టీటీడీ నూతన పాలక మండలిని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. తాజా బోర్డు సభ్యుల్లో ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుడు వుండడాన్ని ఎల్లో మీడియా ప్రత్యేకంగా చూపుతోంది. వైసీపీ ప్రభుత్వం ప్రత్యేకత ఏంటంటే తనకు తానుగా వివాదాలకు అవకాశం ఇస్తూ వుంటుంది. గతంలో చెన్నై శేఖరరెడ్డికి బోర్డు సభ్యత్వ పదవి ఇచ్చి విమర్శల్ని మూటకట్టుకుంది.
తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయ్, ఆ తర్వాత అప్రూవర్‌గా మారిన అరబిందో గ్రూప్ డైరెక్టర్ పెనక శరత్‌చంద్రారెడ్డికి టీటీడీ బోర్డులో సీఎం వైఎస్ జగన్ స్థానం కల్పించారు. ఇంకా పలు కేసుల్లో సీబీఐ అరెస్ట్‌కు గురైన వారికి కూడా టీటీడీలో చోటు ఇచ్చారనే వార్తలొచ్చాయి. క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్లకు పవిత్రమైన టీటీడీలో శ్రీవారి సేవా భాగ్యం కల్పించి వుంటే అందరి మన్ననలు పొందేవాళ్లు. కానీ అలా జరగకపోవడం విచారకరం. ఎవరేమన్నా అనుకోని, తమకు నచ్చిన వారికి పదవులు ఇస్తామనే ధోరణి ప్రభుత్వాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈనాడు పత్రిక ప్రధానంగా టీటీడీ కొత్త బోర్డును హైలెట్ చేయడం చూస్తే… ఆ మీడియా యజమాని వైఖరి ఏంటో తెలుసుకోవచ్చు. “టీటీడీ బోర్డు సభ్యుడిగా లిక్కర్ కేసు నిందితుడు” శీర్షికతో వార్తకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక కథనంలోకి వెళితే…. “టీటీడీ అంటే పవిత్రతకు మారుపేరు. అలాంటి పవిత్ర సంస్థ పాలక మండలి సభ్యులుగా లిక్కర్ కేసులో అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డికి వైసీపీ ప్రభుత్వం స్థానం కల్పించింది” అని రాసుకొచ్చారు.
టీటీడీ అంటే పవిత్రతకు మారుపేరు అనడంలో ఏ ఒక్కరికీ భిన్నాభిప్రాయం వుండాల్సిన అవసరం లేదు. ఇదే సందర్భంలో నెటిజన్లు తమదైన సృజనాత్మక రీతిలో రామోజీపై సెటైర్స్ విసురుతున్నారు. మీడియా అనేది అతి పవిత్రమైందని, అందుకే దాన్ని ఫోర్త్ ఎస్టేగా పిలుచుకుంటున్నామని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అలాంటి ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా రంగం… మార్గదర్శిని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్న నిందితుడి చేతిలో వుండడం సమాజానికి శ్రేయస్కరం కాదని చురకలు అంటిస్తున్నారు.
అతి పెద్ద నేరానికి పాల్పడి, ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు ఎదుర్కొంటున్న వ్యక్తి నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వుందని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు. వ్యవస్థల్ని అడ్డు పెట్టుకుని కేసుల నుంచి తప్పించుకుంటూ, ప్రవచనాలు వల్లించడం ఒక్క రామోజీరావుకే చెల్లిందనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి మీడియా అధిపతికి పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం… ఆ పురస్కారాన్ని అవమానించడమే అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.