన్నమైన వెంటనే పరిష్కారానికి ఎమ్మెల్యే చొరవ తీసుకున్నారనే సమాచారం లేకుండా లోకేశ్ అవాకులు చెవాకులు పేలారు. స్థానిక టీడీపీ నాయకులు స్వార్థం కోసం నిజాల్ని దాచి, తప్పుడు సమాచారం ఇచ్చి, ఆయనతో ఏదేదో మాట్లాడించి ప్రజల్ని భయాందోళనకు గురి చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.