ఒకప్పట్లా సినిమా నిడివిని పట్టించుకోవడం లేదు మేకర్స్. గతంలో మూవీ రెండున్నర గంటలు దాటితే వామ్మో అనేవారు. ఇప్పుడు మరో 15-20 నిమిషాలు అదనంగా ఉన్నప్పటికీ ఏం కాదనే ధీమాతో ఉంటున్నారు. ఇప్పుడు ఇదే ధీమా అరవింద సమేత యూనిట్ లో కూడా కనిపిస్తోంది.
అవును.. అరవింద సమేత కూడా డ్యూరేషన్ పరంగా పెద్ద సినిమానే. సెన్సార్ సర్టిఫికేట్ లో దీని నిడివి 167 నిమిషాలుంది. ఒక 5 నిమిషాలు రాహుల్ ద్రవిడ్ యాడ్స్ తీసేసినా 162 నిమిషాలు పక్కా. అంటే సినిమా 2 గంటల 42 నిమిషాలన్నమాట. ఈ రన్ టైం కాస్త ఎక్కువే.
ఈమధ్య కాలంలో కాస్త ఎక్కువ రన్ టైమ్ తో వచ్చిన రంగస్థలం, అర్జున్ రెడ్డి, భరత్ అనే నేను, మహానటి లాంటి సినిమాలన్నీ హిట్ అయ్యాయి. అదే కోవలో అరవింద కూడా హిట్ అవుతుందనే నమ్మకం మేకర్స్ లో కనిపిస్తోంది. పైగా ఫలానా పోర్షన్ కట్ చేస్తే బాగుంటుందేమో, ఇక్కడ ఈ సీన్ ఎందుకు లాంటి సలహాలు కూడా త్రివిక్రమ్ వద్దకు రాలేదు. అందుకే కాస్త ఎక్కువగానే రన్ టైం లాక్ చేశారు.
మేకర్స్ నమ్మకానికి మరో కారణం ఎమోషనల్ కంటెంట్. సినిమా సెకెండాఫ్ లో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉంది. అది కచ్చితంగా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. రంగస్థలం, మహానటి లాంటి సినిమాల్లో ప్లస్ అయింది కూడా అలాంటి ఎమోషనే కాబట్టి, దాన్ని కట్ చేయడం ఇష్టంలేక పెరిగిన నిడివిని అలానే ఉంచేశారట.
సో.. డ్యూరేషన్ పెరగడం వల్ల అరవింద సమేత కూడా పైన చెప్పుకున్న సినిమాల్లా హిట్ అవుతుందేమో చూడాలి.