దర్శకులు అడపా దడపా స్క్రీన్ మీద కనిపించడం మామూలే. కోడి రామకృష్ణ, దాసరి, కె.విశ్వనాధ్ లాంటి దర్శకులు స్క్రీన్ మీదా రాణించారు. ఇప్పుడు మరో దర్శకుడు ఇదే బాటలో వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దర్శకుడు మరెవరో కాదు. శ్రీకాంత్ అడ్డాల.
గొదావరి మాట, బంధం, ఆప్యాయతలు, భావోద్వేగాలు అన్నీ తెరమీదకు తేవడంలో శ్రీకాంత్ అడ్డాలకు మంచి టాలెంట్ వుంది. హిట్, యావరేజ్ అన్నది పక్కన పెడితే ఇప్పటి వరకు శ్రీకాంత్ అడ్డాల చేసిన సినిమాలు అన్నీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నవే.
అలాంటి శ్రీకాంత్ అడ్డాల కొత్త హీరోతో సినిమా చేస్తున్నారు. నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పెదకాపు అనే ఈ సినిమా కు టీజర్ తోనే మంచి బజ్ వచ్చింది. ఈ నెల 28న విడుదల కాబోతోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాదు, కీలకపాత్రను శ్రీకాంత్ అడ్డాల పోషించినట్లు తెలుస్తోంది. జస్ట్ ఏదో కాజువల్ రోల్ కాకుండా సినిమాలో ఈ పాత్ర చాలా కీలకం అని తెలుస్తోంది.
అంతే కాదు, త్వరలో వదలబోయే ట్రయిలర్ లో శ్రీకాంత్ అడ్డాల నోటి వెంట గోదావరి స్టయిల్ ఘాటు తిట్టు కూడా వినిపిస్తుందట. శ్రీకాంత్ అడ్డాల స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని, తెలుగు తెరకు మరో మంచి నటుడు దొరికినట్లే అని ఇప్పటికే ట్రయిలర్ ను చూసిన ఇన్ సైడ్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.