డాక్ట‌ర్ గురుమూర్తి వెయిటింగ్‌…

తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నికపై రెండు తెలుగు రాష్ట్రాల దృష్టి ప‌డింది. ఎందుకంటే దుబ్బాక ఉప ఎన్నిక‌లో బీజేపీ అనూహ్యంగా గెలుపొంది అధికార పార్టీ టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చింది. దుబ్బాక ఫ‌లితం ఏపీ బీజేపీ…

తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నికపై రెండు తెలుగు రాష్ట్రాల దృష్టి ప‌డింది. ఎందుకంటే దుబ్బాక ఉప ఎన్నిక‌లో బీజేపీ అనూహ్యంగా గెలుపొంది అధికార పార్టీ టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చింది. దుబ్బాక ఫ‌లితం ఏపీ బీజేపీ నేత‌ల‌పై ఒత్తిడి పెంచింది. దీంతో ఏపీలో కూడా దుబ్బాక ఉప ఎన్నిక ఫ‌లితాన్నే పున‌రావృతం చేస్తామ‌ని ఆ రాష్ట్ర బీజేపీ నేత‌లు గ‌త కొంత కాలంగా చెబుతూ వ‌స్తున్నారు.

ఈ నేప‌థ్యంలో మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన‌ను ఒప్పించి తిరుప‌తి ఉప ఎన్నిక బ‌రిలో బీజేపీ పోటీ చేస్తోంది. తిరుప‌తి ఉప ఎన్నిక‌కు నేడు నోటిఫికేష‌న్ నేడు విడుద‌ల కానుంది. ఈ నెల 30వ తేదీ వ‌ర‌కూ నామినేష‌న్ల‌ను స్వీక‌రిస్తారు. 31న స్క్రూట్నీ, ఏప్రిల్ 3 వ‌ర‌కు ఉప సంహ‌ర‌ణ గ‌డువు ఉంటుంది. 17న పోలింగ్‌, మే 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మే 4న ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగుస్తుంది.

ఇదిలా ఉండ‌గా నామినేష‌న్ల‌పై అభ్య‌ర్థులు దృష్టి సారించారు. ఈ నేప‌థ్యంలో ఈ నెల 24న అంటే రేపు టీడీపీ అభ్య‌ర్థి ప‌న‌బాక ల‌క్ష్మి నామినేష‌న్ వేయ‌నున్నారు. ఇక బీజేపీ విష‌యానికి వ‌స్తే ఇంకా అభ్య‌ర్థినే ఖ‌రారు చేయ‌ని ప‌రిస్థితి. అధికార పార్టీ వైసీపీ డాక్ట‌ర్ గురుమూర్తిని బ‌రిలో దింపేందుకు నిర్ణ‌యించింది. ఈయ‌న ఈ నెల 26 లేదా 29వ తేదీ నామినేష‌న్ వేయ‌వ‌చ్చంటున్నారు.

డాక్ట‌ర్ గురుమూర్తి నామినేష‌న్ వేసేందుకు మంచి ముహూర్తం కోసం అధికార పార్టీకి చెందిన ఓ పెద్దాయ‌న వేద‌పండితుల‌తో చ‌ర్చిస్తున్నార‌ని స‌మాచారం. ఆ పెద్దాయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేదాన్ని బ‌ట్టి గురుమూర్తి నామినేష‌న్ వేస్తార‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక ప్ర‌క్రియ రోజురోజుకూ ఊపందుకుంటోంది.