విజయం కోసం వ్యూహం రచించని వాడు చాతకాని కింద లెక్క. గుడ్డి ఎద్దు చేలో పడినట్లు ముందుకు పోయి ఎవ్వరూ విజయం సాధించలేరు. లక్ష్మీపార్వతి భుజం మీద తుపాకి పెట్టి ఎన్టీఆర్ కొట్టి, అధికారం చేపట్టడానికి చంద్రబాబు దాదాపు ఏడాది కాలం పైగానే వేచి వున్నారు. వ్యూహాలు పన్నారు. చాణక్యుడు లేకుండా చంద్రగుప్తుడు వున్నాడా? విద్యారణ్యస్వామి లేకుండా విజయనగర సామ్రాజ్యం వుందా? అయితే కేవలం చాణక్యుడి తెలివి తేటలే సరిపోవు చంద్రగుప్తుడి శౌర్యం కూడా కావాలి.
అంతెందుకు ఆధునిక కార్పొరేట్ సంస్జలు తమ తమ ప్రమోషన్ల కోసం పనుల కోసం కన్సల్టెంట్లను నియమించుకోవా? అయినా తాము తింటే ఫలహారం, ఎదుటి వాడు తింటే చిరుతిండి అనడం మన తెలుగు మీడియాలో ఓ వర్గానికి బాగా అలవాటు అయిపోయింది.
మోడీ కోసం ఘనత వహించిన మన నాయకుడు గారు సినిమా జనాలను అందరినీ ప్లాన్డ్ గా గుజరాత్ పంపించి, వారి చేత భజన చేయించినపుడు అస్సలు ఇబ్బందిగా తోచలేదు. తప్పు అనిపించలేదు. మోడీ తో మనకు పొసగినన్నాళ్లు ఆయన మీడియా మేనేజ్ మెంట్ కానీ, ఎన్నికల మేనేజ్ మెంట్ కానీ తప్పు అనిపించలేదు.
ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఆంధ్రను తగులబెట్టేసాడు. జగన్ ను గెలిపించడం ద్వారా కులాల కుంపట్లు రగిల్చాడు. ఫ్రీ స్కీములతో ఆర్థిక వ్యవస్థను పాడు చేసాడు. కానీ పాపం, ప్రశాంత్ కిషోర్ రాక ముందు ఆంధ్ర జనాలకు కులాలు అంటే ఏమిటో తెలియదు. దక్షిణ కోస్తాలో ఓ బలమైన సామాజిక వర్గం దళితులపై దాడులు చేయడం అంటే ఏమిటో తెలియదు. విజయవాడలో ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బలమైన నాయకుడిని హత్య చేయించడం తెలియదు. అంతకన్నా ముందే అతని సోదరుడిని హత్య చేయించిన వైనం తెలియదు.
ఎన్టీఆర్ అనే మహా నాయకుడు ఉద్భవించి ఒక్క కుటుంబం మాత్రమే వున్న కులానికి ఇచ్ఛాపురం, చీపురుపల్లి లాంటి చోట్ల ఎమ్మెల్యే టికెట్ లు ఇవ్వడం తెలియదు. అంత వరకు లేని బిసి కార్డు వాడి గెలవడం తెలియదు. కేవలం ప్రశాంత్ కిషోర్ నే తెలుగు జనాలకు కులం అన్నది అలవాటు చేసాడు. అంతే కాదు ఫ్రీ స్కీములు కూడా అలవాటు చేసింది ప్రశాంత్ కిషోర్ నే.
నాలుగు రూపాయలకు కిలో బియ్యం అమ్ముతుంటే ఎన్టీఆర్ చేత రెండు రూపాయలకు అమ్మించింది ఆయనే. 70 రూపాయల భోజనం బిల్లు చెల్లించి, జనాలకు అయిదు రూపాయలకు ఇవ్వమన్నది ప్రశాంత్ కిషోర్ నే. అక్కాచెల్లెళ్లకు పసుపు కుంకుమ అంటూ పదేసి వేలు వేయమన్నదీ పికె నే. అంతెందుకు మీడియాను భయభ్రాంతులకు గురిచేయడానికి పింగళి దశరథరామ్ ను మర్డర్ చేయమని సలహా ఇచ్చింది, సోషల్ మీడియా జనాలు అరెస్టు చేసి అమరావతికి ఈడ్చుకు రమ్మని చెప్పింది కూడా పికె నే.
గురివింద గింజ తన నలుపు ఎరగదు అన్నట్లు వుంది తెలుగునాట ఓ సెక్షన్ ఆఫ్ మీడియా వ్యవహారం. సరే పికె ను పెట్టుకోవడం తప్ప, రాజకీయాల స్వరూపం మార్చేయడం తప్పు అనుకుందాం. పత్రికలు ఏవిధంగా అమ్ముతారు.జనం నమ్మకం చూరగలిగే వార్తలు, వ్యాసాలు అందించడం ద్వారా. కానీ కొన్నేళ్ల క్రితం ఆంధ్రజ్యోతి ఏం చేసింది? తన సర్క్యులేషన్ పెంచుకోవడం కోసం లాటరీ స్కీము ప్రవేశ పెట్టింది.
పేపర్లలో కూపన్లు వుంటాయి. వాటిని సేకరించి పంపాలి. అప్పుడు లాటరీ తీస్తారు. కారు, ఫ్రిజ్ ఇలా అనేక బహుమతులు ఇస్తారు. అంటే మంచి వార్తలు అందించడం ద్వారా కాకుండా, కేవలం బహుమతులు ఆశచూపి సర్క్యులేషన్ పెంచుకున్నారు. మరి దీన్నేమంటారు? పాత్రికేయ వ్యవస్థను చెడగొట్టడం కాదా?
పికె కులాలను రెచ్చగొట్టి జగన్ గెలుపు కోసం వ్యూహాలు రచించారు అంటున్నారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? ఎక్కడ ఏ విధంగా ఏం జరిగినా దాని కులం బయటకు లాగి వార్తలు వండడం లేదా? రఘురామరాజు కోసం నార్త్ లోనే రాజ్ పుత్ లంతా ఏకం అవుతున్నారని, రాష్ట్రంలోని క్షత్రియులంతా కోపంగా వున్నారనీ రాస్తున్నది ఎవరు? వీలయిన ప్రతి సంఘటనలో దళత కార్డును బయటకు లాగుతున్నది ఎవరు?
చిట్ ఫండ్ వ్యాపారం కట్టడి చేస్తే మీడియాపై దాడి, పవర్ ప్లాంట్ వ్యవహారాలు బయటకు తీస్తే మీడియాపై దాడి, ఆసుపత్రి తప్పులు బయటకు లాగితే ఓ సామాజిక వర్గంపై దాడి, విశాఖలో భూ ఆక్రమణలు అన్నీ బయటకు లాగుతుంటే కూల్చడం తప్ప అభివృద్ది లేదని గగ్గోలు, అంటే అసలు ఏమిటి ఈ మీడియా ఉద్దేశం? విశాఖలో ఆక్రమణలు పట్టించుకోకూడదు. అక్రమ నిర్మాణాలు కూల్చకూడదు. ఎప్పుడో పావలా, అర్థకు లీజుకు తీసుకుని,ఖాళీ చేయకుండా, ఇంకా అదనంగా స్థలం ఆక్రమించినా ఏమీ పట్టించుకోకూడదు. అంతే కదా?
చంద్రబాబు అధికారం మాత్రమే కోల్పోయారు. కానీ ఆయనను నమ్ముకున్నవారు కోట్ల ఆదాయం ఏటా కోల్పోయారు. అందువల్ల చంద్రబాబు అధికారంలోకి రావడం అన్నది ఆయనకన్నా వీరికే కీలకంగా వుంది.అందుకే చంద్రబాబు చేసే యాగీ కన్నా వీరి బాధ అమితంగా వుంది. పచ్చిగా చెప్పాలంటే ఆ యాగీ, రచ్చగా మారి ఆఖరికి ఏడుపుగా మారుతోంది.