ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హిందూ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో దసరా వేడుక ముందే వచ్చింది. నిషేధిత భూములకు జగన్ ప్రభుత్వం విముక్తి కల్పించింది. దీంతో ఐదు వేల కుటుంబాల ఆస్తులకు రిజిస్ట్రేషన్ సౌకర్యం వెసలుబాటు కలిగింది. ఇదంతా తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చొరవే కారణం.
తిరుపతి నగరం దినదినాభివృద్ధి చెందుతోంది. తిరుపతిలో వాటర్ కోర్స్ పోరంబోకు స్థలాలుగా పరిగణిస్తూ నగరపాలక సంస్థ పరిధిలోని తంబువాని గుంట, కొర్లగుంట, కొత్తపల్లి, చంద్రశేఖర్ రెడ్డి కాలనీ, ఎరుకల కాలనీ, జర్నలిస్ట్ కాలనీ (ఎర్రమిట్ట), కసం గడ్డ- కెనడి నగర్, భగత్ సింగ్ కాలనీ (ఓబులేసు కాలనీ), సుందరయ్య నగర్, శారదా నగర్, సూరయ్య కట్ట, చెన్నారెడ్డి కాలనీ, సంజీవయ్య నగర్, సింగాల గుంట, నరసింహ తీర్థం రోడ్డు, తాతయ్య గుంట, బొమ్మగుంట ప్రాంతాల్లోని స్థలాలను నిషేధిత జాబితా 22(ఎ) లో చేర్చారు.
దీంతో తిరుపతి అర్బన్ పరిధిలోని 17 ప్రాంతాల్లోని 104 ఎకరాల పరిధిలో. 5 వేల నివాసాలకు పైగా తీవ్ర ప్రభావం పడింది. ఇవేవీ 60 ఏళ్లకు పైగా రిజిస్ట్రేషన్ సౌకర్యానికి నోచుకోలేదు. దీంతో కళ్ల ముందే ఆస్తులున్నా అవసరానికి వాడుకోలేని దయనీయ స్థితి. తమ స్థలాలను రెగ్యులరైజ్ చేయించాలని కొన్నేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ 17 ప్రాంతాల్లోని ప్రజలు కాళ్లరిగేలా తిరుతున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.
గత సార్వత్రిక ఎన్నికల సందర్భంలో తిరుపతిలో వైసీపీ తరపున బరిలో నిలిచిన భూమన కరుణాకరరెడ్డి నీటి ఆవాసానికి ఏ మాత్రం అవకాశం లేని జనాలతో నిండిన ప్రాంతాలకు విముక్తి కల్పిస్తానని హామీ ఇచ్చారు. తిరుపతిలో లోకల్ బాడీ కొలువుతీరిన వెంటనే భూమన అభినయ్ ఈ భూముల అంశాన్ని లేవనెత్తి, సమస్య పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తీర్మానించారు. దాని ఫలితంగానే నేడు 104 ఎకరాల భూమి రెగ్యులరైజ్‌కు నోచుకుంది.
అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దఫాలుగా ఆయన కలెక్టర్, తదితర రెవెన్యూ అధికారులతో చర్చించారు. ఈ విషయమై సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. గత శనివారం ఈ భూములకు విముక్తి కల్పించే విషయమై తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డితో భూమన , డిప్యూటీ మేయర్ అభినయ్ చర్చించారు. భూమన శ్రమ ఎట్టకేలకు సత్ఫలితాలను ఇచ్చింది.
17 ప్రాంతాల్లోని ఐదు వేలకు మించి కుటుంబాల ఆస్తులకు నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో 104 ఎకరాలకు రిజిస్ట్రేషన్‌కు అడ్డంకులు తొలిగాయి. ఈ నిర్ణయం రానున్న ఎన్నికల్లో తీవ్ర ప్రభావం పడే అవకాశం వుంది. తిరుపతిలో వైసీపీ విజయానికి దోహదం చేస్తుందనే చర్చ నడుస్తోంది.
ఇప్పటికే తిరుపతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించడం అధికార పార్టీకి సానుకూలం కానుందనే చర్చకు తెరలేచింది. నిషేధిత భూములకు విముక్తి పొందిన లబ్ధిదారులు దసరాను ముందే చేసుకుంటున్నారు.