టీడీపీని భుజాన మోసే ఎల్లో మీడియాను ఆ పార్టీ యువ నాయకుడు నారా లోకేశ్ అవమానిస్తున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధించి ఓ పెద్ద కుంభకోణాన్ని బయటపెడతానని లోకేశ్ ప్రకటించడమే నిదర్శనమని జనం అంటున్నారు. కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చేయాలనే సామెత ఊరికే పుట్టలేదు. ఎవరు చేయాల్సిన పని వారు చేయకపోతే నష్టమే తప్ప లాభం వుండదు.
అదేంటో గానీ బలమైన మీడియా వ్యవస్థని చేతిలో పెట్టుకుని తాను జగన్‌కు సంబంధించి పెద్ద కుంభకోణాన్ని బయటపెడతానని లోకేశ్ ప్రకటించడం చర్చకు దారి తీసింది. కుంభకోణం వివరాల్ని ఎల్లో మీడియా చేతికి ఇస్తే, లోకేశ్ ఆశించిన దాని కంటే ఎక్కువే రాసి, జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తుంది కదా? మరెందుకు ఆ బాధ్యతను లోకేశ్ నెత్తికెత్తుకుంటున్నారనేది ప్రశ్న.
కుంభ కోణాన్ని బయటపెట్టి ఆ క్రెడిట్‌ను ఎల్లో మీడియాకు ఇవ్వకుండా తానే సొంతం చేసుకుంటే, ఆ మీడియాధిపతులు, జర్నలిస్టు ప్రతినిధులు ఏం కావాలి? జగన్‌తో నిత్యం దుష్టచతుష్టయంగా మాటలు పడుతున్న మీడియాకు కుంభకోణం వివరాలు ఇవ్వకపోతే హర్ట్ కాదా?
ఇంత కాలం టీడీపీని భుజాన మోస్తూ, జగన్ ప్రభుత్వంపై ఉన్నవి లేనివి కల్పించి రాస్తున్నందుకు, చూపుతున్నందుకు లోకేశ్ ఇస్తున్న ప్రతిఫలం ఇదా? అనే ప్రశ్నకు ఏం సమాధానం చెబుతారు. గతంలో కూడా జగన్ ప్రభుత్వానికి సంబంధించిన భారీ కుంభకోణాన్ని బయటపెడతానని లోకేశ్ హెచ్చరించారు. అయితే శుభముహూర్తం దొరికినట్టు లేదు.
లోకేశ్ భారీ కుంభకోణం ప్రకటనపై ఎల్లో మీడియాకు చెందిన ఓ పత్రిక ప్రధానంగా ఇవ్వలేదు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు… లోకేశ్ తీరుపై ఎల్లో మీడియా అలిగిందని. చూద్దాం లోకేశ్ బయటపెట్టే ఆ కుంభకోణం జగన్ సర్కార్‌ను ఏ రేంజ్లో షేక్ చేస్తుందో?