రాయలసీమలో సానుకూల వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. జూన్ నెల ముగుస్తున్న సమయానికి వర్షపాతం ఆశాజనకంగా ఉండటం గమనార్హం. ప్రతియేటా ఈ సమయానికి వరుణుడి కోసం ప్రజలు ఎదురుచూడాల్సిన పరిస్థితి కనిపించేది. ఎప్పుడెప్పుడు వర్షం కురుస్తుందా.. అన్నట్టుగా ప్రజలు ఎదురుచూపుల్లో ఉండే వారు. జూన్ లో దట్టంగా మేఘాలు అయితే ఉండేవి. అయితే వర్షం కోసం ఎదురుచూపులు అయితే తప్పేవి కావు. ఈ క్రమంలో ఈ ఏడాది మాత్రం జూన్ లో మంచి స్థాయిలోనే వర్షపాతం నమోదు కావడం గమనించాల్సిన అంశం.
ఇప్పటికే చాలా పంటలు సాగయ్యాయి. వేరుశనగ, పత్తి పంటలు కు అనువైన వర్షం కురిసింది. సకాలంలో వర్షం రావడంతో అనంతపురం జిల్లాలో భారీ ఎత్తున వేరుశనగను విత్తారు. ఇది వరకూ.. జూలై నెలలో కూడా సరిగా వర్షాలు పడని పరిస్థితి. సాధారణంగా జూన్ రెండో వారం నుంచి చాలా చోట్ల వేరుశనగ సాగవుతుంది. కానీ గత ఐదేళ్లను చూసుకున్నా.. సరిగా వర్షాలు రాలేదు. ఎప్పుడూ జూన్ లో విత్తనం పడిన దాఖలాలు లేవు. జూలై నెలాఖరుకు విత్తనం పడితే అదే గొప్ప! అప్పుడు కూడా సరైన వర్షాలు లేక.. ఆగస్టుకు సమయం దాటి పోవడంతో కొంతమంది రైతులు చేళ్లను బీడు పెట్టేవాళ్లు. అలాంటి పరిస్థితులను ఎన్నో సార్లు చూసింది అనంతపురం జిల్లా. అయితే ఈ సారి మాత్రం పరిస్థితి సానుకూలంగా ఉంది. జూన్ రెండో వారంలోనే చాలా మంది రైతులు విత్తనాన్ని పూర్తి చేశారు. ఇక గతవారంలోనూ మంచి వర్షాలు రావడంతో.. మిగిలిన వాళ్లంతా విత్తనం పనులను పూర్తి చేసుకున్నారు.
మొదట్లోనే సాగు చేసిన వారికి.. గత వారంలోని వర్షాలు మరింత ఊరటగా మారాయి. ఇలా ఆరంభంలో పంటలకు చక్కటి సానుకూలత కనిపిస్తూ ఉంది. మరోవైపు కర్ణాటకలోని తుంగ, భద్ర వంటి నదుల పరివాహక ప్రాంతాల్లో మంచి వర్షాలు కురియడంతో అనంతపురం జిల్లాకు సానుకూలంగా కనిపిస్తోంది పరిస్థితి. ఈ ఏడాది టీబీ డ్యామ్ నుంచి మంచి స్థాయిలో నీటి లభ్యత ఉంటుందనే అంచనాలను వేస్తున్నారు అధికారులు.
ఖరీఫ్ ఆసాంతం ఇలానే వర్షాలు రావడం, వాగులు-వంకలు పారే ఒకటీ రెండు భారీ వర్షాలను రైతులు కోరుకుంటున్నారు. వర్షపాతం ఆ మేరకు నమోదైతే రైతులకు అంత కన్నా కావాల్సింది ఏమీ లేదు. వర్షం విషయంలో ఇప్పటికే జగన్ పాలనకు పాజిటివ్ ఇమేజ్ ఏర్పడిన విషయం కూడా గమనార్హం.