కర్ణాటక రాజకీయ నేతలు అందునా అక్కడి కమలం పార్టీ నేతలు సెక్స్ స్కాండల్స్ లో చిక్కుకోవడం, అవి సంచనాలు రేపడం, మొదట్లో ఆ పార్టీ తమ వారిపై చర్యలు తీసుకుంటున్నట్టుగా ప్రకటించడం ఆ తర్వాత అంతా రాజీ కావడం కొత్త ఏమీ కాదు.
తాజాగా అక్కడ సెక్స్ వీడియో స్కాండల్ లో చిక్కుకున్న రమేష్ జార్కిహొలి వ్యవహారం కూడా అలాంటి మలుపే తిరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సెక్స్ స్కాండల్ కు సంబంధించిన వీడియోను బయటపెట్టి, దీనిపై పోలిస్ కంప్లైంట్ కూడా ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు రూటు మార్చాడట. దీనిపై తన కంప్లైంట్ ను అతడు వాపస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఈ వ్యవహారాన్ని బయటపెట్టింది ఒక సామాజిక కార్యకర్త. తన వద్దకు పని మీద వచ్చిన ఒక యువతిని మంత్రిగారు ఇలా వాడుకున్నారనేది ఫిర్యాదు సారాంశం. ఆ వీడియోలో కనిపించిన యువతి ఆ తర్వాత మీడియాకు దొరకలేదు.
ఈ రచ్చ జరగడంలో, అవతల నాలుగు రాష్ట్రాల ఎన్నికల జరుగుతుండటంతో కమలం పార్టీ వెంటనే రమేష్ జర్కిహొలి చేత మంత్రి పదవికి రాజీనామా చేయించింది.
ఇక వీడియోను బయట పెట్టిన వ్యక్తే ఇప్పుడు కంప్లైంట్ వెనక్కు తీసుకోవడంతో.. డీల్ సెట్ అయ్యిందనే ప్రచారం జరుగుతూ ఉంది. జర్కిహొలితో బెదిరించో, బతిమాలో ఈ కంప్లైంట్ వెనక్కు తీసుకునేలా చేశాడని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపిస్తున్నారు.
ఇక ఈ ఫిర్యాదు వెనక్కు వెళ్లిపోతే జార్కిహొలి మళ్లీ మంత్రి పదవిని తీసుకోవడానికి అర్హత పొందవచ్చు! ఎలాగూ యడియూరప్ప మంత్రి వర్గ విస్తరణ వ్యవహారం ఇలానే పెండింగ్ లో ఉంది. ఇది వరకూ అసెంబ్లీలో బ్లూ ఫిల్మ్ లు చూసిన నేతలను కూడా ఆ తర్వాత కమలం పార్టీ క్షమించింది.
ప్రస్తుతం ఆ నేతలు యడియూరప్ప కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు. ఈ లెక్కన జార్కిహొలి కూడా మళ్లీ మంత్రి కావొచ్చు! బీజేపీ కి జై కొడుతుంటే చాలు.. అన్నీ రైటే అనే ట్రెండ్ ఉంది కదా దేశంలో!