“పది మంది కలిసి ఒక మహిళను చీరలాగి, బయటకు తోస్తారా? ఇంత దారుణమా, ఇంత అమానుషమా? తనకు అవమానం జరిగిందని, ఆత్మహత్య చేసుకుంటానని , బతకనని ఆ మహిళా డాక్టర్ వాపోతున్నారు” ….ఈ వ్యాఖ్యలు ఏ ప్రతిపక్ష పార్టీ నాయకులో చేసినవి కావు. తన స్నేహితురాలైన డాక్టర్‌కు జరిగిన అన్యాయంపై ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో, అలాగే అన్యాయం చేస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అరాచకాలపై ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు జీవీ లక్ష్మి చెలరేగిపోయారు.
ఈ సభ్యురాలి గొప్పతనం ఏంటంటే… తాను ప్రాతినిథ్యం వహిస్తున్న మహిళా కమిషన్, అలాగే పదవి ఇచ్చిన జగన్ సర్కార్ అన్యాయాలను వెనకేసుకొస్తున్న తీరును చక్కగా ఆవిష్కరించడం. ఇంతకాలం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అధికార పార్టీ నాయకుడు కావడంతో, ఆయన దారుణాల్ని చూసీచూడనట్టు వ్యవహరించారనే చేదు నిజాన్ని బయటపెట్టారు. ఎప్పుడైతే అధికార పార్టీని కాదని బయటికెళ్లాడో, అప్పుడు మాత్రమే కోటంరెడ్డి చర్యలన్నీ అరాచకాలుగా, దౌర్జన్యాలుగా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కనీసం ఇప్పటికైనా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన తమ్ముడు గిరిధర్‌రెడ్డి మహిళలపై దారుణాలకు ఒడిగట్టారని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదనే పచ్చి నిజాన్ని తన ఆవేశపూరిత ప్రసంగం ద్వారా జీవీ లక్ష్మి బయటపెట్టడం అభినందనలు అందుకుంటోంది. ఇదే సందర్భంలో బాధితుల ఫిర్యాదు కోసం ఎదురు చూడకుండా, నెల్లూరు జిల్లా బాధ్యురాలిగా సుమోటోగా తీసుకుని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు గిరిధర్‌ల అరాచకాలను అణచివేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు జీవీ లక్ష్మి ఇవాళ బయట పెట్టిన కోటంరెడ్డి, ఆయన సోదరుడి అరాచకాల గురించి తెలుసుకుందాం.
2018లో ఒక మహిళను వేధించిన మాట వాస్తవం కాదా? అని ఆమె ప్రశ్నించారు. మీరు ఇంకా వివరణ అడిగితే… చాలా వివరించి చెప్పగలను ఎమ్మెల్యే గారూ అంటూ తనవైన హావభావాలను ఆమె ప్రదర్శించారు. తన దగ్గర అన్ని సాక్ష్యాధారాలున్నట్టు ఆమె చెప్పారు. బాధిత మహిళలు బయటికొచ్చి ఫిర్యాదు చేస్తే…. నిన్ను, మీ తమ్ముడిని లోపల వేయడానికి క్షణం కూడా పట్టదని ఆమె హెచ్చరించారు. 2018లో మీరు ఓ అమ్మాయికి అన్యాయం చేస్తే… ఆ బాధితురాలు ప్రతి గడపకూ వెళ్లి చెప్పడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దిశా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆ బాధితురాలు ఫిర్యాదు చేసింది వాస్తవం కాదా? అని నిలదీశారు. ఆ తర్వాత మీరు బెదిరింపులకు పాల్పడింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. వాటికి సంబంధించి ఆధారాలు కావాలంటే తన వద్ద ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా కోటంరెడ్డి సదరు మహిళను వేధించడానికి సంబంధించి దిశా పోలీస్‌స్టేషన్ నుంచి అనేక ఆధారాలు, సాక్ష్యాలను సేకరించినట్టు ఆమె తెలిపారు.
మీ తమ్ముడు (గిరిధర్) సచ్ఛీలుడు అనుకుంటున్నారా? అని కోటంరెడ్డిని మహిళా కమిషన్ సభ్యురాలు ప్రశ్నించారు. ఎంత మంది ఆడవాళ్లను వీడియో కాల్స్ చేసి వేధించాడో ఎవరికీ తెలియదని అనుకుంటున్నారా? అని నిలదీశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, ఆయన తమ్ముడి బాధితులు ఎంత మంది ఉన్నారో వారికి తెలియదేమో కానీ, తమకు బాగా తెలుసన్నారు. బాధితులంతా ఇంత కాలం ఎమ్మెల్యే కాబట్టి చర్యలు తీసుకుంటారో, లేదో అని వేచి చూశారన్నారు. తనకు తానుగా టీడీపీ తరపున పోటీ చేస్తానని కోటంరెడ్డి వెళ్లిపోవడంతో మహిళలందరికీ ధైర్యం వచ్చిందన్నారు.
అలాగే ట్రస్టు భూములను కాజేసేందుకు నెల్లూరులోని జమీన్ రైతు అనే పత్రిక సంపాదకుడు డోలేంద్ర ఇంటిపైకి వెళ్లి దాడి చేయడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఈ ఎపిసోడ్‌లో ఇద్దరి మహిళలపై అమానుషంగా ప్రవర్తించాడని కోటంరెడ్డిపై నిప్పులు చెరిగారు. ఆ మహిళలు తనను ఒక్కసారి ఆశ్రియిస్తే చాలు…మీ బతుకులు ఏమవుతాయో ఆలోచించడని ఆమె హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ పేరుతో దందాలు చేశారని ఆరోపించారు. నెల్లూరులో తన స్నేహితురాలైన డాక్టర్ రాధామాధవి ఏ విధంగా అన్యాయానికి గురైందో ఆమె చెప్పుకొచ్చారు. తన స్నేహితురాలికి జరిగిన అన్యాయంపై ఆమె ఆవేదన అంతాఇంతా కాదు.
ఇదిలా వుండగా తాను మహిళా కమిషన్ తరపున నెల్లూరు జిల్లా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా కోటంరెడ్డి మహిళలను వేధించడంపై తన వద్ద అన్ని ఆధారాలున్నాయని చెప్పడం గమనార్హం. మరి ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా, సోషల్ మీడియా, అధికార పార్టీ అనుకూల మీడియాలో మాట్లాడ్డం ఎందుకనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మహిళలపై కోటంరెడ్డి అరాచకాలకు పాల్పడడం ఎంత నేరమో, వాటి గురించి తెలిసి కూడా మనవాడనే ఉద్దేశంతో వదిలిపెట్టడం మహిళా కమిషన్, ఏపీ ప్రభుత్వానిది తప్పు కాదా? అని ప్రతిపక్ష పార్టీలు నిలదీస్తున్నాయి.
మహిళలకు న్యాయం చేసే హోదాలో ఉంటూ, కేవలం రాజకీయ ఆరోపణలతో పబ్బం గడుపుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఏపీ మహిళా కమిషన్, అలాగే ఏపీ సర్కార్‌కు చిత్తశుద్ధి వుంటే… బాధితులకు అండగా నిలిచి, కోటంరెడ్డి బ్రదర్స్‌పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.