చిత్రం: ఖుషి
రేటింగ్: 2.75/5
తారాగణం: విజయ్ దేవరకొండ, సమంత, మురళి శర్మ, శరత్ ఖేదేకర్, శరణ్య, జయరాం, రోహిణి, ఆలి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
కెమెరా: మురళి జి
సంగీతం: హేషం అబ్దుల్ వాహబ్
నిర్మాత: నవీన్ యెర్నేని, రవిశంకర్ ఎలమంచిలి
దర్శకత్వం: శివ నిర్వాణ
విడుదల: సెప్టెంబర్ 1, 2023
లైగర్ దెబ్బకి డీలా పడ్డ విజయ్ దేవరకొండ, శాకుంతలం తో ఫ్లాప్ చవిచూసిన సమంత కలిసి నటించిన చిత్రం “ఖుషి”. టక్ జగదీష్ తర్వాత ఈ చిత్రంతో ముందుకొచ్చిన దర్శకుడు శివ నిర్వాణ. ఈ ముగ్గురికి ఒక హిట్ జీవనావసరం. టికెట్ కొని చూసే ఆడియన్స్ కి కూడా అదే వినోదావసరం. మరెలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే విప్లవ్ దేవరకొండ (విజయ్ దేవరకొండ) ఒక నాస్తిక ప్రముఖుడు లెనిన్ సత్యం (శరత్ ఖేదేకర్) కొడుకు. బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగం వస్తుంది. హైదరాబాద్లో కాకుండా అందంగా ఉంటుందని అడిగి మరీ కాశ్మీర్ లో పోస్టింగ్ వేయించుకుంటాడు. అక్కడ ఆరా (సమంత) అనే బుర్ఖాలో ఉన్న అమ్మాయిని తొలి చూపులోనే ప్రేమించేసి వెంటనే వెంటపడిపోతాడు. కొంత సేపటికి తెలుస్తుంది ఆమె ఆరాధ్య అనే బ్రాహ్మణ అమ్మాయని. ఆమె తండ్రి చదరంగం శ్రీనివాసరావు (మురళి శర్మ) ప్రముఖ ప్రవచనకర్త. భిన్నమైన కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చిన ఈ ఇద్దరి ప్రేమ పెళ్లికెలా దారితీస్తుంది, ఆ తర్వాత ఏమౌతుందనేది కథ.
కథ ఇదైతే కథనంలో రియల్ లైఫ్లో తారసపడే ప్రముఖుల్ని గుర్తు చేసేలాంటి సంఘటనలు పెట్టి కాస్త ఎంగేజ్ చేయగలిగాడు దర్శకుడు. లెనిన్ సత్యం పాత్రని బాబు గోగినేనిని తలపించేలా చూపించాడు. ముఖ్యంగా లెనిన్ సత్యం, చదరంగం శ్రీనివాసరావుల మధ్య నడిచే జాఫర్ టీవీ డిబేట్ సీనొకటుంది. అదంతా చంద్రగ్రహణాల గురించి. అప్పట్లో బాబు గోగినేని, బంగారయ్య శర్మల మధ్యన డిబేట్ లో సారాంశమే ఈ సీన్. చంద్ర గ్రహణం రోజు బిర్యాని తింటానని అక్కడ బాబు గోగినేని చెప్పినట్టే ఇక్కడ ఈ లెనిన్ సత్యం కూడా చెప్తాడు.
అదే విధంగా చదరంగం శ్రీనివాసరావు పాత్రని చాగంటి కోటేశ్వరరావు టైపులో పెట్టారు. పైగా స్వస్థలం కూడా కాకినాడ.
ఒక ఛాందస బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి, నాస్తిక కుటుంబానికి చెందిన అబ్బాయి ప్రేమించుని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందనే కాన్సెప్టుతో కథ ఎత్తుకుని.. నాస్తికత్వమైనా, ఆస్తికత్వమైనా వ్యక్తిగత స్పర్థలకి వెళ్లి మానవ సంబంధాలని తెగ్గొట్టకూడదన్న సందేశమే ఈ చిత్రం.
పనిలో పనిగా భార్యాభర్తల మధ్యన గొడవలు సహజం కనుక విడిపోవడం పరిష్కారం కాదని, పరస్పరం కలిసుండాలని బోధ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో “సఖి” నుంచి “పెళ్లైన కొత్తలో” వరకు ఎన్నో సినిమాలొచ్చాయి.
అలాగే పిల్లలు ప్రేమించుకుంటే ఎంతటి నియమాలున్న తల్లిదండ్రులైనా కులాంతర వివాహాలకి ఓకే చెప్పేయాలన్న మెసేజ్ కూడా అంతర్లీనంగా ఇచ్చినట్టే ఉంది.
కనుక ఇవన్నీ నచ్చేవాళ్లకి ఈ సినిమా నచ్చొచ్చు.
అయితే అంశాలేమున్నాయన్న దాని కంటే మంచి సినిమాకి కొలమానం భావోద్వేగాల్ని తారాస్థాయికి తీసుకెళ్లి పండించడం, తగుపాళ్లల్లో బ్లెండయ్యే హ్యూమర్ జతచేయడం. అప్పుడే ఆడియన్స్ పూర్తిగా వశమవుతారు. ఈ విషయంలో సినిమా టాప్ గ్రేడ్ అందుకోలేకపోయింది.
అన్నీ హడా విడిగా జరిగిపోతుంటాయి. హీరో ప్రేమలో పడడం దగ్గర్నుంచి క్లైమాక్స్ లో పెద్దల నిర్ణయాల వరకూ దేనిలోనూ ఒక ఆర్గానిక్ ఫ్లో ఉండడు. కథ అలా ఉంది కాబట్టి సీన్ అలా వచ్చింది అన్నట్టుంటుంది తప్ప ఒక పరిణామక్రమం కనిపించదు. దీనివల్ల ప్రారంభంలో బలంగా ఉన్న పాత్రలు చివర్లో వీక్ అన్నట్టుగా అనిపిస్తాయి.
పైగా ఈ సినిమాకి ప్రధానమైన టార్గెట్ ఆడియన్స్ యూత్. సాఫ్ట్ లవ్ లేదా మెసేజ్ ఓరియెంటెడ్ లవ్ సినిమాల్ని భరించాలంటే హ్యూమర్ బలంగా ఉండాలి. “గీత గోవిందం” కూడా హ్యూమర్ వల్లనే హిట్టయ్యింది. ఈ విషయంలో శివ నిర్వాణ వెనకబడ్డాడు.
ఇక అర్ధం లేని నాన్ సింక్ సీన్స్ కూడా ఉన్నాయి. కాశ్మీరులో యాక్షన్ సీన్ ఒక బోరింగ్ ఎపిసోడ్. అలాగే మెట్రో రైల్లో వచ్చే ఫైటింగ్ సీన్ కూడా హీరో గారికి మాస్ ఇమేజుందని గుర్తు చేయడానికుంది తప్ప కథకి అవసరం లేని వ్యవహారమది…పైగా ఈ ఫైటులో చంకలో కుక్కపిల్లొకటి.
అలాగే మరొక మైండ్లెస్ సీన్ స్పెర్మ్ టెస్టింగ్. ఆల్రెడీ భార్యకి గర్భం చేయగలిగినవాడికి మళ్లీ స్పెర్మ్ టెస్టింగ్ దేనికి? పోనీ లాజిక్ ని పక్కనపెట్టి హ్యూమర్ కోసమా అనుకుంటే చాలా అసహ్యంగా ఉందా ఎపిసోడ్.
పైగా స్పెర్మ్ తీసే సమయంలో ఎవర్ని ఊహించుకున్నావని హీరోయిన్ అడగడం.. దానికి టైటానిక్ హీరోయిన్ ని ఊహించుకున్నానని హీరో చెప్పడం.. చాలా పర్వెర్టెడ్ గా ఉంది. అయితే ఈ డైలాగ్ ని అమెరికాలో ఉంచి ఇండియాలో కోసేసారు. అమెరికాలో అయినా ఈ సినిమాని చూసేది తెలుగు కుటుంబాలే కదా! వాళ్లకి ఇలాంటివి ఇబ్బందిగా ఉండవనా? ఏమో… దర్శకుడికే తెలియాలి.
టెక్నికల్ గా ఈ సినిమాకి హైలైట్ పాటలు. ఏ సినిమాకైనా విడుదలకి ముందు పాటలు హిట్టైతే సగం గండం గట్టేక్కేసినట్టే. ఆ విధంగా ఈ “ఖుషి” ఎప్పెడెప్పుడు విడుదలవుతుందా అని వేచి చూసేలా చేసింది చాలామందిని. అన్ని పాటలు సాహిత్యపరంగా బాగున్నాయి. దర్శకుడే గీత రచయితగా అన్ని పాటలూ రాసి మెప్పించడం బాగుంది. సంగీతం కూడా వినసొంపుగా ఉంది. టాలీవుడ్ కి మరొక కొత్త ట్యాలెంటెడ్ సంగీత దర్శకుడు లభించినట్టే.
ఎడిటింగ్ మాత్రం షార్ప్ గా లేదు. సినిమా ఫ్లోకి అడ్డొచ్చే సీన్స్లు చాలా వరకు కట్ చేసుండాల్సింది. దానివల్ల కథనం కూడా పెద్దగా ఇబ్బంది పడేది కాదు. 2:45 గంటలు భరించడం కాస్త బరువే.
విజయ్ దేవరకొండ నటన, డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. సటిల్ గా బ్యాలెన్స్డ్ గా పాత్రలో ఒదిగి నటించాడు. అక్కర్లేని ఫైట్లు తీసేసుంటే మరింత కన్విన్సింగ్ గా ఉండేది ఈ పాత్ర.
సమంత చూడ్డానికి బాగుంది. నటన కూడా పాత్రకి తగ్గట్టుగా నీట్ గా ఉంది.
వెన్నెల కిషోర్ కాశ్మీర్ ఎపిసోడ్లో ఓకే. ఆలీది సింగిల్ సీనులో గెస్ట్ రోల్.
జయరాం, రోహిణి జంట సెకండాఫులో సెంటిమెంటుకి పనికొచ్చారు. రాహుల్ రామకృష్ణ ఓకే. అతన్ని పూర్తిగా వాడలేదు.
మురళి శర్మ, సచిన్ ఖేదేకర్లిద్దరూ భిన్న ధృవాలుగా బాగున్నారు. అయితే కథనంలో ఎక్కడా వారి పాత్రల్లో కావాల్సినంత లోతు కనపడలేదు.
మురళిశర్మ అల్లుడిగా శత్రు మెథడ్-యాక్టింగ్ చేసి ఆకట్టుకున్నాడు. ఇతనికి ఏ చిన్న పాత్ర ఇచ్చినా ప్రత్యేకత చాటుకుంటున్నాడు. అది అభినందించదగిన విషయం.
మొత్తంగా ఈ చిత్రం ప్రారంభంలో బాగుండి, కాశ్మీర్లో డీలా పడి, హైదరాబాద్లో పడుతూ లేస్తూ ప్రయాణించి, కేరళలో బాగా లేచి, కాకినాడలో సంతృప్తికరంగా ముగుస్తుంది.
మరీ అంత “ఖుషి” కాదు, అలాగని కొట్టి పారేసేటంత “మసి” కూడా కాదు. అది కాస్త, ఇది కాస్త అన్నట్టుంది.
పెద్దగా వినోదాన్ని ఆశించకుండా, కాసేపు టైం కిల్ చేయొచ్చనుకునే వారిని పెద్దగా నిరాశపరచదు. సినిమా ప్రారంభంలో దర్శకుడు శివ నిర్వాణ “నన్ను ప్రేమిస్తున్నందకు, భరిస్తున్నందుకు, క్షమిస్తున్నందుకు..” అంటూ కృతజ్ఞతలు కార్డు వేసాడు. కనుక ఇందులో ఇచ్చిన సందేశాన్ని ప్రేమించి, తప్పుల్ని భరించి, పొరపాట్లని క్షమిస్తే పెద్ద మనసు చేసుకున్నట్టే. ఆడియన్స్ ఎంతవరకు ఆ విశాల హృదయం చూపిస్తారో చూడాలి.
బాటం లైన్: కాస్త ఖుషి- కొంచెం మసి