నిర్మాత, పొలిటీషియన్, బిల్డర్ పొట్లూరి వరప్రసాద్ అలియాస్ పివిపి పై మరో కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. చూస్తుంటే గోటితో పోయేది గొడ్డలి వరకు తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. జూబ్లీ హిల్స్ లో పివిపి నిర్మించిన విల్లాల విషయంలో ఒక కొనుగోలు దారుతో పివిపి కి ఘర్షణ తలెత్తింది. అమ్మేసిన విల్లాకు మోడిఫికేషన్లు చేయడం దగ్గర సమస్య స్టార్ట్ అయింది. దీన్ని స్మూత్ గా డీల్ చేసుకునేబదులు, పివిపి కాస్త రఫ్ గా ముందుకు వెళ్లినట్లు కనిపిస్తోంది.
ఆ కేసు నమోదు అయిన తరువాత నుంచి పివిపి హైదరాబాద్ లో వుండడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పివిపి మీద మరో కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో జరిగిన గొడవ కేసులో అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లగా కుక్కలను వదిలారని అభియోగం నమోదు చేసినట్లు తెలుస్తోంది.
నిజానికి పివిపి హైదరాబాద్ లో లేరని, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వున్నారని మరో వెర్షన్ వినిపిస్తోంది. పివిపి గొడవ జరిగిన మర్నాడే ఆంధ్రకు వెళ్లిపోయారని టాక్ వినిపిస్తోంది. విధులకు ఆటంకం కలిగించారని, పోలీసులపై కుక్కులను ఉసిగొల్పారనే అభియోగంతో ఐపీసీ 353 కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారాన్ని నగర కమిషనర్ సీరియస్ గా తీసుకుని, ఆయనే పర్యవేక్షించబోతున్నారని వార్తలు వెలువడ్డాయి. మొత్తం మీద కరోనా టైమ్ లో పివిపి పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోతున్నట్లు కనిపిస్తోంది. సినిమాల్లో దాదాపు వంద కోట్లు నష్టపోయారు. అలాగే విజయవాడ ఎంపీగా పోటీ చేసి, పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా విజయం సాధించలేకపోయారు. ఫైనాన్సియర్ గా ఆయన డబ్బులు చాలా మంది దగ్గర ఇరుక్కుపోయాయి. ఆయన వాటాదారుగా వున్న కార్వీ కూడా ఇబ్బందుల్లో వుంది. ఇప్పుడు ఈ కేసు, దాని మీద కేసు.వీటన్నింటి నుంచి పివిపి బయటపడాల్సి వుంది.