నల్ల దొంగలు: పనామా టు బహమాస్‌

మొన్న పనామా పేపర్స్‌.. ఇప్పుడు బహమాస్‌ లీక్‌.. ఏదైతేనేం, అక్కడ మేటర్‌ ఒకటే. నల్ల కుబేరుల వ్యవహారం గురించిన చర్చ ఈనాటిది కాదు. అందరూ ఆ రాజకీయ దొంగలే.. అనుకోవాలేమో.! యూపీఏ హయాంలో అవినీతికి…

మొన్న పనామా పేపర్స్‌.. ఇప్పుడు బహమాస్‌ లీక్‌.. ఏదైతేనేం, అక్కడ మేటర్‌ ఒకటే. నల్ల కుబేరుల వ్యవహారం గురించిన చర్చ ఈనాటిది కాదు. అందరూ ఆ రాజకీయ దొంగలే.. అనుకోవాలేమో.! యూపీఏ హయాంలో అవినీతికి వ్యతిరేకంగా 'ఆరాటం' ప్రదర్శించింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడేమో బీజేపీకి వ్యతిరేకంగా అదే ఆరాటం ప్రదర్శిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. ఎవరైనా చెప్పేది ఒకటే మాట, 'మేం అధికారంలోకి వస్తే నల్ల దొంగల భరతం పడతాం' అని. 

పాడిందే పాటరా.. పాచి పళ్ళ డాష్‌ డాష్‌ డాష్‌.. అన్నట్లు, బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాల్లోనూ అవినీతి గురించిన డైలాగ్స్‌ విన్పిస్తున్నాయి.. ఇప్పుడూ విన్పిస్తున్నాయి. అవినీతి పరులు సమాజానికి చీడపురుగులు.. అన్న మాట దశాబ్దాలుగా వింటూనే వున్నాం. కానీ, ఆ చీడ పురుగులు తగ్గలేదు సరికదా, పెరుగుతూనే వున్నాయి. ఏం చేస్తాం.? రాజకీయాలు అలా తగలడ్డాయ్‌. ఏం చెయ్యలేం, 'నిట్టూర్చి' ఊరుకోవాల్సిందే. 

ఇదిగో, ఇప్పుడు బహమాస్‌ లీక్‌ పేరుతో నల్ల దొంగల వివరాలు వెల్లడయ్యాయి. బాబోయ్‌, వీళ్ళని దొంగలు.. అనకూడదండోయ్‌. ఎందుకంటే, వెల్లడయిన పేర్లకు సంబంధించి ఆధారాలు కావాలి. కోర్టుల్లో కేసులు పడాలి, దోషులుగా తేలాలి. అప్పుడైనా సరే, వీళ్ళని దొంగలు.. అని అనకూడదు. ఎందుకంటే, వీళ్ళంతా బడా బాబులు. పారిశ్రామికవేత్తలు. రాజకీయ ప్రముఖులు. 

బహమాస్‌ లీక్‌ విషయానికొస్తే, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ వ్యాపారవేత్తలుగా చెలామణీ అవుతున్న నిమ్మగడ్డ ప్రసాద్‌, నిమ్మగడ్డ ప్రకాష్‌ పేర్లు వెల్లడయ్యాయి. లిస్ట్‌లో ఇంకా చాలామంది 'పెద్దల' పేర్లున్నాయనుకోండి.. అది వేరే విషయం. అయితే, ఈ లిస్టుల్ని పట్టుకుని ప్రభుత్వాలు ఆయా వ్యక్తులపై చర్యలు తీసుకునే అవకాశాలు దాదాపు శూన్యం. పనామా పేపర్స్‌ విషయంలోనూ ఇదే జరిగింది. 'ఆ లిస్ట్‌లో నా పేరా.? నాన్సెన్స్‌..' అంటూ అప్పట్లో కొందరు 'నల్లదొంగలు' బుకాయించిన విషయం విదితమే. ఇప్పుడూ అదే జరగబోతోంది. ఎనీ డౌట్స్‌.?