వివాదాలు వదలని జయలలిత.. చిక్కుల్లో ‘తలైవి’

రాజకీయాల్లోకి వచ్చే సమయంలో, వచ్చిన తర్వాత కూడా ఎన్నో కష్ట నష్టాలు అనుభవించారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత. కోట్ల ఆస్తులున్నా, ముఖ్యమంత్రి అయినా కూడా ఆమెకు మనశ్శాంతి లేదంటే ఆమె…

రాజకీయాల్లోకి వచ్చే సమయంలో, వచ్చిన తర్వాత కూడా ఎన్నో కష్ట నష్టాలు అనుభవించారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత. కోట్ల ఆస్తులున్నా, ముఖ్యమంత్రి అయినా కూడా ఆమెకు మనశ్శాంతి లేదంటే ఆమె వ్యక్తిగత జీవితం ఎంత విషాదమయమో అర్థం చేసుకోవచ్చు. చివరకు ఆమె చనిపోయిన తర్వాత ఆస్తుల విషయంలో ఎన్నెన్ని మతలబులు జరిగాయో అందరికీ తెలుసు. 

వారసులు లేకపోవడంతో ఆమె ఆస్తిని చేజిక్కించుకోడానికి అందరూ ప్రయత్నాలు చేశారు. చివరికవి ప్రభుత్వం స్వాధీనంలో ఉన్నాయి. సరిగ్గా జయలలిత జీవిత కథ ఆధారంగా తీస్తున్న సినిమా కూడా ఇప్పుడు ఆర్థిక వివాదాల్లో చిక్కుకోవడం విచిత్రం. జయలలిత జీవితం లాగే జయలలిత పేరతో తీసిన “తలైవి” సినిమా కూడా వివాదాల మయంగా మారింది.

ఇంతకీ ఏం జరిగింది..?

తలైవి సినిమాలో జయలలిత పాత్రను కంగనా రనౌత్ పోషించడమే పెద్ద సంచలనం. అప్పటికే వివాదాల నటిగా పేరున్న కంగన, జయలలిత పాత్రను పోషిస్తూ మరిన్ని వివాదాలు సృష్టించారు. ఈ సినిమా టైమ్ లోనే కంగన నోటి దురుసుకి ఆమె ట్విట్టర్ అకౌంట్ కూడా క్లోజ్ అయింది. రాజకీయ వ్యాఖ్యలు కూడా ఆమెని టాక్ ఆఫ్ ది టౌన్ గా మార్చాయి. ఈ విషయాలు పక్కనపెడితే.. ఇప్పుడు సినిమా చుట్టూ ఆర్థిక వివాదాలు ముసురుకున్నాయి. 

తమకు తెలియకుండా తమ సొమ్ముని దొంగతనంగా భాగస్వాములు ఈ సినిమాలో పెట్టారని రచ్చకెక్కారు విబ్రి మీడియా పార్టనర్స్. తలైవి సినిమాని విబ్రి మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మించాయి. అయితే ఇందులో విబ్రి మోషన్ పిక్చర్స్ అనే సంస్థ వ్యవహారంలోనే గొడవలు బయటపడ్డాయి.

విబ్రి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో హైదరాబాద్ లో ఉన్న సంస్థలో విబ్రి మోషన్ పిక్చర్స్ అధినేతలు కూడా భాగస్వాములుగా ఉన్నారు. ఈ క్రమంలో ఇందూరి విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన భార్య బ్రిందా ప్రసాద్.. విబ్రి మోషన్ పిక్చర్స్ సంస్థకు, విబ్రి మీడియా నుంచి 75లక్షల రూపాయలు అక్రమంగా మళ్లించారని ఆ డబ్బుతో “తలైవి” సినిమా తీశారనేది ప్రధాన ఆరోపణ. విబ్రి మీడియాలో పార్టనర్ గా ఉన్న కార్తీక్ కృష్ణన్ అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు తీసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు.

సినిమా రిలీజ్ కి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్న ఈ దశలో ఏకంగా నిర్మాతలపైనే ఫిర్యాదు రావడంతో సినిమాపై వివాదం మరింత పెద్దదైంది. మొత్తానికి జయలలిత జీవితంలాగే ఒడిదొడుకులను ఎదుర్కొన్న తలైవి సినిమా తీరా రిలీజ్ ముంగిట కూడా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి రావడం విధి విచిత్రం కాక ఇంకేంటి..?