పూరి జగన్నాథ్… ఈ పేరు ఒకప్పుడు బ్లాక్‌బస్టర్స్‌కి పర్యాయపదంలా వుండేది. కానీ ఇప్పుడు పరాజయాలకి పర్మనెంట్ అడ్రస్‌లా మారింది. మారుతున్న ట్రెండ్‌కి తగ్గట్టు అప్డేట్ అవకుండా, అవే మూస ధోరణులని ఫాలో అవడమే పూరి ఫెయిల్యూర్స్‌కి ప్రధాన కారణమని చెప్పాలి. ఇడియట్, పోకిరి మైండ్‌సెట్ నుంచి బయటకి రాలేక, అంతకుమించి ఆలోచించలేక ఫెయిలవుతున్నాడు పూరి.
మెహబూబా చిత్రంలో ఏదో ట్రై చేసాడు కానీ మనసు పెట్టి కథ రాసుకోలేదు. ఎప్పటిలా లైన్ అనుకుని దానికి సీన్లు వేసేసుకుని సినిమా తీసేసాడు. ఫలితంగా తన డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు కొడుకుని కూడా విజయంతో పరిచయం చేయలేకపోయాడు. ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో వున్న పూరి తిరిగి ఫామ్‌లోకి రావడానికి తన బ్యానర్లోనే రామ్ హీరోగా సినిమా అనౌన్స్ చేసాడు.
'ఇస్మార్ట్ శంకర్' అంటూ తనదైన శైలిలో ఒక పేరు ఖాయం చేసాడు. అయితే రామ్ వేషధారణ, అతని డైలాగ్ డెలివరీ, డబుల్ సిమ్‌కార్డ్ అంటూ 'డబుల్ ధిమాక్' వున్నోడిగా చేసిన పరిచయం ఆసక్తి రేకెత్తించలేదు. ఇది కూడా పూరీ మార్కు 'లోఫర్', 'ఇజం' తరహానే అనే ఫీలింగ్ తెచ్చేసాడు.
మరి పూరీ స్టయిల్ హీరోకి ఏదైనా కొత్తదనం జోడించి ఇప్పటి ప్రేక్షకులని 'ఇస్మార్ట్'గా మెప్పిస్తాడో లేక యథావిధిగా పోకిరి పండుగాడికి కొత్త పేరు తగిలించాడో తెలీదు.