రెండున్నరేళ్ల క్రితం షర్మిల పార్టీ పెట్టినపుడు ‘షర్మిల – ఏన్ యాంగ్రీ ఉమన్’, ‘షర్మిలకు రెడీటు యూజ్ రెడ్డి ఓటు బ్యాంకుందా?’ ‘వైయస్ వారసత్వానికి తెలంగాణలో విలువుందా?’ అనే పేర మూడు వ్యాసాలు రాశాను. తెలంగాణలో ఆమెకు అంబ పలికే అవకాశాలు బొత్తిగా కనబడటం లేదని, చాలా శ్రమించాల్సి ఉంటుందని రాశాను. ఆ తర్వాత ఆమె గురించి ఆర్టికల్ రాయవలసిన అవసరం పడలేదు. ఆమె ఏ ఎన్నికలోనూ పోటీ చేయలేదు. నిరసన కార్యక్రమాలతోనే వార్తల్లోకి ఎక్కేది. ఆంధ్రజ్యోతి తప్ప వేరే ఏ పత్రికా ఆమెను పట్టించుకోలేదు. కెటియార్ ఓ సారి రాధాకృష్ణ గారి మొఖాన్నే ఆ మాట అన్నాడు కూడా. ఆమె వైయస్ కూతురు మాత్రమే అయితే రాధాకృష్ణా పట్టించుకోక పోను. జగన్‌కు వ్యతిరేకంగా మారింది కాబట్టి ఏదో ఆశ కొద్దీ కవరేజీ యిచ్చి బాగా ఎగదోశారు.
చివరకు అందరికీ ఆశాభంగం కలిగిస్తూ ఆమె తన పార్టీని కాంగ్రెసులో కలిపేయబోతున్నారు. 30 నెలల శ్రమ బూడిదలో పోసినట్లయింది. ఆమెను నమ్ముకుని వెంట తిరిగిన కొండా రాఘవ రెడ్డి గారు టీవీలోనే తన బాధ వెళ్లబోసుకున్నారు. పగబట్టిన ఆడపడుచులా తను రంగంలోకి దిగితే చాలు, ఆంధ్రలో అన్నగారు సాధించిన విజయాన్ని తెలంగాణలో తను సాధించలేక పోతుందా అనుకున్న షర్మిల కెంత ఆశాభంగం కలిగిందో మరి! ‘‘దీవార్’’లో శశి కపూర్ ‘మేరే పాస్ మాఁ హై’ అని డైలాగు చెప్పిన తీరులో యీమె విజయలక్ష్మి గార్ని కూడా వెంట తిప్పుకుంది. తల్లిని, చెల్లిన మెడ పట్టుకుని బయటకు గెంటిన జగన్ అని తెలుగు మీడియా గోల పెట్టడానికి పనికి వచ్చింది తప్ప అది వేరెందుకూ పనికి రాలేదు. వైయస్ కూతర్ని, తెలంగాణ కోడల్నని చెపితే చాలు చెడుగుడు ఆడేయవచ్చని ఆమె అనుకుని భంగపడింది.
ఇలాటివేవీ చెల్లవని పైన ప్రస్తావించిన ఆర్టికల్స్లోనే రాశాను. చివరకు అదే జరిగింది. పార్టీ నడపలేక చేతులెత్తేసి, ఆమె కాంగ్రెసులోకి నడిచింది. మధ్యలో తెరాస వారు ఆమెది బిజెపి బి టీము అన్నారు. బిజెపిలోకి వెళ్లినా వెళ్లుండవచ్చు. ఎన్టీయార్ కూతురైన పురంధరేశ్వరి కాంగ్రెసులోకి, ఆ పై బిజెపిలోకి వెళ్లగా లేనిది వైయస్ కూతురు బిజెపిలోకి వెళితే మాత్రం ఆశ్చర్యమేముంది? కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆమె శివకుమార్ అండతో కాంగ్రెసులోకి చేరడానికి ప్రాకులాడింది. ఈమె చేరడం, వాళ్లు చేర్చుకోవడం రెండూ వింతగానే ఉన్నాయి. చేరడమంటూ ఖరారయ్యాక తెలంగాణానా? ఆంధ్రానా అన్న చర్చ ప్రారంభమైంది. తెలంగాణ కాంగ్రెసు వాళ్లు ఆంధ్రకు పో, నీకు యిక్కడేం పని? అన్నారు. ఆమె తన వద్ద ఉందని అనుకుంటున్న ఏకైక కార్డు – వైయస్ వారసత్వం. దాన్ని అక్కడ జగన్ ఆల్రెడీ వాడేసుకున్నాడు.
తెలంగాణలో యింకా వైయస్ అభిమానులున్నారు, వాళ్లను ఆకట్టుకోగలను అనుకుంటూ యిక్కడకు వచ్చింది. అభిమానం వేరు, ఓటెయ్యడం వేరు. మనసులో ఎవరి పట్లయినా గౌరవం ఉండవచ్చు. అతనే అభ్యర్థి అయితే ఓటేసినా వేయవచ్చు. అంతమాత్రాన అతని పార్టీ తరఫున నిలబడిన ప్రతివారికీ, అతని పేరు చెప్పుకుని ఓట్లడిగే ప్రతీ వారికీ ఓటేయాలని లేదు. వైయస్ వారసత్వం షర్మిలకు ఉపయోగ పడుతుంది అని వాదించేవాళ్లలో ప్రధానంగా ఖమ్మం జిల్లా నాయకులే ఉంటున్నారు. తెలంగాణ ఫీలింగు తక్కువగా ఉన్నది, ఆంధ్రమూలాల వారి ఓట్లు ఎక్కువగా ఉన్నది ఖమ్మమే కాబట్టి షర్మిల అక్కణ్నుంచే నిలబడదా మనుకుంది. కానీ ఖమ్మం మీద లెఫ్ట్ పార్టీల వారికి, కాంగ్రెసుకి, టిడిపికి, ఒకప్పుడు వైసిపికి, తర్వాత షర్మిల పార్టీకి అందరికీ కన్నే. వీళ్లలో ఎవరికి ఎన్ని వస్తాయో ఊహించలేం.
వైయస్‌కు తెలంగాణలో యింకా కొంత ఓటు బ్యాంకు ఉందని, షర్మిలను పార్టీలో తీసుకుని వస్తే అది కాంగ్రెసుకు లాభదాయకమని భట్టి విక్రమార్క వంటి వారి వాదన. రేవంత్ తన పాత టిడిపి సహచరులందర్నీ కాంగ్రెసులోకి లాక్కుని వచ్చి పార్టీలో బలపడుతున్నాడని అతనికి చెక్ పెట్టడానికై రేవంత్‌ను దుమ్మెత్తి పోసిన షర్మిలను పార్టీలోకి తీసుకుని రావాలని భట్టి వగైరాల ఆలోచన అని కొందరి ఊహ. షర్మిల రాకను అడ్డుకుంటున్న రేవంత్ వాదనేమిటంటే, ‘2018లో చంద్రబాబు తెలంగాణ బరిలో దిగగానే కెసియార్ ‘పెత్తనం మళ్లీ ఆంధ్రుల చేతిలోకి వెళ్లిపోతోంది’ అంటూ తెలంగాణ సెంటిమెంటు రగిలించి, టిడిపిని, దానితో పొత్తు పెట్టుకున్న కాంగ్రెసును ఓడించాడు. షర్మిల వస్తే యిప్పుడు మళ్లీ అదే జరుగుతుంది. రాష్ట్రవిభజన అడ్డుకున్న వైయస్ అంటే తెలంగాణ ప్రజల్లో కోపం పోలేదు. ఆ కోపం యిప్పుడు కాంగ్రెసుపై ప్రసరిస్తుంది.’ అని.
తెలంగాణలో వైయస్ పేరు ఓట్లను రాలుస్తుందా? వైయస్సయినా, మరొకరైనా కొంతకాలమే ప్రభ వెలుగుతుంది. బ్రహ్మానందరెడ్డి, వెంగళరావు లాటి వాళ్లు ముఖ్యమంత్రిగా ఉండగా అప్రతిహతంగా ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత అనుచరులే లేకుండా పోయారు. ఒకప్పుడు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పని చేసిన దేవెగౌడ యిప్పుడు పూజాపునస్కారం లేక బూజు పట్టి ఉన్నాడు. వైయస్ బతికి ఉన్నా ఎన్నాళ్లపాటు వెలిగేవాడో ఎవరికి తెలుసు? ఆయన తరం నాటి చంద్రబాబు సంగతే చూడండి. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసి, విభజిత ఆంధ్రకు ఐదేళ్లు చేసి, 2019లో 23 సీట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కొడుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకో లేకపోయారు. 2024లో కూడా జగన్‌ను ఒంటరిగా ఎదిరించే ధైర్యం చాలని స్థితిలో ఉన్నారు. వైయస్ జీవించి ఉన్నా ఏ స్థితిలో ఉండేవారో! అలాటిది ఆయన చనిపోయిన తర్వాత ఎవరు గుర్తుంచుకుంటారు?
ఎంత ఎత్తయిన వినాయక విగ్రహమైనా సరే, ఆ నవరాత్రులే పూజ లందుకుంటుంది. తర్వాత జలప్రవేశమే. వచ్చే ఏడాదికి కొత్త విగ్రహం వెలుస్తుంది. వైయస్ చేపట్టిన ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వగైరా పనులను తర్వాతి వాళ్లు వదిలేసి ఉంటే ‘ఆయనే ఉంటే…’ అని కొందరైనా గుర్తు చేసుకునే వారేమో! అవన్నీ నిరాఘంటంగా సాగుతూంటే యిక ఆయనెందుకు గుర్తుకు వస్తాడు? చంద్రబాబు సైబరాబాదు నిర్మాణం సంగతీ అంతే. తర్వాతివాళ్లు కొనసాగించారు. ఆయన మరపున పడ్డాడు. ఆయనే దాని గురించి మాట్లాడుతున్నాడు తప్ప యింకెవరూ మాట్లాడడం, ఆయన పార్టీకి ఓట్లేయడం మానేశారు. అమరావతి విషయంలో జగన్ దాన్ని పక్కన పడేశాడు కాబట్టి ‘బాబు కొనసాగి ఉంటే…’ అని అమరావతి జనం నిట్టూరుస్తారు. జగన్ కొనసాగించి ఉంటే బాబు అక్కడా మరపున పడేవారు.
ఇలాటి ఓటర్లుండగా యింకా వైయస్ ఓటు బ్యాంకు ఉందనుకోవడం భ్రమ. ఒకవేళ కాస్తోకూస్తో ఉందనుకున్నా, వైయస్ మరణం తర్వాత ఆయన పేరే జపిస్తూ, తెలంగాణలో ఆయన పేర పార్టీ పెట్టుకుని కొనసాగించి ఉంటే కొందరైనా ఓటేసేవారు. ఆ పేరుని గాలికి వదిలేసి, పుష్కరం తర్వాత వైయస్ బిడ్డను, మీ కోడల్ని అంటూ వస్తే ఎవరు పట్టించుకున్నారు? వైయస్ పోయి 14 ఏళ్లయింది. మధ్యలో వైయస్ గురించి తెలంగాణలో ప్రచారం జరిగిందా? లేదే! ఆయన మరణానంతరం కాంగ్రెసు ప్రభుత్వం ఉండగానే ఆయనను స్మరించడం మానేశారు. పదవీ దుర్వినియోగం చేశాడని కేసుల్లో దోషిగా నిలబెట్టారు. 2018లో టిడిపి, కాంగ్రెసు పొత్తు కుదిరినప్పుడు వైయస్ చేసినవి కూడా బాబు తన ఖాతాలో వేసుకుని మాట్లాడుతూంటే పక్కనున్న రాహుల్ కానీ, యితర కాంగ్రెసు నాయకులు కానీ కిమ్మనలేదు. వైయస్‌ను ఏ మాత్రం పొగిడినా జగన్‌కు మైలేజి వచ్చేస్తుందేమోనని 2009 నుంచి కాంగ్రెసు హడిలి ఛస్తోంది. అలా లోతుగా పాతి పెట్టేసిన వైయస్ యిమేజి యిప్పుడు ఓ పుస్తకం విడుదల చేస్తే, షర్మిలను చేర్చుకుంటే ఓట్లు తెస్తుంది అని వాదించడం ఎంత అర్థరహితం!
ఇక కెసియార్ షర్మిల బూచిని చూపించి, తెలంగాణ సెంటిమెంటు రగిలిస్తారు అనే వాదనలో కూడా పస లేదు. టిడిపి అంటే దాని కథ వేరు. ఒకప్పుడు ఆంధ్రలో కంటె తెలంగాణలో టిడిపి బలంగా ఉండేది. కెసియార్‌తో సహా ఎందరో నాయకులు టిడిపిలో రూపు దిద్దుకున్నారు. రెడ్డి, వెలమల మధ్య తెలంగాణ రాజకీయాలు నడిచే రోజుల్లో బిసిలకు గొంతు నిచ్చిన పార్టీ టిడిపి. ఎన్టీయార్ ప్రారంభించిన యీ కార్యక్రమాన్ని చంద్రబాబు కొనసాగించారు. ఆయనకు వ్యక్తిగతంగా విధేయులైన నాయకులెందరో ఉన్నారు. దురదృష్టవశాత్తూ ఓటుకు నోటు కేసులో యిరుక్కుని చంద్రబాబు తెలంగాణ విడిచి పారిపోయారు కాబట్టి కానీ, యిక్కడే ఉండి ఉంటే కెసియార్‌కు బలమైన ప్రత్యామ్నాయంగా ఉండేవారు. 2018లో తెరాసను ఢీకొట్టగలిగిన ప్రతిపక్షాలు రెండూ ఒకటై పోరాటంలోకి దిగేసరికి కెసియార్‌కు జంకు కలిగింది. తెలంగాణ ప్రజలకూ బాబు మళ్లీ యిక్కడ పెద్ద శక్తిగా అవతరిస్తాడన్న శంకా కలిగింది. అందుకే బాబును బూచిగా చూపించి కెసియార్ భయపెట్టగలిగారు.
అలాటి బాబుతో షర్మిలకు పోలికేమిటి? షర్మిల ఒక్క ఎన్నికా నెగ్గలేదు. ఏ పోస్టూ లేదు. నిరుద్యోగంపై పోరాటం చేస్తున్నానన్నా యువత ఆమె వెంట నడవలేదు. ఒక్క నాయకుడూ తోడు రాలేదు. ఏ పారిశ్రామిక వేత్తా అండగా లేడు. కెసియార్ అవినీతిపరుడు అని కేకలు వేయడమే తప్ప, ఒక్క ఆధారమూ చూపలేదు, ఒక్క కేసూ పెట్టలేదు. బాబైతే 2018లో ఆంధ్రలో ఆయన ముఖ్యమంత్రిగా ఏలుతున్నాడు. ఈమెకైతే అటు ఆంధ్రలోనూ దిక్కూదివాణం లేదు. అన్నగారు ఏ పోస్టూ, ఏ టిక్కెట్టూ యివ్వనంటే యిక్కడకు వచ్చి పడింది. అదీ ఏడేళ్ల విరామం తర్వాత! తన యింటి పనులు, వ్యాపారపు పనులు, కుటుంబంలో ఆస్తి తగాదాలు అన్నీ చూసుకుని అప్పుడు తీరిగ్గా దర్శనమిచ్చి మీకోసమే వచ్చా అంటే ఎవరు నమ్ముతారు? ఈమెను ఆంధ్రా బూచిగా చూపిస్తే చిన్న పిల్లవాడు కూడా భయపడడు. ఎవరీవిడ అని అడుగుతాడు. బూచికి అంతకంటె అవమానం ఉండదు.
రేవంత్ బాధేమిటంటే, యిప్పటికే కాంగ్రెసులో అనేక గ్రూపులున్నాయి. ఈవిడా వచ్చి ఓ ఒకటి మొదలెడితే పనీపాటా లేనివాళ్లు చుట్టూ చేరి స్టేటుమెంట్లు యిస్తూంటారేమో, అదో తలకాయనొప్పి. అందుకే ఆంధ్రకు పొమ్మనమను అంటాడు. అతనికేం పోయింది ఏమైనా అంటాడు. అక్కడెవరైనా యీవిడకి ఎఱ్ఱ తివాచీ పరుచుకుని కూర్చున్నారా? అసలక్కడ ఎఱ్ఱదో, నల్లదో తివాచీ ఉందా అని! చిరిగి పోయిన జంపఖానాల టెంటుహౌసులా ఉంది ఆంధ్ర కాంగ్రెసు పరిస్థితి. బుక్ చేసేవాడే లేడు. కాంగ్రెసు తరఫున టీవీలోకి వచ్చి మాట్లాడేవారే లేరు. ఎబిఎన్‌లో తులసిరెడ్డి లాటి వాళ్లు తప్ప! జివి రెడ్డి, సుందరరామ శర్మ అనేవాళ్లు ఉండేవారు. మొదటాయన టిడిపిలోకి, రెండో ఆయన వైసిపిలోకి గెంతేశారు. ఇక యీ తులసి రెడ్డయితే వైయస్ కుటుంబానికి బద్ధవిరోధి. కాంగ్రెసులోంచి జగన్ పోయాడ్రా హమ్మయ్య అనుకుంటూంటే యీ షర్మిల వచ్చిందేమిటి అనుకుంటాడాయన.
కాంగ్రెసులో వైయస్ అంటే పడేవాళ్లూ, పడని వాళ్లూ కూడా హోల్‌సేల్‌గా వైసిపిలోకి మారిపోయారు. ఇక ఆమె అక్కడికి వెళ్లి చేసేదేమి లేదు. జవసత్త్వాలుడిగిన పార్టీకి ప్రాణం పోస్తా అంటే నువ్వు అధ్యక్షురాలిగా ఉన్న పార్టీకే పోయలేక పోయావు. మాకేం పోస్తావు? అని అడుగుతారు. అంతే కదా, యిక్కడ కొత్త పలక మీదే ఏమీ రాయలేక పోయింది. అక్కడి పలక మీద అంతా గజిబిజి రాతలు, చట్రమే కాదు, పలకా విరిగి ఉంది. తెలంగాణకు వెళ్లకుండా మొదటే ఆంధ్రకు వచ్చి ఉంటే ఎలా ఉండేదో, యిప్పుడు వెళితే అక్కడ చెల్లని నాణెం యిక్కడ చెల్లుతుందా? అంటారు. భీష్ముడు తన తమ్ముడి కోసం కాశీరాజు కూతుళ్లు ముగ్గుర్ని స్వయంవరం నుంచి గెలిచి తెచ్చాడు. పెద్ద కూతురు అంబ ‘నేనిప్పటికే సాళ్వరాజుని ప్రేమించాను’ అని చెప్తే, అయితే వెనక్కి వెళ్లిపో అన్నాడు. వెళ్లి సాళ్వరాజుని అడిగితే నువ్వు పరాధీనవయ్యావు, నాకు వద్దు అన్నాడు. మళ్లీ భీష్ముడి దగ్గరకు వస్తే వేరేవారికి మనసిచ్చిన నిన్ను మా తమ్ముడికి ఎలా కట్టపెట్టమంటావు? అన్నాడు. అయితే నువ్వే చేసుకో అంటే నాకు బ్రహ్మచర్యవ్రతం ఉంది అన్నాడు. దాంతో అంబ నానా అగచాట్లు పడింది. షర్మిల యిప్పుడు ఆంధ్రకు వెళితే యీ కథే గుర్తు చేస్తారు. తెలంగాణపై మనసు పడిన దానివి, నీకు యిక్కడేం పని? అంటారు.
సొంత పార్టీ పెట్టుకుని వెళితే పోనీ అని ఊరుకునేవారేమో, కాంగ్రెసు ప్రతినిథిగా వెళితే మరీ వ్యతిరేకత వస్తుంది. విభజనలో తమకు చేసిన అన్యాయానికై ఆంధ్రులు యిప్పట్లో కాంగ్రెసును క్షమించే పరిస్థితి లేదు. సోనియా, రాహుల్ సారథ్యం మారితేనే ఎప్పటికైనా క్షమించవచ్చు. అది మారే సూచనలు కనబడటం లేదు. వైయస్ అంటే యిష్టం ఉండి, జగన్ అంటే పడని వాళ్లెవరైనా ఉంటే షర్మిల వాళ్లని కదిలించ గలదు అనుకుంటే, యిప్పుడు కాంగ్రెసులో చేరడం చేత అది నాశనమైంది. వైయస్‌ను ఘోరంగా అవమానించి, కేసుల పాలు చేసిన కాంగ్రెసులో షర్మిల చేరడంతో ఆమెపై సింపతీ పోయింది. ‘పాపం సోనియా, రాహుల్‌కు తెలియకుండానే కాంగ్రెసు నాయకులు కేసులు పెట్టేశారట’ అని షర్మిల చెబితే నమ్మేవారెవరు? స్వయంగా సోనియా చెప్పినా నమ్మడం కష్టం. అలాటిది షర్మిల చెపితే సరేలే యిప్పుడు ఏదైనా చెపుతావు అంటారు. రాహుల్‌ను ప్రధానిని చేయడం మా నాన్న ఆశయం. ఆ ఆశయసిద్ధి కోసమే వెళ్లాను అని చెపితే, పదేళ్ల తర్వాత గుర్తుకు వచ్చిందా అని అడుగుతారు. వైయస్ బతికి ఉండి ఉంటే, తన కొడుకునూ, తనతో కలిసి పనిచేసిన అధికారులనూ, బతికుంటే తననూ జైల్లో పెట్టించిన రాహుల్‌ను ప్రధానిని చేస్తానని అనేవాడా? షర్మిల ప్రచారానికి వెళితే యివన్నీ అడగరా?
ఇక షర్మిల ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పుకోవాలి? ‘మా అన్నయ్య ఆస్తి పంపకాల్లో నాకు అన్యాయం చేశాడు, మా వదిన నాకు పండక్కి పెట్టిన పట్టుచీర అంచు బాగా లేదు..’ యిలాటివేగా! నెంబరు ఒన్ మనీ అయితే విల్లు ప్రకారం వాటాలు ఎలాగూ వచ్చి ఉంటాయి. లేకపోతే కోర్టు కెక్కుతారు. నెంబరు టూ మనీ వాటాల విషయంలోనే కోర్టుకి వెళ్లలేని పరిస్థితి. వాటి గురించి మాట్లాడితే ప్రజల్లో సింపతీ ఏమొస్తుంది? మా డబ్బు గురించి మీ మధ్య పేచీలా? అనుకుంటారు. అయినా యింటి గొడవలపై ఎవరికీ ఆసక్తి ఉండదు. పైగా యిక్కడ షర్మిల రిక్తహస్తాలతో మిగలలేదు. ఆమె కుండే ఆస్తులు ఆమె కున్నాయి. ఇంకా రావాలి, కానీ రాలేదు.. అని మొత్తుకుంటే రొదగానే అనిపిస్తుంది. కాస్సేపు ఆ సొద విని, ఎవరింట్లో లేవు కనుక! అనుకుని వదిలేస్తారు. ..అందుచేత మీరు నాకు ఓటేయాలి. అని ముగిస్తే ఫక్కున నవ్వుతారు. దానికీ, దీనికీ ఏమిటి సంబంధం అని.
ఇది గ్రహించని ఆంధ్రజ్యోతి ఆమెను హైలైట్ చేస్తూ వచ్చి, ఆంధ్రలో జగన్‌కు ప్రత్యర్థిగా నిలబెడదామని తెగ ప్రయత్నించింది. ఆడపడుచుల గురించి, మేనల్లుళ్ల గురించి మాట్లాడుతున్న జగన్ తల్లిని, చెల్లిని మోసగించిన వైనాన్ని చెప్పి, ప్రజల కళ్లు తెరిపిస్తుంది అని ఆశ పెట్టుకుంది. తీరా ఆమె ఆంధ్రకు వెళుతుందేమోనని గట్టిగా అనిపించేసరికి, అది టిడిపికి లాభమా? నష్టమా? అనే సందిగ్ధం ప్రారంభమైంది. జగన్ మీద దుమ్మెత్తి పోసి, ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లను ఆమె చీలిస్తే టిడిపికి నష్టమే కదా! అది నివారించడానికి బాబు (కాంగ్రెసులోకి వెళ్లడానికి ముందు) షర్మిలతో పొత్తు పెట్టుకుంటే (సంభవమా? అని అడగకండి. బాబు ఎవరితోనైనా జట్టు కట్టగలరని పలుమార్లు ప్రూవయింది. పగ సాధించడానికై తను ఎవరితోనైనా చేతులు కలపగలనని కాంగ్రెసులో చేరడం ద్వారా షర్మిల చాటిచెప్పారు) బాబు ఆమెకు కూడా కొన్ని సీట్లు యివ్వాల్సి వస్తుంది. ఆమె ద్వారా మీడియాలో న్యూసెన్స్ చేయించి, జగన్ పరువు తీయించడం వరకు ఓకే కానీ, సీట్లు యివ్వడమంటే గొంతు పట్టుకుంటుంది. ఇప్పటికే ఎన్ని యిచ్చి జనసేనను తృప్తి పరచాలో తోచకుండా ఉంది. బిజెపి కలిసి వస్తే దానికి ఎన్ని యివ్వాలో! మధ్యలో షర్మిల వచ్చి ఏ పదో, పదిహేనో అడిగితే?
కచ్చితంగా గెలుస్తుంది అనుకుంటే యివ్వవచ్చు. కానీ ప్రజలు ఆమెను ఎంతవరకు నాయకురాలిగా ఆమోదిస్తారనేది ప్రశ్నే! రాజకీయ వారసత్వం అనేది సంతానంలో ఒక్కరికే దక్కుతుంది. కరుణానిధి వారసత్వం స్టాలిన్‌కే దక్కింది, అళగిరికి కాదు. దేవెగౌడ వారసత్వం కుమారస్వామికే, రేవణ్ణకు కాదు. ‘వైయస్ వారసత్వం జగన్‌కు యిచ్చేశాం, ఓదార్పు యాత్రకు వెళ్లినది, జైలుకి వెళ్లినది, పేపరు పెట్టి కష్టపడింది – అతను. నీది కేవలం పాదయాత్ర కష్టం మాత్రమే. నీకెందుకు వారసత్వంలో వాటా?’ అనేస్తే? ఇంట్లో గొడవలు చెప్తే జనం కరిగి ఓట్లేస్తారన్న గ్యారంటీ లేదు. సంజయ్ మరణం తర్వాత మేనకా గాంధీ యింట్లోంచి బయటకు వచ్చేసి ‘మా అత్త ఇందిర నన్ను తరిమేసింది’ అని పెద్ద గోల పెట్టింది. సంజయ్ విచార్ మంచ్ అనే పార్టీ పెట్టింది. ఇందిరపై కోపంతో ప్రతిపక్షాల వాళ్లు చేరదీశారు. ఎన్టీయార్ 1983లో ఆంధ్రప్రదేశ్ ఎసెంబ్లీ ఎన్నికలలో టిడిపి భాగస్వామిగా 5 సీట్లు కేటాయించారు. నలుగురు గెలిచారు. 1984 పార్లమెంటు ఎన్నికలలో ఆమె రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా నిలబడి ఓడిపోయింది. పార్టీ మూలపడింది. 1988లో జనతా దళ్‌లో చేరి మంత్రి అయింది. తర్వాత బిజెపిలో చేరి మంత్రి అయింది. కొడుకు తప్ప వేరెవరూ ఆమెకు అనుచరులు లేరు. షర్మిల పనీ అంతే అయ్యేట్టుంది. జగన్‌ను వ్యతిరేకించిన చెల్లెలు అని తప్ప ఆమె వద్ద వేరే క్వాలిఫికేషన్ లేదు. ఇవన్నీ ఆలోచించాక ఆమె ఆంధ్రకు వస్తే లాభమని ఆంధ్రజ్యోతి అనుకోవడం మానేసింది.
మొత్తం మీద ఏమనుకుందో ఏమో షర్మిల కాంగ్రెసులో చేరింది. ఫేడౌట్ అయి, కనుమరుగు కావడం కంటె కాంగ్రెసు సముద్రంలో మునకేస్తే గుంపులో గోవిందాగా ఉంటూ జాతీయ కార్యదర్శి వంటి పోస్టు తగిలించుకుని పొరుగు రాష్ట్రాలు తిరగవచ్చు అని షర్మిల అనుకుని ఉండవచ్చు. చిరంజీవి ఉదాహరణ కళ్లెదురుగా ఉంది. చిరంజీవి కాంగ్రెసులో ఉన్నారో లేదో ఆయనా చెప్పలేరు, పార్టీ వాళ్లూ చెప్పలేరు. 18 ఎమ్మెల్యేలు తెచ్చిన ఆయన స్థితే అలా ఉంటే ఒన్ ఉమన్ ఆర్మీ లాటి షర్మిల గతి ఏమవుతుందో ఊహించుకోవాలి. చేర్చుకోవడానికి కాంగ్రెసు వారి లెక్కలేమిటో తెలియదు. ఖమ్మం జిల్లాలో యీమెకు 2-3 శాతం ఓట్లు వస్తాయని ఏ సర్వే ఐనా చెప్పిందేమో ఏమో! ఆ మేరకు ఒక్క జిల్లాలోనైనా తెరాస వ్యతిరేక ఓటు చీలకుండా చేద్దామనుకుని సరేనన్నారేమో! చేర్చుకున్నాక షర్మిలను ఏ విధంగా ఉపయోగించు కుంటారో ఎవరికీ అర్థం కాకుండా ఉంది. సమావేశానంతరం షర్మిల కెసియార్‌ను గద్దె దింపడమే నా లక్ష్యం అని ప్రకటించడంతో, ప్రస్తుతానికి ఆమెను ఆంధ్రకు పంపకపోవచ్చు అనే ఊహాగానం ఉంది.
ఈలోగా దీనికి కారణమిది అంటూ సెప్టెంబరు 3న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణగారు ఓ కథ అల్లేశారు. 2024లో మోదీ బలహీనపడి కాంగ్రెసు అధికారం అంచుల దాకా వస్తుందని జగన్ అంచనాట. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకి తన ఎంపీల మద్దతు యిస్తానని కాంగ్రెసుకి హామీ యిచ్చారట. అందుకు గాను షరతేమిటంటే షర్మిలను ఆంధ్రకు పంపకూడదు. దీనికి కాంగ్రెసు సరేనంది. అందుకే షర్మిలనను ఆంధ్రకు పంపనంది. ఇదంతా తెలుసుకుని షర్మిల నిర్ఘాంతపోయిందంటూ రాధాకృష్ణ ఆమెపై జాలి కురిపించారు. ఓ పక్క బిజెపితో ఊరేగుతూ మరో పక్క కాంగ్రెసును కూడా బుట్టలో పెట్టేయగల రాజకీయ దురంధరుడిగా జగన్‌ను చిత్రీకరించిన రాధాకృష్ణ హమ్మ జగనూ అని ముక్కున వేలేసుకుని ‘జగన్మాయ కాంగ్రెసునూ కమ్మేసిందని’ వాపోయారు.
తమాషా ఏమిటంటే మూడు నెలలుగా జగన్ ఆడుతున్న యీ డబుల్ గేమ్ మోదీకి తెలుసో లేదో తెలియదంటూ రాధాకృష్ణ వర్రీ అవుతున్నారు. 2024లో బిజెపి మళ్లీ గెలవదని మెడమీద తలకాయ ఉన్న ఎవడైనా రూపాయి పందెం కాస్తాడా? 2029 నాటికి కూడా బిజెపి ప్రభ తగ్గుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. వంద ఎంపీ సీట్లు కూడా తెచ్చుకుంటుందన్న అంచనా లేని కాంగ్రెసుతో, తనపై కేసులు పెట్టి, జైలుకి పంపి, బెయిలు కూడా రాకుండా చేసిన సోనియాతో జగన్ అవగాహనకు వస్తారా? అదీ కేవలం షర్మిల ఆంధ్రకు రాకుండా చేయడానికి!? చంద్రబాబుకే భయపడని జగన్ షర్మిలకు భయపడి కాంగ్రెసుతో రాజీ పడతారా? ఎక్కడెక్కడి కేసులూ తవ్వి తీసే గండరగండడు మోదీకి మిత్రద్రోహం చేయడానికి ఎవరైనా సాహసిస్తారా? కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీతో నైనా జగన్ పేచీ పెట్టుకోవడానికి సిద్ధంగా లేరనేది యథార్థం.
కానీ జగన్ ఆ పని చేస్తాడని రాధాకృష్ణగారు మనల్ని నమ్మమంటున్నారు. తనీ విషయం బయట పెట్టగానే తుమ్మల, మండవ వంటి వారు కాంగ్రెసులో చేరడానికి సందేహిస్తారని, తెలంగాణాలో ‘సెటిలర్లు’ కాంగ్రెసును దూరం పెట్టేస్తారని.. యింకా యిలాటి జోస్యాలు చాలా చెప్పేశారు. ముక్తాయింపుగా ‘కాంగ్రెసుతో సయోధ్య కుదుర్చుకున్న జగన్ విషయంలో మోదీ ఏ వైఖరి తీసుకుంటారన్నది త్వరలో తేలిపోతుంది’ అని మనల్ని ఊరించారు. ‘‘మిస్సమ్మ’’ సినిమాలో అల్లు రామలింగయ్య పాత్ర లక్ష్యం హీరోహీరోయిన్ల ఉద్యోగాలు ఊడగొట్టించడం. దానికని ప్రతీదానికి ‘ముందు వాళ్ల ఉద్యోగాలు పీకేసి…’ అని సూచిస్తూ ఉంటాడు.
రాధాకృష్ణగారిదీ అదే ధోరణి. బిజెపికి జగన్‌తో ఉన్న బంధాన్ని తెంపేసి, టిడిపి మెడలో తాళి కట్టించాలనే తాపత్రయం. ‘నమ్మకద్రోహి జగన్‌ను నమ్మి చెడకండి, నమ్మకానికి మారుపేరైన చంద్రబాబుతో పొత్తు కలపండి’ అని మోదీకి యీ వ్యాసం ద్వారా సందేశం యిచ్చారు. షర్మిల విషయానికి వస్తే కాంగ్రెసును నమ్మి భంగపడిందని, ఆదిలోనే హంసపాదు పడిందని ప్రకటించారు. ‘నీలాటి మిత్రులుంటే శత్రువులతో పనేముంది?’ అని హిందీలో అంటూంటారు. రాధాకృష్ణ వంటి మద్దతుదారులుంటే షర్మిల రాజకీయ భవిష్యత్తు అయోమయం కావడంలో ఆశ్చర్యమేముంది?
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2023)