Advertisement

Advertisement


Home > Articles - Chanakya

ఇది జగన్ స్వయంకృతాపరాధం

ఇది జగన్ స్వయంకృతాపరాధం

కొణతాల రామకృష్ణ. సౌమ్యుడు..నిజాయతీ పరుడు..నమ్మకస్తుడు...రాజకీయాల్లో ఎవరిని అడిగినా ఇదే విషయం చెబుతారు. అందులో సందేహం లేదు. వైఎస్ మరణం తరువాత ఎవరు ఎందుకు జగన్ ను వదిలేసినా, ఎవరు ఎందుకు జగన్ ను పట్టుకు వేలాడినా కొణతాల మాత్రం కేవలం విశ్వాసంతోనే జగన్ వెంట నడిచారు. అది ఆయన నియోజకవర్గంలో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అలాంటి వ్యక్తిని కూడా జగన్ దూరం చేసుకున్నాడంటే రాజకీయాలు తెలియకపోయినా వుండాలి. లేదా..ఎవ్వరి కోసం ఎవరున్నారు పొండిరా పొండి..అనేంత అహంకారమైనా అయి వుండాలి. జగన్ కు రాష్ట్ర వ్యాప్తంగా సలహాలు ఇచ్చేవాళ్లు వుంటే వుండొచ్చు కానీ ప్రాంతీయంగా సరైన వాళ్లు లేరు. అప్పటికి, ఆ అవసరానికి ఎవరో ఒకర్ని పట్టుకోవడం వారు, దెబ్బ తీయడం, వెంటనే మరొకర్ని చూసుకోవడం అన్నదే జగన్ స్ట్రాటజీగా వుంది. 

ఓదార్పు యాత్రలు ప్రారంభించిన కొత్తలో అప్పటి ఎంపీ హరిని నమ్ముకున్నాడు. ప్రారంభంలో జగన్ భారీగా డబ్బులు ఖర్చు చేసేవాడు..హరి ఆ అవకాశాన్ని వాడుకున్నాడని అంటారు. కొణతాలకు, హరికి చుక్కెదురు. కొణతాల గతంలో ద్రోణంరాజు గ్రూప్. హరి వ్యతిరేక వర్గం. అది చిరకాల వైరం. అయినా కూడా కొణతాల జగన్ తోనే వున్నాడు. 

హైదరాబాద్ లో కూర్చుని జగన్ ఉత్తరాంధ్ర మొత్తానికి కంట్రోలు చేయలేరు. దానికి ఎవరో ఒకరు బాధ్యులు వుండాలి. వారిని నమ్మాలి. వారిని కంట్రోలు చేసుకోగలగాలి. కానీ ప్రారంభంలో ఇలా ఎవరికీ బాధ్యతలు ఇచ్చేది లేదని జగన్ భీష్మించుకు కూర్చున్నారు. తనదే పెత్తనం,.ఎవరైనా వారి వారి ప్రాంతల వరకే అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో జిల్లా అంతా చూసిన కొణతాలకు ఇది కాస్త ఇబ్బంది తెచ్చినా భరించారు.

 అలాంటి సమయంలో కొణతాల బద్ధ శతృవు దాడి వీరభద్రరావును తెచ్చి నెత్తిపై పెట్టారు. అప్పుడే అడిగితే,,జగన్ ఇదే చెప్పారు కొణతాలకు..మీరు మీ నియోజకవర్గం చూసుకోండి అని. పీకల వరకు అవమానమైన, రాజకీయ పరిస్థితులు, ఎన్నికల దృష్ట్యా కొణతాల భరించాడు. ఎన్నికలు గడిచాయి. ఇలా వచ్చిన దాడి అలా వెళ్లిపోయాడు. అప్పుడైనా జగన్ కు తెలిసిరావాలి,..ఎవరు తమ వారో..ఎవర్ని నమ్మాలో. కానీ అప్పుడు కూడా కొణతాలను పక్కన పెట్టి, చివరిదాకా అధికారం అనుభవించి, పార్టీలోకి వచ్చిన ధర్మాన ప్రసాదరావును నెత్తిన పెట్టుకున్నారు. ఉత్తరాంధ్ర బాధ్యతలు ఎవరికీ ఇచ్చేది లేదన్న జగన్ ఇప్పుడు అదే పని ధర్మానకు ఇచ్చారు. 

బాబును చూసి వాతలు

జగన్ కు స్వంత రాజకీయం లేదు. ఉత్తారాంధ్ర కులాల ఈక్వేషన్లు తెలియవు. మిగిలిన ప్రాంతాలు వేరు. ఉత్తరాంధ్ర వేరు. ఇక్కడ కాపులు, వెలమలతో పాటు గవర్లు అనే బలమైన కులం వుంది. అది విశాఖ జిల్లాకే పరిమితం కావచ్చు, కానీ ఆర్థికంగా చాలా బలమైన వర్గం, పైగా కులం కట్టు వున్న వర్గం. అలాగే శ్రీకాకుళంలో కాళింగులు. అచ్చంగా గవర్ల మాదిరిగా బలమైన వర్గం. ఎన్టీఆర్ పార్టీలో చేరి పగ్గాలు తీసుకున్న బాబు, మూడు జిల్లాల్లో కూడా వెలమలను దగ్గరకు తీసారు. అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి, తెంటు జయప్రకాష్, ఎర్రం నాయుడు..ఇలా. కాపు వర్గాన్ని కాస్త దూరం పెట్టారు. కళా వెంకట్రావు మినహా సరైన కాపు నేత లేరు. పైగా కళింగ, గవర వర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో శ్రీకాకుళంలో కళింగులు , విశాఖలో గవర్లు అసంతృప్తికి గురయ్యారు..అది వైఎస్ గెలిచిన రెండు ఎన్నికల్లో ప్రభావం చూపింది. 

ఇది గమనించిన బాబు ఈ ఎన్నికల దగ్గర కాస్త స్ట్రాటజీ మార్చారు. పైగా ఎర్రం నాయుడు లేకపోవడం కలిసి వచ్చింది. మూడు జిల్లాల్లో వుండే కాపుల్ని కూడా బాబు చేరదీసారు. ఇందుకు గంటా పార్టీలోకి రావడం కూడా కారణమైంది. దాంతో అప్పట్లోనే అయ్యన్న పాత్రుడు, బండారు అలిగారు. అయినా బాబు కాబట్టి మేనేజ్ చేయగలిగారు.

ఇప్పుడు జగన్ అదే బాటలో వెళుతున్నారు. బొబ్బిలి బేబి నాయన వర్గాన్ని దగ్గరకు తీసారు. వాళ్లకి పెత్తనమిచ్చారు. ఇంతలో వచ్చిన ధర్మానను నెత్తిన పెట్టుకున్నారు. దీంతో ఇప్పుడు మిగిలిన కులాలు జగన్ వైఖరిపై రగులుతున్నాయి. దాని పర్యవసానమే కొణతాల బయటకు వెళ్లడం. 

ఇదంతా నూటికి నూరు పాళ్లు జగన్ రాజకీయ అపరిపక్వతను తెలియచేస్తుంది. తెలియని తనాన్ని స్పష్టం చేస్తుంది. విజయమ్మ పోటీ చేసినపుడు వ్యవహారం అంతా స్వంతంగా నడిపించుకున్న జగన్, ఓటమికి మాత్రం కొణతాలను బాధ్యుడిని చేసారు. ఇప్పడు విశాఖ జిల్లాలో పార్టీ అనాధ అయింది. కొణతాల వెంట నర్సీపట్నం, అనకాపల్లి, యలమంచిలి, తదితర నియోజకవర్గ పార్టీ జనాలు అంతా వెళ్లిపోతారు. వాళ్లకు పార్టీలు ప్రధానం కాదు. కొణతాల ప్రధానం. 

వున్నదీ  పోయింది ఉంచుకున్నదీ పోయిందన్నట్లు, ఇటు దాడీ వెళ్లిపోయారు..అటు కొణతాల వెళ్లిపోయారు. ఇప్పుడు ధర్మాన వచ్చి చేస్తారా..బేబినాయన పని చేస్తారా? అన్నది జగన్ తేల్చుకోవాలి. 

నాయకుడు అన్నవాడు..నేరుగా అన్ని పనులు చేసుకోలేడు. మేనేజ్ మెంట్ అన్నది రావాలి. నలుగురిని ఒక తాటిపైకి తేకపోయినా, ఒక దగ్గరకి చేర్చగలగాలి. జెసి వర్గాన్ని, పరిటాల వర్గాన్ని ఓ దగ్గర చేర్చినట్లు, గంటాను-అయ్యన్నను కలిపినట్లు..జగన్ చేయడం అన్నది కలలో మాట. అలాంటపుడు ఇలాంటి వ్యవహారాలు జరుగుతూనే వుంటాయి....జగన్ మాత్రం సుయోధనుడిలా ఒక్కొక్కర్ని కోల్పోయి,..ఆఖరికి ఏ మడుగున దాగాల్సి వస్తుందో?

చాణక్య

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?