ముంబై ఇండియన్స్ గెలవలేదుగానీ, పంజాబ్ జట్టుపై ముంబై ఇండియన్స్ ఆటగాడు హర్భజన్‌సింగ్ చేసిన మెరుపు అర్థ సెంచరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. భారత క్రికెట్‌కి సంబంధించినంతవరకు అనిల్ కుంబ్లే తర్వాత ఆ స్థాయి స్పెషలిస్ట్ స్పిన్నర్ ఎవరంటే ఖచ్చితంగా హర్భజన్‌సింగేనని చెప్పొచ్చు. కానీ, కాలం కలిసి రాలేదీ స్పిన్నర్‌కి.
ఇటీవల జరిగిన వరల్డ్ కప్ పోటీలకి హర్భజన్‌సింగ్ దూరమయ్యాడు. జట్టులో చోటు దక్కకపోవడంతో నిరాశచెందాడు. ఆ కసిని ఇప్పుడిలా ఐపీఎల్‌లో చూపిస్తున్నాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్తున్నారు. ఇందులో అతిశయోక్తి ఏమీ కనిపించదు. మైదానంలో అగ్రెసివ్‌గా కనిపించే క్రికెటర్లలో హర్భజన్‌సింగ్ కూడా ఒకడు.
గత వరల్డ్ కప్‌లో హర్భజన్ సింగ్‌కి జట్టులో చోటు కల్పించి వుంటే ఎంతోకొంత ప్రయోజనం కన్పించి వుండేదే. కానీ, అనేక సమీకరణాల అనంతరం స్పిన్నర్‌గా అశ్విన్‌కి చోటు దక్కిందే తప్ప, హర్భజన్‌ని కెప్టెన్ ధోనీగానీ, సెలక్టర్లుగానీ పరిగణనలోకి తీసుకోలేదు. గతం గతః అనుకుంటూ మళ్ళీ టీమిండియాలో చోటు కోసం హర్భజన్‌సింగ్ కసితీరా తన సత్తాను ఐపీఎల్‌లో చాటుకుంటున్నాడు.
రెండు వికెట్లతోపాటు, 24 బంతుల్లో 5 బౌండరీలు, 6 భారీసిక్సర్లతో సత్తా చాటిన హర్భజన్‌సింగ్, టీమిండియాలో మళ్ళీ చోటు దక్కించుకుంటాడా.? వేచి చూడాల్సిందే.