ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖపట్నం నుంచి పరిపాలనపై అధికార పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని జగన్ సర్కార్ మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అమరావతిలో శాసన, విశాఖలో పరిపాలన, కర్నూల్‌లో న్యాయ రాజధానులను ఏర్పాటు చేస్తూ చట్టాలను కూడా చేశారు.
అయితే మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో అనుకున్న ప్రకారం విశాఖ నుంచి పరిపాలన సాగించ డానికి వీలు కాలేదు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ విశాఖ నుంచి పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎక్కడ నుంచైనా పాలన చేయొచ్చని తేల్చి చెప్పారు. ఇందులో భాగంగా త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగిస్తారని ఆయన ప్రభుత్వ ఉద్దేశాన్ని చెప్పారు.
అయితే మూడు రాజధానుల వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున, విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎప్పుడొస్తుందనే విషయమై డేట్ అడగొద్దని సూచించారు. కానీ ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖకు తప్పకుండా వస్తుందని ఆయన మనసులో మాట చెప్పారు. దీంతో చట్టంలోని వెసులుబాటును అనుకూలంగా చేసుకుని విశాఖ నుంచి సీఎం జగన్ పాలన సాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని విజయసాయిరెడ్డి మాటలను బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
ఎందుకంటే ఫలాన చోటు నుంచే పాలన సాగించాలని కోర్టులు ఆదేశాలు ఇవ్వలేవు. ఎక్కడ నుంచి, ఎలా పాలన సాగించాలనేది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ ఆలోచనపై ఆధారపడి ఉంటుంది.