ఆశలు పెట్టుకోవాలా వద్దా.. జనసేనలో నైరాశ్యం!

2019 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత జనసేన నుంచి చాలామంది బయటకు వెళ్లిపోయారు. జ్ఞానోదయం అయినవారు తమ తమ వ్యాపకాల్లో కుదురుకోగా.. ఇంకా ఆశలు చావని వారు మాత్రం 2024 కోసం ఆశగా ఎదురు…

2019 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత జనసేన నుంచి చాలామంది బయటకు వెళ్లిపోయారు. జ్ఞానోదయం అయినవారు తమ తమ వ్యాపకాల్లో కుదురుకోగా.. ఇంకా ఆశలు చావని వారు మాత్రం 2024 కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. “జనసేన టికెట్ పై గెలిచేస్తాం, పవన్ సీఎం అయితే మనం మంత్రి పదవుల్లో కూర్చుంటాం, కనీసం స్పీకర్ అయినా అయిపోదాం, కుదిరితే ఢిల్లీ వెళ్లి పార్లమెంట్ లో జనసేన వాణి వినిపిద్దాం..”  ఇలాంటి పెద్ద పెద్ద లక్ష్యాలేవీ ఎవరికీ లేవు. కాకపోతే.. రాజకీయ నాయకుడు అనే ఇమేజ్ కోసమే వీరు తాపత్రయపడుతున్నారు.

2024లో జనసేన టికెట్ పై పోటీ చేయాలని, ఎలాగోలా అసెంబ్లీ అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి అనే పేరు సంపాదించాలనేది వీరి కోరిక. అయితే ఈ ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నారు పవన్ కల్యాణ్.

2019లో ఓడిపోయినా, కనీసం 2024లోనైనా సత్తా చాటుదామనే ఉద్దేశంతో కొంతమంది జనసేన నేతలు తమతమ నియోజకవర్గాల్లో యాక్టివ్ గా ఉన్నారు. పవన్ టిక్కెట్ ఇస్తే పోటీ చేసి సత్తా చాటుదామని చూస్తున్నారు. ఇలాంటి వాళ్లంతా ఈ రెండేళ్లు బాగానే పనిచేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు, లోకల్ నాయకులకు ఎదురెళ్లి లేనిపోని శతృత్వాలు కొనితెచ్చుకున్నారు. 

సభలు, సమావేశాలు, పార్టీ ప్రచారం అంటూ చేతి చమురు బాగానే వదిలించుకున్నారు. అయితే ఇప్పుడిప్పుడే వీరిలో అనుమానం మొదలవుతోంది. కొంతమంది ఆల్రెడీ డైలమాలో పడ్డారు. మరికొంతమంది మాత్రం అనుమానంలో కూడా ఆశనే నమ్ముకున్నారు.

పోటీ చేయనిస్తారా..? త్యాగం చేయమంటారా..?

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో త్యాగాల పురిటిగడ్డ జనసేన పార్టీ. ఎవరు, ఎప్పుడు స్నేహ హస్తం అందించినా ఈజీగా బుట్టలో పడిపోతుంది. అంతే ఈజీగా టికెట్ కూడా త్యాగం చేస్తుంది. 

ఒకటా రెండా, ఇలాంటి అనుభవాలు జనసేన నాయకులకు కోకొల్లలు. 2024లో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందనేదే వీరి భయమంతా. కష్టపడి పని చేసిన తర్వాత పొత్తుల్లో భాగంగా తమ సీటును తీసుకెళ్లి ఏ బీజేపీకో లేక టీడీపీ నేతకో అప్పగిస్తే తమ పరిస్థితేంటని ఆలోచనలో పడ్డారు. రాష్ట్రంలో ఇలాంటి నేతలు ఓ 20 మంది వరకు ఉన్నారు.

వీరికైనా క్లారిటీ ఇస్తారా..?

పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ, పార్టీ టికెట్ పై పోటీ చేయాలనే ఆశ పెట్టుకున్న ఇలాంటి వాళ్లకైనా పవన్ కల్యాణ్ ఓ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ క్యాడర్ లేదు, కనీసం ఇలా యాక్టివ్ గా ఉన్న ఓ 15-20 మంది నాయకులనైనా పవన్ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పని కూడా తక్షణం చేయాలి. ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఇక్కడ మీరే పోటీ చేస్తారు, మీ సీటు మీదే అనే భరోసా ఇవ్వాల్సిన సందర్భం ఇదే.

ఆ భరోసా పవన్ ఇస్తే కచ్చితంగా 2024నాటికి జనసేనలో కొంతమంది బలమైన అభ్యర్థులుగా తయారయ్యే అవకాశం ఉంది. కానీ పవన్ మాటమీద నిలబడగలరా.. మిత్రపక్షాల ఒత్తిడి తట్టుకుని తమ పార్టీ నాయకులకు న్యాయం చేయగలరా అనేది మాత్రం అనుమానమే.