కరోనా ఉధృతిలో కూడా నాలుగు టెస్టు మ్యాచ్ లను నిర్వహించారు. అది కూడా వీక్షకులతో స్టేడియంలు నిండుగా ఉండగా. అయితే.. ఈ సుదీర్ఘ సీరిస్ కు కరోనా ఆటంకం తప్పడం లేదు. టీమిండియా క్రికెటర్లకు కరోనా టెస్టులు నిర్వహించగా, అందరూ నెగిటివ్ గా తేలినా… ఆఖరి నిమిషాల్లో మాత్రం మ్యాచ్ రద్దు అయ్యింది.
ఇండియా, ఇంగ్లండ్ ల మధ్య జరగాల్సిన ఐదో టెస్టు ను రద్దు చేస్తున్నట్టుగా ఇరు దేశాల క్రికెట్ బోర్డుల సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. రసవత్తరంగా జరుగుతున్న సీరిస్ నేపథ్యంలో.. ఐదో టెస్టు రద్దు అయ్యింది.
కరోనా వ్యాప్తిని నిరోధించడానికే ఈ మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరి ఇంతకీ ఇండియన్ క్రికెటర్లు ఎవరైనా కరోనాకు గురయ్యారా? అనే సందేహాలను రేకెత్తిస్తోంది ఈ ప్రకటన. ముందుగా కోచ్ రవిశాస్త్రి పాజిటివ్ గా తేలాడు. దీంతో ఆటగాళ్లకు వరస పెట్టి పరీక్షలను నిర్వహించినట్టుగా బీసీసీఐ ప్రకటించింది. ఆ టెస్టుల్లో ఎవరూ పాజిటివ్ గా తేలలేదట. పాజిటివ్ గా తేలనప్పుడు ఇక మ్యాచ్ ఎందుకు రద్దు చేస్తున్నట్టు అనేది అసలైన ప్రశ్న. కేవలం వ్యాప్తిని నిరోధించడానికే అని బోర్డులు ప్రకటిస్తున్నాయి.
త్వరలోనే బీసీసీఐ ఐపీఎల్ పెండింగ్ మ్యాచ్ లను నిర్వహించాలని అనుకుంటోంది. ఇలాంటి నేపథ్యంలో ఆటగాళ్ల విషయంలో ఏవైనా సందేహాలు ఉండి ఉండాలి. అందుకే మ్యాచ్ రద్దుకు మొగ్గు చూపి ఉండవచ్చు. ఏదేమైనా.. రసవత్తరంగా జరుగుతుందనుకున్న ఐదో టెస్టు మ్యాచ్ ఆఖరి గడియల్లో రద్దు అయ్యింది.