మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు కొత్త విషయాల్ని వెలుగులోకి తెస్తోంది. సీబీఐ దర్యాప్తు దాదాపు వంద రోజులకు చేరుకుంది. ఇందులో భాగంగా హత్యలో కీలక వ్యక్తుల అరెస్ట్‌ల పర్వం ఊపందుకుంది. ఇప్పటికే సునీల్ యాదవ్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా హత్యతో సంబంధం ఉందనే ఆధారాలతో ఉమాశంకర్‌రెడ్డి అనే వ్యక్తిని సీబీఐ అరెస్ట్ చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి పొలం పనులు చూసే జగదీశ్వర్‌రెడ్డి సోదరుడే ఉమా శంకర్‌రెడ్డి. అనంతరం పులివెందుల కోర్టులో అతన్ని హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలున్నాయి.
వివేకా హత్యకేసులో సునీల్, ఉమాశంకర్ పాత్ర ఉన్నట్టు ఆధారాలున్నాయని సీబీఐ పేర్కొంది. సునీల్‌తో పాటు వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి కూడా ఉమాశంకర్ పాత్రకు సంబంధించి వివరాలు వెల్లడించారని సీబీఐ స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా వివేకా హత్యకు ముందు మరో ప్రాణి ప్రాణం తీసినట్టు సీబీఐ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. వివేకా ఇంట్లో కుక్క అడ్డంకిని తొలగించుకున్నారని సీబీఐ స్పష్టం చేసింది. సునీల్, ఉమాశంకర్ కలిసి కారుతో ఢీకొట్టి కుక్క ప్రాణం తీశారని దర్యాప్తు సంస్థ వెల్లడించడం గమనార్హం.