క్రికెట్ ప్రపంపచకప్ ఫైనల్ లో తమ జట్టు ఆసీస్ చేతిలో ఓడిన బాధలో ఉన్న కివీ జనాలకు చిన్న ఊరట.. క్రికెట్ లో ఆసీస్ ధాటికి ప్రపంచకప్ కల చెదిరిన కివీస్ కు హాకీలో ఊరట లభించింది. సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్ ఫైనల్ లో న్యూజిలాండ్ జట్టు ఆసీస్ పై విజయం సాధించింది!
ఫైనల్ మ్యాచ్ షూటౌట్ లో న్యూజిలాండ్ 3- 1 గోల్స్ తేడాతో ఆసీస్ పై విజయం సాధించింది. తద్వారా క్రికెట్ లో ఎదురైన చేదు అనుభవానికి చిన్న ప్రతీకారం తీర్చుకొంది. హాకీలో విజయం క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ లో గెలుపు అంతటి స్థాయి ది కాకపోయినా.. న్యూజిలాండ్ లో హాకీకి కూడా మంచి ఆదరణ ఉండటంతో.. ఇది ఊరట అనుకోవాలి. ఇదే సమయంలో ఆసీస్ లో కూడా హాకీకి మంచి ఆదరణ ఉండటంతో.. వారికి ఈ ఓటమి గుర్తుంచుకోవాల్సినదే అవుతోంది.
న్యూజిలాండ్ , ఆస్ట్రేలియాలు వివిధ క్రీడల్లో చిరకాల ప్రత్యర్థుల గానే బరిలోకి దిగుతాయి. క్రికెట్ , రగ్బీ, హాకీ ఇలా.. అన్ని క్రీడల్లోనూ వీరి మధ్య పోటీ ఉంటుంది. క్రికెట్ లో ఆసీస్ ది పై చేయి అవుతుంటే.. రగ్బీలో న్యూజిలాండ్ ది వరసగా పై చేయి అవుతోంది. ఇప్పుడు హాకీలో కూడా కివీస్ ఆసీస్ కు షాక్ ఇచ్చారు.
అజ్లాన్ షా హాకీ టోర్నమెంటులో ఇండియాకు కూడా మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఈ టోర్నీలో ఇండియా మూడో స్థానంతో సరిపెట్టుకొంది. దక్షిణ కొరియాపై మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా ఇండియా క్రికెట్ ప్రపంచకప్ లో మాదిరే అంతో ఇంతో పరువు నిలుపుకొంది.