టాక్సిక్ మేనేజ‌ర్ ను త‌ట్టుకునేదెలా!

ఆఫీసంటే టాక్సిక్ మేనేజ‌రే కాకుండా, ఆస‌క్తిని క‌లిగించే అంశాలు కొన్ని అయినా క‌లిగి ఉండేలా ప‌రిస్థితుల‌ను మార్చుకుంటే కొంత రిలీఫ్ దొర‌క‌వ‌చ్చు.

ఉద్యోగ జీవితంలో ఏదో ఒక ద‌శ‌లో మేనేజ‌ర్ నుంచి ఒత్తిళ్ల‌ను ఎదుర్కొన‌ని వాళ్లంటూ ఉండ‌రు! ఉద్యోగం చేసిన అనుభ‌వం ఉన్న ఎవ‌రికైనా ఈ అనుభ‌వాలు ఉంటాయి. క‌దిలిస్తే ఒక్కోరు తాము మేనేజ‌ర్ లేదా మేనేజ‌ర్ల నుంచి ఎదుర్కొన్న ఒత్తిళ్ల గురించి వివ‌రించి చెబుతారు! ఇలాంటి క‌థ‌లు కోకొల్ల‌లుగా ఉంటాయి. ఒక్కోరివి ఒక్కో ర‌క‌మైన క‌ష్టాలు! అయితే ఉద్యోగం చేయ‌క మాత్రం త‌ప్ప‌దు. ఇలాంటి ప‌రిస్థితుల్లో.. తీవ్ర‌మైన ఒత్తిడికి గుర‌వుతూ కూడా ఉద్యోగాన్ని చేస్తూ మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను కోల్పోతూ ఉంటారు చాలా మంది. ఇలాంటి ప‌రిస్థితుల‌ను త‌ట్టుకోవ‌డం కూడా తేలికైన విష‌యం కాదు! మ‌రి అందుకు ఉన్న మార్గాలేమిటి అంటే నిపుణులు ప‌లు స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను ఇస్తారు. అవేమిటంటే..

ప‌ర్స‌న‌ల్ గా తీసుకోక‌పోవ‌డం!

ఇది స‌ల‌హా ఇచ్చినంత తేలిక కాదు కానీ, ఉద్యోగ జీవితంలో ప్ర‌త్యేకించి మేనేజ‌ర్ తో ఎదుర‌య్యే ప‌రిస్థితుల‌ను మ‌రీ ప‌ర్స‌న‌ల్ గా తీసుకోక‌పోవ‌డం ఉత్త‌మం. కాగితాల‌ను మొహాల మీద విసిరే మేనేజ‌ర్లు, త‌మ అహాన్ని చూపే మేనేజ‌ర్లు, త‌మ అథారిటీని అడ్డం పెట్టుకుని అహంకారాన్ని చూపే మేనేజ‌ర్ల‌కు కొద‌వ ఉండ‌దు! అయితే వారిలో చాలా మంది త‌మ హోదాను చూసుకుని మిడిసిప‌డేవాళ్లే! కాబ‌ట్టి.. అది వారి మాన‌సిక స్థితి అని అనుకొని వ‌దిలేయ‌డం ఉత్త‌మం! అతి దుర్మార్గంగా ప్ర‌వ‌ర్తించే అలాంటి వాళ్ల‌ను పిచ్చివాళ్ల కింద జ‌మ క‌ట్టి, వాళ్లంతే, వాళ్లు అలాగే ప్ర‌వ‌ర్తిస్తారు అని మీరు మీకు స‌మాధానం చెప్పుకుంటే.. చాలా ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. మీరు చేసిన ప‌నేదైనా త‌ప్పు ప‌ట్ట‌డ‌మే వారి ప‌ని అనుకుని ప్ర‌వ‌ర్తించే వారు, అలాగే ప్ర‌వ‌ర్తిస్తారు అనే ముంద‌స్తుగా ఫిక్స్ చేసుకుని వారి ముందుకు వెళితే.. ఎలాగూ అంచ‌నా వేసిందే జ‌రుగుతుంది కాబ‌ట్టి, లైట్ తీసుకోవ‌డ‌మే. వారి మాట‌ల‌ను, చేష్ట‌ల‌ను కూడా ప‌ర్స‌న‌ల్ గా తీసుకోకుండా, అది వారి పిచ్చిత‌నానికి ప‌రాకాష్ట‌గా భావించి ముందుకు వెళితే.. ఇక పెద్ద‌గా ఆలోచించేది ఏమీ ఉండ‌క‌పోవ‌చ్చు!

మీ గోల్స్ మీద ఫోక‌స్ చేసి ఉండ‌టం!

మేనేజ‌ర్ ఎలాంటి వాడ‌నేది మీకు స‌మ‌స్యే కాదు, గోల్స్ మీద ఫోక‌స్ తో ఉన్న‌ప్పుడు. మీరు ఉద్యోగం చేయ‌డానికి వెళ్లారు, త‌ద్వారా మీకు జీతం కావాలి, లేదా అనుభ‌వం సంపాదించాలి, దాన్ని ఉప‌యోగించుకుని ఇంకో హోదా కోసం ప్ర‌య‌త్నించాలి.. ఏడాది, రెండేళ్లు ఒక చోట ప‌ని చేయాల‌నే ల‌క్ష్యంతో ప‌ని చేసుకుంటే.. అప్పుడు మేనేజ‌ర్ ఎలాంటివాడ‌నేది మీ ప్రాధాన్య‌తే కాదు. మీ ప‌ని వ‌ర‌కూ మీరు అనిపించుకునే అవ‌కాశం ఇవ్వ‌కూడ‌దు, కావాల‌ని అడ్డ‌దిడ్డంగా ప్ర‌వర్తించే వాళ్ల‌తోనే క‌దా స‌మ‌స్య‌.. అలాంటి ప‌రిస్థితి వస్తే.. గోల్స్ మీద ఉన్న ఫోక‌స్ తో వారిని లైట్ తీసుకోవ‌చ్చు. మీ ల‌క్ష్యాన్ని చేరుకుంటున్న‌ప్పుడు .. మొహం మీదే రాజీనామా విష‌యాన్ని చెప్పి మీ దారి మీరు చూసుకోవ‌చ్చు!

సంస్థ‌ను న‌మ్మ‌డం!

కొన్ని కొన్ని సార్లు ఆర్గ‌నైజేష‌న్ తో ఉద్యోగికి మంచి అనుబంధం ఉండ‌ట‌మో, లేదా ప‌ని చేస్తున్న ఆ సంస్థ‌లో కొన‌సాగాల‌నే ఆస‌క్తి ఉండ‌ట‌మో జ‌రుగుతూ.. మేనేజ‌ర్ ప్ర‌వ‌ర్త‌న మాత్రం అస్స‌లు న‌చ్చ‌ని ప‌రిస్థితులు కూడా ఉంటాయి! అయితే ఇలాంటి సంద‌ర్భాల్లో.. మీరు వెళ్లి పై వాళ్ల‌కు ఫిర్యాదులు చేసినా ప్ర‌యోజ‌నాలు ఉండ‌వ‌ని గ్ర‌హించాలి. ఒక ఉద్యోగిగా ఆ సంస్థ మీకు ఎంత విలువ‌ను ఇస్తుందో, మీ క‌న్నా పై స్థాయి ఉద్యోగి అయిన మేనేజ‌ర్ పై కూడా వారికి గురి ఉంటుంది. మీరు ఫిర్యాదులు చేసినా.. స‌ద‌రు మేనేజ‌ర్ వివ‌ర‌ణ ను యాజ‌మాన్యం కోరినా.. మీ వాద‌న‌కు విరుగుడుగా మేనేజ‌ర్ మ‌రో మంత్రం ప‌ఠించ‌వ‌చ్చు. అప్పుడు మీ ప‌రిస్థితి రెంటికీ చెడ్డ రేవ‌డీ అవుతుంది. పై వాళ్ల‌కు, హెచ్ ఆర్ కు ఫిర్యాదులు అంత తెలివైన ప‌నులు కావు. వేధింపులు లైంగిక‌మైన‌వి అయిన‌ప్పుడో, ఫిజిక‌ల్ అబ్యూసో అయితే.. వారు చ‌ర్య‌లు తీసుకోగ‌ల‌రు కానీ, టాక్సిక్ మేనేజర్ల‌ను ఏరేసే కంపెనీలు బ‌హుశా ఉండ‌వు. తాము ప్రొడ‌క్టివిటీని చూపిస్తే తాము తోచిన విధంగా ప్ర‌వ‌ర్తించుకోవ‌డానికి స‌ద‌రు మేనేజ‌ర్లు కూడా త‌మ వ్యూహాల‌తో ఉంటార‌ని గ్ర‌హించాలి. సంస్థ‌పై న‌మ్మ‌కం ఉంటే వేచి చూసే ధోర‌ణే రైట‌వుతుంది త‌ప్ప‌, ఫిర్యాదులు పెద్ద‌గా ఫ‌లితాన్ని ఇవ్వ‌క‌పోవ‌చ్చు!

నో చెప్ప‌గ‌ల‌గ‌డం!

ఐటీ కంపెనీల వ‌ర‌కూ అయితే నో చెప్ప‌డానికి పెద్ద‌గా మొహ‌మాట ప‌డే ప‌రిస్థితులు ఉండ‌వు. త‌మ‌కు భార‌మైన ప‌ని విష‌యంలోనో, అద‌న‌పు బాధ్య‌త‌ల‌ను అంట‌గ‌డుతూ ఉన్న సంద‌ర్భాల్లో, కుద‌ర‌ని డెడ్ లైన్లు పెడుతున్న‌ప్పుడు.. స్పందించలేనంత ప‌రిస్థితి ఉండ‌క‌పోవ‌చ్చు. నో చెప్ప‌గ‌ల‌గ‌డం కూడా మీ వృత్తి నైపుణ్యంలో భాగ‌మే! అయినా చెప్ప‌లేక‌పోతున్నారు అంటే.. దేనికో అతిగా భ‌య‌ప‌డుతున్న‌ట్టే లెక్క‌! ఆ భ‌యాన్ని వ‌దిలించుకోలేన‌ప్పుడు.. ఇక మేనేజ‌ర్ చెప్పిందానికి త‌లూప‌డం త‌ప్ప ఇంకో గ‌త్యంత‌రం కూడా లేదు!

ఎమోష‌న్స్ ను నియంత్రించుకోవ‌డం!

మీటింగుల్లో కావొచ్చు, వ‌న్ ఆన్ వ‌న్ లో కావొచ్చు.. టాక్సిక్ మేనేజ‌ర్ల‌ను డీల్ చేస్తున్న‌ప్పుడు ఎమోష‌న్ల‌ను నియంత్రించుకోవ‌డం కూడా కీల‌క‌మే! మీరు వ్య‌క్తిగ‌తంగా ఎలాంటి వారు అయినా.. ఎంత మంచోళ్లు అయినా.. వృత్తి వృత్తే, వ్య‌క్తిగ‌తం వ్య‌క్తిగ‌త‌మే. రెంటికీ సంబంధం లేద‌ని గ్ర‌హించి, వ్య‌క్తిగ‌త‌మైన‌, ప‌ర్స‌న‌ల్ లైఫ్ ఎమోష‌న్స్ ను, బ‌య‌ట మీరు స్పందించే తీరును ఆఫీసులో చూపెట్ట‌కపోవ‌డం ఉత్త‌మం.

పాజిటివ్ స‌ర్కిల్ ను క‌లిగి ఉండ‌టం!

ఆఫీసుకు వెళ్లాలంటే మేనేజ‌రే క‌ల‌వ‌ర‌పాటుగా గుర్తు వ‌చ్చే ప‌రిస్థితులు ఏర్ప‌డిన‌ప్పుడు, అదే ఆఫీసులో మీకంటూ కొలిగ్స్ లో కొంత‌మందినైనా స్నేహితులుగా మార్చుకోగ‌ల‌గ‌డం, ఆఫీసుకు వెళితే వారితో కాసేపు మాట్లాడుకోగ‌ల పరిస్థితుల‌ను సెట్ చేసుకోవ‌డం తెలివైన ప‌ని. ఆఫీసంటే టాక్సిక్ మేనేజ‌రే కాకుండా, ఆస‌క్తిని క‌లిగించే అంశాలు కొన్ని అయినా క‌లిగి ఉండేలా ప‌రిస్థితుల‌ను మార్చుకుంటే కొంత రిలీఫ్ దొర‌క‌వ‌చ్చు.

2 Replies to “టాక్సిక్ మేనేజ‌ర్ ను త‌ట్టుకునేదెలా!”

  1. When you are spending 1/3 of your 24 hours in toxic environment, and you cannot sleep peacefully for another 1/3 of your 24 hours and definitely one cannot focus on anything in the leftover of another 8 hours!

    with toxic environment and no proper sleep, everything in the life is directly affected. Finances, relationships, friendships and many people get into addictions because they don’t know how to handle.

  2. మా ఆఫీసు లో బాసు ఎలాగంటే తనతోనే ఫ్రెండ్లీ గా ఉండాలి కాని కొలీగ్ తో ఫ్రెండ్లీ గా ఉన్నా సహించలేడు, ఇదేం పిచ్చి రా నాయనా అని మొదట అర్ధం కాకపోయినా ఆ తరువాత అతని ముందు కొలీగ్స్ తో జోక్స్ వేయకుండా నియంత్రించుకునే వాణ్ణి, కొందరు జీవితాంతం ఒక అభద్రతాభవం లో ఉంటారు, అలాంటి వారు మేనేజర్లు అయితే అంతే ఇక 😊

Comments are closed.