చిరు, పూరి.. ‘ఆటోజానీ’లో నిజమెంత.?

చిరంజీవి హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘ఆటోజానీ’ సినిమా ఆగస్ట్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటుందన్న రూమర్‌ ఒకటి టాలీవుడ్‌ సర్కిల్స్‌లో చాలా జోరుగా విన్పిస్తోంది. అసలంటూ చిరంజీవి సినిమాల్లో రీ`ఎంట్రీకి సిద్ధంగా వున్నారా?…

చిరంజీవి హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘ఆటోజానీ’ సినిమా ఆగస్ట్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటుందన్న రూమర్‌ ఒకటి టాలీవుడ్‌ సర్కిల్స్‌లో చాలా జోరుగా విన్పిస్తోంది. అసలంటూ చిరంజీవి సినిమాల్లో రీ`ఎంట్రీకి సిద్ధంగా వున్నారా? లేదా? అన్నదానిపైనే స్పష్టత లేదు. ‘ఇదిగో చేస్తున్నా.. అదిగో చేస్తున్నా..’ అని చిరంజీవి చెప్పడం తప్ప, సీరియస్‌గా ఆయన సినిమా గురించి ఆలోచించడంలేదనే చెప్పాలి.

చిరంజీవి ‘సై’ అనాలేగానీ, రేస్‌లో వినాయక్‌ మిగతా వారందరికన్నా ముందే వుంటాడు.. చిరంజీవిని డైరెక్ట్‌ చేయడానికి. చిరు తనయుడు చరణ్‌ ఎలాగూ తన తండ్రి సినిమాకి నిర్మాతనని గతంలోనే ప్రకటించేశాడు. రెండేళ్ళుగా ఈ వ్యవహారం ఇలా నానుతూనే వుంది. ఆ మాటకొస్తే, చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళింది మొదలు, సినిమాల్ని వదులుకోను.. సినిమాలు చేస్తూనే వుంటా.. అని చెబుతున్నారుగానీ, అప్పటినుంచీ ఇప్పటిదాకా చిరంజీవి నటించిన ఇంకో సినిమా రిలీజ్‌ కాలేదు.. కనీసం పట్టాలెక్కనూ లేదు.

తాజాగా విన్పిస్తోన్న గాసిప్స్‌లో నిజమెంత.? పూరి, చిరంజీవిని డైరెక్ట్‌ చేయడం నిజమేనా? ఆ సినిమా ‘ఆటోజానీ’యేనా.? ఇలా అనేక ప్రశ్నలు.. దేనికీ సమాధానం దొరకడంలేదు. గాసిప్స్‌ని ఎంజాయ్‌ చేసే స్టేజ్‌ని అభిమానులూ దాటేశారు, ఇకనైనా చిరంజీవి సస్పెన్స్‌కి తెరదించితే మంచిదేమో.!