విజయనగరానికి మరో పేరు ఉంది. అదే విద్యల నగరం అని. ఒకపుడు రాజుల కాలంలో విద్యలను విశేషంగా పోషించేవారు. అలా విజయనగరం సంగీత సాహిత్య సంప్రదాయ విద్యలకు నిలయంగా ఉండేది. ఆ తరువాత కాలంలో ప్రజా ప్రభుత్వాలు విజయనగరం విషయంలో ఉదాశీనంగా వ్యవహరించడంతో విద్యల నగరం అన్నది ముతక సామెతగా మారిపోయింది.
అలాంటి విజయనగరానికి గత వైభవాన్ని కలిగించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వస్తూనే అనేక చర్యలను చేపట్టారు. విజయనగరం కలలను ఆయన ఒక్కొక్కటిగా తీరుస్తున్నారు. ఇవి కలలే ఇలలో ఎప్పటికీ నెరవేరవు అనుకునే వారికి అది తప్పు అని ఆచరణలో నిజం చేసి చూపిస్తున్నారు.
విజయనగరం జిల్లాకు గత నెలలో వచ్చిన వచ్చిన సీఎం జగన్ గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. దాని కంటే ముందుగా కురుపాంలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేశారు. అలాగే విజయనగరంలో ఉన్న జెఎన్టియు స్థాయిని పెంచడం మరో విశేషంగా చెప్పుకోవాలి. ఇపుడు విజయనగరంలో వైద్య కళాశాలను ప్రారంభించడం ద్వారా వైద్య నగరంగా కూడా మార్చేస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్ ఈనెల 14 లేదా 15వ తేదీలలో జిల్లాలో పర్యటిస్తారు. ఈసందర్భంగా ఆయన విజయనగరం నియోజకవర్గ పరిధిలోని గాజులరేగ వద్ద నిర్మిస్తున్న వైద్య కళాశాలను ప్రారంభిస్తారు. సీఎం అయ్యాక మూడవసారి జగన్ జిల్లాకు రావడం అని వైసీపీ నేతలు చెబుతున్నారు. వచ్చిన ప్రతీసారీ సీఎం ఏదో ఒక ప్రాజెక్ట్ ని జిల్లాకు ఇస్తున్నారని అంటున్నారు. జిల్లా అభివృద్ధి మీద సీఎం కమిట్ మెంట్ కి ఇది నిదర్శనం అని అంటున్నారు.