మధ్యప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడి 120 రోజులు అవుతున్నట్టున్నాయి. ఇప్పటి వరకూ అక్కడ పూర్తి స్థాయిలో కేబినెట్ ఏర్పాటు చేయలేకపోతున్నారు కమలం పార్టీ వాళ్లు. అక్కడ బోటాబోటీ మెజారిటీతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ గవర్నమెంట్ ను ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ చేసుకునేందుకే దేశంలో లాక్ డౌన్ ను మోడీ డిలే చేశారనే విమర్శలూ ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయేంత వరకూ పార్లమెంట్ సమావేశాలను నిర్వహించారనే విమర్శలూ వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఎలాగైతేనేం.. ఇప్పుడు బీజేపీ వాళ్ల తీరు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రభుత్వాల కూల్చుడు రాజకీయాలను, అంతా ఢిల్లీ నుంచి సాగించే రిమోట్ కంట్రోల్ పాలననూ గుర్తుచేస్తోందని అంటున్నారు పరిశీలకులు.
మధ్యప్రదేశ్ లో కేబినెట్ ఏర్పాటు పై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందిస్తూ.. తను ఢిల్లీ వచ్చిన తర్వాతే అని స్పష్టం చేస్తున్నారట. శివరాజ్ సింగ్ చౌహాన్ అంటే మాటలేమీ కాదు.. మూడు పర్యాయాలేమో ఆయన వరసగా మధ్యప్రదేశ్ సీఎంగా చేశారు. అయినప్పటికీ ఇప్పుడు ఆయన స్వయంగా కేబినెట్ ను కూర్చుకుని.. ఒక జాబితాను అధిష్టానానికి పంపించే పరిస్థితి లేకపోయినట్టుగా ఉంది! జాబితా తయారీకే ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని స్పష్టం అవుతోంది.
ఢిల్లీలో ఆయన బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డాను కలుస్తారని, అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోడీలను కూడా కలుస్తారని, ఆర్ఎస్ఎస్ నాయకత్వంతో కూడా సమావేశమై.. కేబినెట్ విషయంలో ఆమోదముద్ర వేయించుకుంటారని జాతీయ మీడియా చెబుతూ ఉంది. అంతేకాదట.. చౌహాన్ వెంట బీజేపీలోని ముగ్గురు నేతలు ఉంటారట, ఇక కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన జ్యోతిరాదిత్య సింధియా డిమాండ్ల మేరకు కూడా ఈ కేబినెట్ ఏర్పాటవుతుందట!
కొంతకాలం కిందట కర్ణాటకలో యడియూరప్ప ప్రభుత్వ ఏర్పాటు మొత్తం వ్యవహారం ఢిల్లీ కనుసన్నల్లో జరిగింది. ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి అత్యంత సీనియర్ నేత, మూడు సార్లు వరసగా గెలిచి, నాలుగో సారి కూడా స్వల్ప మెజారిటీని ప్రత్యర్థికి అప్పగించిన నేత ఇప్పుడిలా సీఎం అయిపోయి.. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాతే మధ్యప్రదేశ్ లో కేబినెట్ అని ప్రకటించుకోవాల్సి వస్తోంది! అచ్చంగా కాంగ్రెస్ పార్టీ గతంలో సాగించిన దివాళాకోరు రాజకీయాలను గుర్తు చేస్తున్నాయి ఈ పరిణామాలు.