ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు శానిటైజర్ కామన్ అయిపోయింది. ఎవరికి వారు చిన్న శానిటైజర్ బాటిల్ మెయింటైన్ చేస్తున్న రోజులివి. అయితే ఈ క్రమంలో కొందరు మాత్రమే కాస్త జాగ్రత్తగా ఉంటున్నారు. మరికొందరు మాత్రం ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ ప్రమాదం అమెరికాలో జరిగింది. శానిటైజర్ రాసుకొని సిగరెట్ వెలిగించాడు.. కారు మొత్తం భగ్గుమని మండిపోయింది.
అమెరికాలోని మోరీలాండ్ లో అదొక ఓపెన్ పార్కింగ్. డ్రైవర్ అప్పుడే కారులోకి ఎక్కాడు. ఎప్పుడు కారులోకి ఎక్కినా చేతులకు శానిటైజర్ రాసుకోవడం అలవాటు. ఈసారి కూడా అదే పని చేశాడు. ఆ వెంటనే నోట్లో సిగరెట్ పెట్టుకున్నాడు. లైటర్ వెలిగించాడు. అంతే, శానిశైటర్ ఎఫెక్ట్ తో ఒక్కసారిగా కారు మొత్తం మంటలు వ్యాపించాయి.
వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 15 నిమిషాల వ్యవథిలో మంటల్ని ఆర్పేశాయి. అయితే అప్పటికే కారు మొత్తం కాలిపోయింది. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే అతడి 2 చేతులు తీవ్రంగా కాలిపోయాయి.
ఓపెన్ పార్కింగ్ లో ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ప్రమాదం కారుతోనే ఆగిపోయింది. అదే సెల్లార్ పార్కింగ్ లో ఇలాంటి అగ్నిప్రమాదం జరిగితే ప్రమాదం మరింత తీవ్రంగా ఉండేది. ఈ దృశ్యాల్ని యూఎస్ అగ్నిమాపక సిబ్బంది విడుదల చేసింది.
ఎండలో కారు పార్కింగ్ చేసినప్పుడు లోపల శానిటైజర్లు పెట్టకూడదంటూ ఇప్పటికే యూఎస్ ఫైర్ డిపార్ట్ మెంట్ ప్రజలకు సూచన చేసింది. అయినప్పటికీ దేశంలో అడపాదడపా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.