ఈ వినాయకచవితి సీజన్ లో విడుదలవుతున్న ఒకే ఒక సినిమా మార్క్ ఆంటోనీ అన్న ఆనందం అనే సేపు నిలవలేదు హీరో కమ్ నిర్మాత విశాల్ కు. కోర్టు ఈ సినిమా విడుదల ఆపుచేయాలని ఆదేశించినట్లు వార్తలు వచ్చేసాయి.
లైకా సంస్థతో వున్న ఆర్థిక లావాదేవీల ఫలితం ఇది. ముందు అబ్బే.. అలాంటిదేం లేదు కొట్టి పారేయాలనుకున్నా, కోర్టు ఆదేశాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాక మాట మార్చాల్సి వచ్చింది. అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్ మెంట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెన్నయ్ వర్గాల బోగట్టా.
చాలా అంటే చాలా కాలంగా విశాల్ తన మార్కెట్ ను పోగొట్టుకుంటూ వస్తున్నారు. సరైన సినిమా అన్నది పడి చాలా కాలం అయిపోయింది. ఒకప్పుడు తెలుగు నాట విశాల్ సినిమాలు అంటే ఓ సెట్ ఆఫ్ ఆడియన్స్ వుండేవారు. కానీ రాను రాను వారిని విశాల్ సినిమాలు నిరుత్సాహపర్చడం ప్రారంభమైంది. ఇలాంటి టైమ్ లో మార్క్ ఆంటోనీ సినిమా ట్రయిలర్ కాస్త క్రేజీగా వుండి, కాస్త ఆసక్తి కలిగించింది.
అదే టైమ్ లో చంద్రముఖి2 సినిమా వాయిదా పడింది, ఇవన్నీ మంచి శకునములే అనుకుంటే, ఇప్పుడు కోర్టు కేసులో చిక్కుకుంది సినిమా. అవుట్ ఆఫ్ ది కోర్టు సెటిల్ కావచ్చు. కానీ దీనివల్ల సమస్య ఏమిటంటే ఎగ్జిబిటర్ల దగ్గర నుంచి, బయ్యర్ల దగ్గర నుంచి డబ్బులు లాస్ట్ మినిట్ వరకు రావడం కష్టమే అవుతుంది.