రివ్యూ: జిల్
రేటింగ్: 3/5
బ్యానర్: యు.వి. క్రియేషన్స్
తారాగణం: గోపీచంద్, రాశి ఖన్నా, కబీర్, ఊర్వశి, పోసాని కృష్ణమురళి, అవసరాల శ్రీనివాస్, చలపతిరావు, ప్రభాస్ శ్రీను తదితరులు
సంగీతం: జిబ్రాన్
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: శక్తి శరవణన్
నిర్మాతలు: వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
కథ, కథనం, దర్శకత్వం: రాధాకృష్ణ కుమార్
విడుదల తేదీ: మార్చి 27, 2015
గోపీచంద్ అలా స్టయిలిష్‌గా బైక్ మీద వస్తున్న టీజర్ దగ్గర్నుంచి ‘జిల్’ సినిమాలో ‘స్టయిల్’ ఫ్యాక్టర్ హైలైట్ అవుతూ వచ్చింది. టైటిల్, కలర్‌ఫుల్ పోస్టర్స్ చూసి, ట్రెయిలర్లో గోపీచంద్ పంచ్ డైలాగ్స్ ఓవర్ లుక్ చేసి… ఇది పూర్తి స్థాయి క్లాస్ ఎంటర్టైనర్ అనుకుంటే పొరబడినట్టే. ‘జిల్’లో కావాల్సినంత యాక్షన్ ఉంది, మోతాదుకి మించి వయలెన్స్ ఉంది, గుప్పెడంత రొమాన్స్ ఉంది, చిటికెడు సెంటిమెంట్ ఉంది.. సినిమా మొత్తమ్మీద స్టయిలిష్ టేకింగ్‌తో కూడిన బలమైన స్టాంప్ కూడా ఉంది.
హ్యాపీగా సాగిపోతున్న హీరో లైఫ్‌లోకి ఒక విలన్ ఎంటర్ అయి అతడిని ఇబ్బంది పెడతాడు. హీరో దానికి ఎలా రియాక్ట్ అవుతాడు? ఏ విధంగా ఆ విలన్‌కి బుద్ధి చెప్తాడు? ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదే ‘జిల్’ కథ. చాలా చాలా చాలా థిన్ అండ్ రొటీన్ స్టోరీ లైన్. అయినప్పటికీ ‘జిల్’ని ఒకసారి చూడ్డానికి అంతగా కంప్లయింట్స్ ఏమీ ఉండవు. రెండుంపావు గంటల సినిమాలో బోర్ కొట్టించే క్షణాలు కూడా పెద్దగా లేవు. ఒక బకెట్ పాప్‌కార్న్ కొనుక్కుని హాల్లోకెళ్లి కూలబడిపోతే… కాలక్షేపానికి లోటుండదు.
కథని కాస్త వివరంగా చెప్పుకుంటే.. జై (గోపీచంద్) ఒక ఫైర్ ఆఫీసర్. ఒక ప్రమాదం నుంచి తనే కాపాడిన సావిత్రిపై (రాశి ఖన్నా) మనసు పారేసుకుంటాడు. ఇద్దరి లవ్‌స్టోరీ ఓ పక్క నడుస్తుండగా… ఒక రోజు ఓ అపరిచితుడికి (బ్రహ్మాజీ) సాయపడతాడు. అతని కోసం చోటా నాయక్ (కబీర్) అనే పచ్చి నెత్తురు తాగే డాన్ ఒకడు వెతుకుతుంటాడు. సదరు వ్యక్తి తన నుంచి వెయ్యి కోట్లు గోల్మాల్ చేయడమే కాకుండా తనని పోలీసులకి కూడా పట్టించాడని ఎలాగైనా అతడిని పట్టుకుని తన డబ్బు రాబట్టుకోవాలని నాయక్ ప్రయత్నిస్తుంటాడు. అయితే అతను ఓ ప్రమాదంలో చనిపోవడంతో… అతనికి సాయపడిన జైకి ఆ డబ్బులు ఎక్కడున్నాయో తెలుసుననుకుని ఇతడిని టార్గెట్ చేస్తాడు నాయక్. ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ స్టార్ట్ అవుతుంది.
ఎంతటి వాడినైనా ఒక్క గుద్దుకి పడగొట్టేసే బలమున్న హీరో, తనకి కావాల్సిన దానికోసం నిర్దాక్షిణ్యంగా ఎంత మందిని అయినా చంపేసే గుణమున్న విలన్… యాక్షన్ సీన్లకి కావాల్సిన సెటప్ ఓ పక్క కుదిరేసింది. మరోవైపు హీరోకో చిన్న హ్యాపీ ఫ్యామిలీ, ఒక జాలీ ఫ్రెండ్స్ బ్యాచ్, హీరోయిన్‌తో క్యూట్ రొమాన్స్. ఈ రెండిటినీ దర్శకుడు బ్యాలెన్స్ చేసుకుంటూ కమర్షియల్ స్క్రీన్‌ప్లే రాసేసుకున్నాడు. తర్వాతేం జరుగుతుందనే ఉత్కంఠ లేని, ఒక అయిదు నిముషాలు మిస్ అయితే ఫ్లో తెలీకుండా పోతుందనే భయం అక్కర్లేని పక్కా ఫార్ములా సినిమా ఇది. అయితే చూస్తున్నంత సేపు విసిగించకుండా, వినోదాన్ని పండిస్తూ… కాలక్షేపానికి బాగానే పనికొస్తుంది.
కొత్త దర్శకుడి సినిమా అంటే కథావస్తువు నుంచి ట్రీట్మెంట్ వరకు అన్నీ కొత్తగా ఉంటాయని ఆశిస్తే అలాంటివేమీ జిల్లో ఉండవు. ఇదే బ్యానర్ నుంచి వచ్చిన ‘రన్ రాజా రన్’లోని ఫ్రెష్‌నెస్ ఇందులో లేదు. కానీ గోపీచంద్‌ని కొత్త కోణంలో చూపిస్తూ, అతడు రెగ్యులర్ చేసే పనినే కాస్త స్టయిలిష్‌గా చేయించి… ఒక మాస్ సినిమాకి క్లాస్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అదే జిల్కి ప్రత్యేకత ఆపాదించి.. క్యాజువల్ మాస్ సినిమాల మధ్య ఫార్మల్ డ్రస్సేసి నిలబెట్టింది. ఈ రకం ట్రీట్మెంట్ వల్ల గోపీచంద్‌ని ఇష్టపడే మాస్ ప్రేక్షకులు కొంచెం హర్ట్ అవ్వవచ్చు.
గోపీచంద్ లుక్ గురించి ఇప్పటికే చాలా చెప్పుకున్నాం. పర్ఫార్మెన్స్ పరంగా ఎక్కడా ఓవర్ ప్లే చేయకుండా ఆకట్టుకున్నాడు. తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి చేసిన ఈ కొత్త ఎటెంప్ట్‌లో గోపీచంద్ ఫుల్ మార్క్స్ స్కోర్ చేసాడు. రాశి ఖన్నా అటు గ్లామర్ విందిస్తూనే… ఇటు నటనలో కూడా రాణించి స్టార్ మెటీరియల్ అనిపించుకుంది. క్యూట్ క్యారెక్టరైజేషన్ వల్ల రాశి ఉన్న సీన్స్ అన్నీ బాగా పండాయి. విలన్‌గా నటించిన కబీర్ అసలు నటించాల్సిన అవసరమే లేదు.. జస్ట్ అలా కనిపిస్తేనే చాలు, జనం హడలిపోయేలా ఉన్నాడు. ఊర్వశి, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను బాగానే ఎంటర్టైన్ చేసారు. అవసరాల శ్రీనివాస్, చలపతిరావు తదితరులు తమ పాత్రలకి న్యాయం చేసారు.
తెరవెనుక కూడా కొత్త దర్శకుడికి ఫుల్ సపోర్ట్ ఇచ్చే క్రూ కుదిరింది. జిబ్రాన్ మ్యూజిక్ రొటీన్ పాటలకి భిన్నంగా కొత్తగా ఉంది. స్వింగ్ స్వింగ్, మసాలా పోరీ పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. తెలుగు సినిమాల్లో ఫైట్ల గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదన్నట్టు ఈమధ్య ఫైట్లు చిత్రీకరిస్తున్నారు. కానీ ఇందులో ఫైట్లు మాత్రం తప్పక మెప్పిస్తాయి. రెయిన్ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్ చాలా బాగా తెరకెక్కించారు.
సినిమాటోగ్రాఫర్ శక్తి శరవణన్ వర్క్ రియల్లీ సూపర్బ్. ఈ సినిమా ఇంత స్టయిలిష్‌గా రూపొందడంలో అతనిదే కీ రోల్. ఎడిటింగ్ పరంగా కూడా ఇబ్బందులేం లేవు. వేగవంతమైన గమనం ఈ రొటీన్ సినిమాకి అదనపు బలమైంది. దర్శకుడు రాధాకృష్ణకి కమర్షియల్ పల్స్ బాగానే తెలుసు. అలాగే తన టీమ్ నుంచి అవుట్‌పుట్ రాబట్టుకోవడంలోను ఘనుడేనని ఈ చిత్రం తెలియజెపుతుంది. యాక్షన్ సీన్స్ తీసే విధానంలో రాజమౌళి ఛాయలు కనిపించాయి. అలాగే సెన్సాఫ్ హ్యూమర్ బాగుంది, నేటి తరం ప్రేక్షకులు మెచ్చే ఆలోచనలు (రాశి, గోపి ట్రాక్) కూడా ఉన్నాయి. యు.వి. క్రియేషన్స్ బ్యానర్నుంచి కొరటాల శివ, సుజిత్ తర్వాత మరో ప్రామిసింగ్ డైరెక్టర్ వచ్చినట్టే. ఇకపై ఎలాంటి సినిమాలు తీస్తాడనే దానిపై రాధాకృష్ణ అధిరోహించే ఎత్తులు డిపెండ్ అవుతాయి.
కొత్తగా లేకపోయినా, ఎన్నోసార్లు చూసినట్టు అనిపించినా కొన్ని సినిమాలు నిరాశ పరచవు. మూస సినిమా అనే ఫీల్ కలిగించవు. అలా జరిగిందీ అంటే స్క్రీన్‌ప్లే పకడ్బందీగా కుదిరింది, ట్రీట్మెంట్ పరంగా ఫ్రెష్‌నెస్ ఉంది అని అర్థం. అయితే హీరో, విలన్ ఇద్దరినీ అంత పవర్‌ఫుల్‌గా చూపించి… చివరి ఘట్టానికి వచ్చేసరికి వాళ్లిద్దరి చివరి క్లాష్‌ని మాత్రం అంత ఎఫెక్టివ్‌గా చూపించకపోవడంతో క్లయిమాక్స్ తేలిపోయింది. అంత బిల్డప్ ఇచ్చినప్పుడు దానికి తగ్గ పే ఆఫ్ కూడా ఉండాలి. లోపాలున్నప్పటికీ జిల్ ఒక్కసారి ఖచ్చితంగా చూడబుల్ అనే దాంట్లో డౌట్స్ ఏమీ అక్కర్లేదు.
బోటమ్ లైన్: జిల్.. జిగేల్!
– గణేష్ రావూరి