దేశంలో చాలా రాష్ట్రాలు వినాయక చవితి సామూహిక ఉత్సవాలను రద్దు చేస్తున్నాయి. ఎవరికి వారు ఇంట్లో వినాయక చవితిని జరుపుకోవాలని, సామూహిక ఉత్సవాలు, ఊరేగింపులు, మండపాలు వద్దని వివిధ రాష్ట్రాలు చెబుతున్నాయి. ఏపీ, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలు ఈ ప్రకటనలు చేశాయి. ఇదే జాబితాలో ఇప్పటికే నిలిచిన రాష్ట్రాల్లో ఒకటి తమిళనాడు.
తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం కూడా వినాయక చవితి సామూహిక ఉత్సవాలను రద్దు చేసింది. ఎవరికి వారు ఇళ్లలో పండగ జరుపుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
ఇక బీజేపీ ఈ అంశంపై విబేధించింది. తమిళనాట కూడా ఆందోళనలు చేపట్టింది. వినాయకచవితి ఉత్సవాలకు అనుమతులు ఇవ్వాలని బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. మరి ఈ అంశం మీదే తీవ్రంగా స్పందించిన వారిలో పవన్ కల్యాణ్ ఉన్నారు. ఇప్పుడు స్టాలిన్ ప్రభుత్వం తీరును కూడా పవన్ కల్యాణ్ వ్యతిరేకిస్తున్నట్టా? లేక జగన్ ప్రభుత్వానిది మాత్రమే తప్పంటారా?
ప్రత్యేకించి స్టాలిన్ విషయంలో పవన్ ప్రస్తావన ఎందుకో చెప్పనక్కర్లేదు. ఇటీవలే స్టాలిన్ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ కితాబులిచ్చారు. స్టాలిన్ ది ఆదర్శవంతమైన పాలన అని ప్రశంసించారు. ఉన్నఫలంగా పవన్ కల్యాణ్ ఆ ప్రశంసల వర్షం కురిపించారు. అలా పవన్ చేత ప్రశంసలు అందుకున్న ప్రభుత్వం కూడా వినాయకచవితి సామూహిక ఉత్సవాలను రద్దు చేసింది. ఏపీలోనేమో మత పోరాటంలో పవన్ కల్యాణ్ భాగం అయ్యారు.
అవతల ఈయన కితాబులు అందుకున్న తమిళనాడు ప్రభుత్వం కూడా పవన్ కల్యాణ్ పోరాటానికి వ్యతిరేకంగానే నిర్ణయం తీసుకుంది. మొత్తానికి ఏపీలో వినాయచవితి ఉత్సవాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటున్న వారికి పక్క రాష్ట్రాల నిర్ణయాలు మింగుడుపడేలా లేవు!