మళ్లీ రాంగ్ డైరక్షన్ లో జగన్

ఆ చెప్పేవాడు సరైన వారవ్వాలి.  Advertisement ఆ చెప్పేమాట సరైనది కావాలి.  అప్పుడే సరైన నిర్ణయాలు వెలువడతాయి.  కానీ ఇక్కడ ఇంకో షరతు కూడా వుంది. ఆ సరైన మాటను వినాలి కూడా. కానీ…

ఆ చెప్పేవాడు సరైన వారవ్వాలి. 

ఆ చెప్పేమాట సరైనది కావాలి. 

అప్పుడే సరైన నిర్ణయాలు వెలువడతాయి.  కానీ ఇక్కడ ఇంకో షరతు కూడా వుంది. ఆ సరైన మాటను వినాలి కూడా.

కానీ ఆంధ్రలో ఇవే జరగడం లేదు. సరైనవాళ్లు చెప్పడం లేదు. సరైన సలహా ఇవ్వడం లేదు. . వినదగు నెవ్వరు చెప్పిన అనుకోవడం లేదు. అందుకే సరైన నిర్ణయం తీసుకోవడం లేదు.. వెలువడడం లేదు.

సినిమా టికెట్ ల ఆన్ లైన్ వ్యవహారమే తీసుకోండి. ఇది ఎలా వుందీ అంటే…ఎద్దు ఈనింది అంటే దొడ్ల సావిట్లో కట్టేయండి అన్న చెప్పిన చందంగానే. 

థియేటర్ల దగ్గర లెక్కలు బయటకు రావడం లేదు. ప్రభుత్వానికి టాక్స్ ఎగ్గొడుతున్నారు. ఇది ఇవ్వాల్టి సంగతి కాదు. నట్టి కుమార్ లాంటి వాళ్లు ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్నారు. దగ్గుబాటి సురేష్ బాబు లాంటివారు థియేటర్లను గుప్పిట్లో వుంచుకుని, ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొడుతున్నారు అని ఆయన బాహాటంగా గొంతు చించుకున్నారు. 

అయితే అప్పటి ప్రభుత్వం సురేష్ బాబుకు లేదా అలాంటి వారికి అనుకూలం కావచ్చు. కావాలనే చూసీ చూడనట్లు వదిలేసింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం దీన్ని పట్టుకుంది. అంత వరకు మంచిదే. ఆన్ లైన్ టికెటింగ్ అన్నది స్వాగతించతగ్గ పరిణామమే.

ఆన్ లైన్ టికెట్ వ్యవస్థ అంటే నిర్మాతలు స్వాగతిస్తున్నారు. ఒక్క డిస్ట్రిబ్యూటర్ సరైన లెక్కలు చెప్పరు. ఓవర్ ఫ్లోస్ ఇవ్వరు. ఇప్పుడు వాళ్లను మేము గట్టిగా అడగానికి చాన్స్ వుంటుంది…అన్నారు ఓ నిర్మాత. 

డిస్ట్రిబ్యూటర్లను అడ్డం పెట్టుకుని, లేని కలెక్షన్లు చూపించి, ఫేక్ కలెక్షన్లు ఫ్యాన్స్ ద్వారా ప్రచారం చేయించి, తమకు ఇంత మార్కెట్ వుంది…అంత మార్కెట్ వుందని బడా హీరోలు తమ రెమ్యూనిరేషన్లను 60 కోట్లకు చేర్చేసారు. ఇక ఈ ఆట కడుతుంది. బాబూ…మీ సినిమా ఈ జిల్లాలో చేసింది ఇంత. తమ ఫేక్ కలెక్షన్ల డొల్ల ఇదీ అని చూపించి కట్టడి చేయొచ్చు. అని మరో నిర్మాత అన్నారు. 

ఇక ఆన్ లైన్ టికెట్ వ్యవస్థకు డిస్ట్రిబ్యూటర్లు కూడా సుముఖంగానే వున్నారు. ఏ థియేటర్ లో ఎంత  వచ్చిందో సరైన ఫిగర్ తెలియడం లేదు. ఎంత మా మనుషుల్ని పెట్టినా ప్రయోజనం లేకుండా వుంది. ఆన్ లైన్ అయితే లెక్క క్లియర్ గా వుంటుంది..అన్నారు ఓ డిస్ట్రిబ్యూటర్.

మరి ఆన్ లైన్ టికెట్ వ్యవస్థతో ఎవరికయ్యా నష్టం అంటే ఎగ్జిబిటర్లకే. వాళ్ల గిల్లుడు ఆగిపోతుంది. వాళ్ల సెకండరీ వ్యవహారాలు ఆగిపోతాయి. 

అయితే ఆన్ లైన్ టికెట్ వ్యవస్థ ప్రవేశ పెట్టే ముందు, మంచి చెడ్డా ఆలోచించాలి కదా? ముందు వెనుక చూడాలి కదా?  ప్రభుత్వం పోర్టల్ పెట్టడం అంటే అంత వీజీనా? అత్యంత శక్తివంతమైన ఇండియన్ రైల్వేపోర్టల్ కూడా రద్దీ టైమ్ లో నానా ఇబ్బంది పెడుతూ వుంటుంది. ఇన్ని ఏళ్ల తరువాత, ఇన్ని అప్ డేట్ లు ఇచ్చి, ఇన్ని మార్పులు చేసినా కూడా. 

అలాంటిది ప్రభుత్వం పోర్టల్ పూల్ ప్రూఫ్ గా చేయడం ఈజీనా? బుక్ మై షో లాంటి వాటికి కాల్ సెంటర్ వ్యవస్థ వుంది. ప్రభుత్వం దాన్ని కూడా తయారుచేయాలి. పైగా ప్రభుత్వ కాల్ సెంటర్లు అంటే ఎలా పని చేస్తాయో ఊహించుకోవచ్చు. నిజానికి బుక్ మై షో యాప్ వందల కోట్లు కమిషన్ గా సంపాదిస్తోంది. అందుకోసం బడా ఎగ్జిబిటర్లకు, కొందరు సినిమా పెద్దలకు కొన్ని కోట్లు వడ్డీ లేని అప్పులు ఇచ్చిందని టాక్ కూడా వుంది.  ఇప్పుడు ఆ కార్పొరేట్ల చూస్తూ ఊరు కుంటాయా?

అసలు అవన్నీ అలా వుంచితే ప్రైవేట్  ప్రాపర్టీకి ప్రభుత్వం టికెట్ లు అమ్మడం ఏమిటి? ప్రైవేట్  లాడ్జీల రూమ్ లు ప్రభుత్వం పెట్టే యాప్ ద్వారా బుక్ చేయడ సాధ్యమా?  ప్రైవేట్  నర్సింగ్ హోమ్ లు, కళ్యాణ మండపాలు, కన్వెన్షన్ సెంటర్లు మాటేమిటి?  

ఎక్కడ తప్పుడు లెక్కలు వుండి, అక్కడ రెవెన్యూ రాకపోతే, అక్కడ ప్రభుత్వం దూరిపోయి వ్యాపారం స్వాధీనం చేసుకోవడం సాధ్యమా?  ఇదే పాయింట్ల మీద ఎవరైనా కోర్టుకు వెళ్తే పరిస్థితి ఏమిటి? మరో మొట్టికాయ అదనం అన్నది తప్ప?

థియేటర్ల దగ్గర దొంగ లెక్కలు చూపిస్తున్నారు. పన్ను ఎగ్గొడుతున్నారు అంటే అది ప్రభుత్వ  అధికారుల చేతకాని తనం.  లేదా వారి లంచగొండి తనం. ముందుగా మందు వేయాల్సింది అక్కడ. అక్కడ నొక్కితే అన్నీ సెట్ అయిపోతాయి. ప్రభుత్వం రేట్లు తగ్గించిన జీవో ఇస్తేనే అది అమలు కాలేదు. 

పాత రేట్లే అమ్ముతున్నా ఎమ్మార్వోలు చోద్యం చూస్తున్నారు. ఆన్ లైన్ లో పాత రేట్లు అమ్ముతుంటే ఒక్క థియేటర్ ను అయినా ఎందుకు సీజ్ చేయలేదు. అలా చేసి వుంటే మిగిలిన వారికి భయం వచ్చేది.  అంటే ఎక్కడో మామూళ్లు చేతులు మారుతున్నాయన్నమాట.

ప్రభుత్వానికి నిజంగా చిత్త శుద్ది వుంటే బుక్ మై షో లాంటి యాప్ తో టైఅప్ పెట్టుకోవాలి. వాళ్ల ద్వారా ప్రతి థియేటర్, ప్రతి షో లెక్కలు ప్రతి గంటా ప్రతి ఒక్కరికీ తెలిసేలా అందుబాటులో వుంచాలి. పూర్తి ట్రాన్స్ పరెన్సీ వచ్చేయాలి. నిర్మాత హైదరాబాద్ లో వున్నా, ఫ్యాన్స్ అమెరికాలో వున్నా, అందరికీ ప్రతి థియేటర్, ప్రతి సినిమా లెక్క తెలిసిపోయేలా వుండాలి.  అప్పుడు కావాలంటే బుక్ మై షో టికెట్ కటింగ్ దగ్గరే జిఎస్టి  పోర్షన్ సెపరేట్ అయిపోయి, ప్రభుత్వానికి జమ అయిపోయేలా చూడాలి. 

కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఎలా వుందీ అంటే,  పని జరగకపోగా,  సింపుల్ కోర్టు నుంచి స్టే తెచ్చుకునేలా వుంది.మొట్టికాయ మొట్టించుకునేలా వుంది.  అంటే జగన్ ను ఎవరో రాంగ్ ట్రాక్ పట్టించి, ఈ థియేటర్ల లెఫ్ట్ వ్యాపారాన్ని అలాగే వుంచే ప్రయత్నం చేస్తున్నారు. సిన్సియర్ ఎఫెర్ట్ ను పక్క దారి పట్టించి, కోర్టు మెట్లు ఎక్కిస్తున్నారు. ఎవరో ఆ 'కట్టప్ప'?