Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

మంచి నిర్ణయమే.. ఇదొక్కటీ చాలదు!

మంచి నిర్ణయమే.. ఇదొక్కటీ చాలదు!

పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా తిరుమల గిరుల్లో ప్రస్తుతం ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉంది. అయితే ఇది కేవలం ప్లాస్టిక్ కవర్ల వినియోగం వరకే. వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్ బాటిల్స్ తదితరాల రూపేణా.. రోజుకు లక్షలమంది వస్తూపోతూ ఉండే తిరుమల క్షేత్రంలో ప్లాస్టిక్ వినియోగం యథేచ్ఛగా సాగుతూనే ఉంది. అయితే తాజాగా తిరుమలలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా నిషేధించే దిశగా టీటీడీ ఆలోచిస్తుండడం.. క్షేత్రం పరిరక్షణను కాపాడడంలో గొప్ప నిర్ణయం.

నిజానికి తిరుమల అనేది ఆధ్యాత్మిక దివ్యక్షేత్రం. ఇక్కడి కొండమీద భక్తుల మధ్య అంతరాలు తెలియని, వారికి కనిపించని ఆధ్యాత్మిక వాతావరణం మాత్రమే ఉండాలి. కానీ తిరుమల క్షేత్రం మొత్తం ఒక మధ్యతరగతి షాపింగ్ కాంప్లెక్స్ లాగా మారిపోయి ఉంటుందనడంలో ఎలాంటి సందేహంలేదు. షాపింగ్ కాంప్లెక్స్ గోల మధ్యలోనే మనకు ఎక్కడైనా ‘నమో వేంకటేశాయ’ ధ్వని వినిపిస్తూ ఉంటుంది. షాపింగ్ కాంప్లెక్స్ మద్యలోనే ఆలయం కూడా ఉన్న భావన కలుగుతుంది.

పర్యావరణం విషయానికి వస్తే కవర్లను నిషేధించారు గానీ.. తిరుమలలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బాటిల్స్ విచ్చలవిడిగా కనిపిస్తాయి. తిరుమల మొత్తంలో చాలావరకు శ్రీవారి జలప్రసాద్ కేంద్రాల పేరిట ఆర్వో వాటర్ అందించేవి అనేకం ఉన్నాయి. అయినా సరే.. పరిశుద్ధమైన అమ్ముకునే వ్యాపారానికి ఇక్కడ కొదువలేదు. ఆ రీతిగా ఎడాపెడా ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా పేరుకుపోతున్నాయి. ఇప్పుడు సంకల్పిస్తున్న నిషేధం.. ఈ దిశగా కొంత ఉపయోగపడుతుంది.

కానీ, తిరుమలలో పరిపూర్ణమైన ఆధ్యాత్మిక వాతావరణం వెల్లి విరియాలంటే ఇదొక్కటి చాలదు. అన్నప్రసాదం విషయంలో కూడా విధి నిషేధాలు రావాలి. తిరుమల నిత్యాన్నదాన సత్రంలో కొన్ని వేల మందికి ప్రస్తుతం అన్నప్రసాద వితరణ అందుతోంది. తిరుమలలోనే ఇంకా పలుచోట్ల కూడా ఇలాంటి అన్నదాన కేంద్రాలు ఏర్పాటుచేసి ఉన్నారు. వీటి సంఖ్య మరింత పెంచాలి. సమాంతరంగా హోటళ్ల సంఖ్యను కూడా తగ్గించాలి.

తిరుమలలో దొరికే ప్రతి నీటిబొట్టు శ్రీవారి తీర్థం, దొరికే ప్రతి మెతుకూ శ్రీవారి ప్రసాదం అనే భావనకు భక్తులందరూ కూడా రావాలంటే.. ప్రెవేటు హోటళ్లను కూడా పూర్తిగా నిషేధించి.. శ్రీవారి అన్నప్రసాదాలను మరింత విరివిగా అందుబాటులోకి తేవాలి. తిరుమల పవిత్రతను ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని మరింతగా కాపాడడం సాధ్యమవుతుంది.

రాజకీయ నటన కంటే సినిమాల్లో నటన మంచిది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?