సింగీతం శ్రీనివాసరావు గారు కెవి రెడ్డి గారి వద్ద అసిస్టెంటు డైరక్టరుగా పనిచేసేవారు. ఆయన విజయావారికి తీసిన ''సత్య హరిశ్చంద్ర'' (1965), ''ఉమా చండీ గౌరీ శంకరుల కథ'' (1968) రెండూ ఫెయిలయ్యాయి. సొంత సంస్థ జయంతీ పిక్చర్స్ పేర తీసిన ''భాగ్యచక్రం'' (1968) కూడా ఎలాగోలా పూర్తి చేసి విడుదల చేస్తే అది కూడా బాగా ఆడలేదు. ఇక కెవి రెడ్డిగారి మార్కెట్ అయిపోయిందనుకున్న విజయావాళ్లు ఆయనను తొలగించివేసి అప్పటిదాకా కల్పించిన సౌకర్యాలు కూడా వెనక్కి తీసేసుకున్నారు. రెడ్డిగారికే పని లేకపోతే సింగీతం వారికేం వుంటుంది? విజయావాళ్లు ఆయనను కూడా తీసేశారు. సంసారం గడవడం ఎలా అని ఆయన భార్య దిగులుపడితే ఏం ఫర్వాలేదు, 'నేను పెయింటర్‌ను కదా, 1969 కొత్త సంవత్సరం గ్రీటింగ్ కార్డులు పెయింట్ చేసి డిజైన్ చేసి, వ్యాపారం చేస్తా చూడు' అన్నారు. ఆ బిజినెస్ చేస్తే బాగానే డబ్బు వచ్చింది. ఇలా నడుస్తూండగానే స్క్రిప్టులో సాయం కోరుతూ యితరులు పిల్చుకుని వెళుతూండేవారు. ఆదాయానికి లోటు లేకుండా గడిచిపోతూ వుండేది. ఈ థలో శంకరరెడ్డి గారనే ఆయన కర్నూలు, బళ్లారికి చెందిన పారిశ్రామిక వేత్తలు ఎచ్.వి.సంజీవరెడ్డి, ఎం.లక్ష్మీకాంత రెడ్డి గార్లను పిలుచుకుని వచ్చారు. 'మేం మొదటిసారిగా సినిమా తీయబోతున్నాం. మీరే డైరక్టరు, దర్శకత్వ పర్యవేక్షణగా కెవి రెడ్డిగారిని పెట్టుకుందాం' అని ప్రతిపాదించారు. 'మీ ఐడియా బాగుంది. డైరక్షన్‌కు నేను రెడీయే. కానీ పెద్దాయన కెవి గార్ని కలిస్తే మర్యాదగా వుంటుంది' అన్నారు సింగీతం. వచ్చిన నిర్మాతలతో కెవి 'మీ రెండో పిక్చర్ సింగీతంకు యిద్దురుగాని, మొదటి సినిమా మాత్రం నేనే చేస్తాను' అన్నారు. కెవికి మార్కెట్ లేదనుకున్న నిర్మాతలు ఆలోచిస్తాం అని చెప్పి వెళ్లిపోయారు. ఈ విధంగా సింగీతంకు వచ్చిన మొదటి ఛాన్సు పోయింది.
జయంతి పిక్చర్స్‌కు అసోసియేట్ ప్రొడ్యూసరు, కవి అయిన తిక్కవరపు పట్టాభిరామిరెడ్డిగారు కన్నడంలో యు.ఆర్.అనంతమూర్తి రాసిన ''సంస్కార''ను కన్నడ సినిమాగా తీద్దామని నిశ్చయించుకుని డైలాగులు కూడా రాయించుకుని షూటింగు ప్రారంభించబోయే ముందు సింగీతం వద్దకు వచ్చి డైరక్షన్‌లో సాయం చేయమని అడిగారు. సాయం చేయమన్నారు కానీ చివరకు దర్శకత్వ బాధ్యతంతా సింగీతం మీదనే పడింది. డైరక్టరుగా తన పేరు వేయమని అడగవచ్చు కానీ కథ, డైలాగులు, తారాగణం అన్నీ పట్టాభిగారే చూసుకున్నారు కాబట్టి, ఆయన పేరు డైరక్టరుగా వేసి, తన పేరు ఎక్జిక్యూటివ్ డైరక్టరుగా వుంటే సబబుగా వుంటుందనుకున్నారు సింగీతం. అలాగే జరిగింది. దానికి జాతీయ అవార్డు, రాష్ట్రపతి బంగారు పతకం, అనేక ప్రశంసలు లభించాయి.
ఈ లోపున కెవి రెడ్డిగారు ఖాళీగా ఆదాయం లేకుండా వుండడం చూసి బాధపడిన ఎన్టీయార్ ఆయనకు డబ్బు యివ్వబోయారు. 'ఊరికే యిస్తే పుచ్చుకోను, ఏదైనా సినిమాకు డైరక్షన్ చేయించుకో' అన్నారు కెవి. అప్పుడు ''శ్రీ కృష్ణ సత్య'' (1971) సినిమాకు దర్శకత్వం అప్పగించారు ఎన్టీయార్. 'కెవి ఆ సినిమా చేస్తున్నారు కాబట్టి, మీరు మా సినిమా చేసిపెట్టండి' అంటూ గతంలో వచ్చిన నిర్మాతలు మళ్లీ వచ్చి సింగీతంను అడిగారు. సరే అని చేసిన సినిమాయే ''నీతి-నిజాయితీ''. హీరో మూగవాడు. సతీష్ అరోడా అనే పంజాబీ యువకుడు ఆ పాత్ర వేశాడు. సినిమాకు, దానిలో పాటలకు మంచి పేరు వచ్చింది కానీ డబ్బులు రాలేదు. అయినా ఆ సినిమా నిర్మాణంలో వుండగానే సింగీతం దర్శకత్వ ప్రతిభ గమనించిన నవతా కృష్ణంరాజుగారు సొహ్రాబ్ మోదీ సినిమా ''శీష్ మహల్'' ఆధారంగా తను తీయ తలపెట్టిన ''జమీందారు గారమ్మాయి'' సినిమాకు బుక్ చేశారు. నీతి-నిజాయితీ ఫ్లాపు కావడంతో డిస్ట్రిబ్యూటర్స్ జంకారు. నిర్మాణం వాయిదా పడింది.
ఇంతలో సింగీతం రాజాజీ రాసిన ''దిక్కట్ర పార్వతి'' (దిక్కులేని పార్వతి) అనే తమిళ కథకు ఆంగ్లానువాదం ''ఫాటల్ కార్ట్'' చదివి చాలా యిష్టపడి దాన్ని తమిళంలో ఆర్ట్ ఫిల్మ్‌గా తీద్దామని ముచ్చటపడ్డారు. రాజాజీకి సినిమాలంటే యిష్టం లేదని ప్రతీతి. ఆయన అనుమతి లేనిదే సినిమా తీయలేం. ఎలా? కల్కి పత్రికలో ఎడిటర్‌గా పని చేసే ఎస్‌విఎస్‌గారు రాజాజీగారి సెక్రటరీ. ఆయన్ను పరిచయం చేసుకుని ఆయన ద్వారా రాజాజీని వెళ్లి అడిగితే ''సినిమాలెందుకు యిష్టం లేదు? చెడ్డ సినిమాలు యిష్టం లేదంతే'' అన్నారట. సింగీతం కోరిక మన్నించి సుస్తీగా వున్నా ఓపిక చేసుకుని పర్మిషన్ లెటర్‌పై సంతకం చేశారు. అదే ఆయన ఆఖరి సంతకం. పై వారానికి పోయారు. ఆయన వద్దకు వెళ్లడం యింకో వారం ఆలస్యమైతే ఆ సినిమా తీయగలిగేవారు కాదు. రాజాజీ కథను సినిమాగా తీస్తారట అని పత్రికలలో వచ్చి పబ్లిసిటీ బాగానే వచ్చింది. బజెట్ రూ. 2 లక్షలయితే లక్షన్నర అప్పు యివ్వడానికి ఫిలిం ఫైనాన్స్ కార్పోరేషన్ సిద్ధపడింది. కథకు తగిన లొకేషన్ చూద్దామని హొసూరు వెళితే రాజాజీ పుట్టి కొంతకాలం పెరిగిన తొరపల్లి గ్రామం అక్కడకి 5 కి.మీ.లని తెలిసింది. వెళ్లి చూస్తే కథలో వర్ణించిన వాతావరణం అక్కడ కనపడింది. కాస్త దూరం లోనే కర్ణాటక సరిహద్దు. కర్ణాటకలో తీస్తే ఏ భాషా చిత్రానికైనా సరే రూ.50 వేల సబ్సిడీ. ఇక్కడైతే ఆ వెసులుబాటు లేదు. కథకు తగిన వాతావరణమా? సబ్సిడీయా? చివరకు నేటివిటీయే ముఖ్యం అనుకుని ఎచ్.వి.సంజీవరెడ్డి, ఎం.లక్ష్మీకాంత రెడ్డి గార్లను కలుపుకుని సినిమా మొదలుపెట్టారు.
శ్రీకాంత్, లక్ష్మి హీరోహీరోయిన్లు, తర్వాతి రోజుల్లో కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న వైజి మహేంద్రన్ తొలిపరిచయం, విలన్ వేషం. సంగీతం వీణ చిట్టిబాబు. రెండు పాటలు. పాడినది వాణీ జయరాం. వాటిలో ఒక పాట రాజాజీదే. 22 రోజుల్లో షూటింగు ముగించుకున్నారు. 1974లో రిలీజైంది. దానికీ పేరు వచ్చింది. కానీ ఫ్లాప్. జాతీయ ఎవార్డుగా రూ.5000 లు వచ్చినా అది బాండ్ రూపంలో యిచ్చారు. ఫిలిం కార్పోరేషన్‌కు యివ్వాల్సిన బాకీ వుండిపోయింది. అప్పుడు సింగీతం ముఖ్యమంత్రి ఎమ్జీయార్‌ను వెళ్లి కలిస్తే ఆయన సినిమా చూసి చాలా బాగుంది, తాగుడు వలన గ్రామీణుల జీవితం ఎలా నాశనమవుతోందో వివరిస్తోంది. ప్రభుత్వం ద్వారా దీన్ని కొని, మీకు అప్పు లేకుండా చేస్తాను' అన్నారు. ఆ సినిమాను తమిళనాడు ప్రభుత్వం కొని, సింగీతం తరఫున కార్పోరేషన్ బాకీ తీర్చేసింది. సినిమా చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం సినిమాను కొనడం అదే మొదటిసారిట. ''దిక్కట్ర పార్వతి'' ప్రయత్నం వలన కలిగిన మేలేమిటంటే ''జమీందారు గారమ్మాయి'' సినిమా తీద్దామనుకున్న నవతా కృష్ణంరాజుకు సింగీతం దర్శకత్వ ప్రతిభపై మరింత నమ్మకం పెరిగి, డిస్ట్రిబ్యూటర్‌నైనా మారుస్తాను కానీ దర్శకుణ్ని మార్చను అనుకుని తన సినిమాకు అన్నపూర్ణా పిక్చర్స్‌ను ఒప్పించారు. 1975లో రిలీజైన ఆ సినిమా వంద రోజులు ఆడింది. ఆ తర్వాత వచ్చిన ''ఒక దీపం వెలిగింది'' (1976), ''అమెరికా అమ్మాయి'' (1976) సక్సెసయి సింగీతంను డైరక్టరుగా నిలబెట్టాయి. సింగీతం గారి శ్రీమతి లక్ష్మీకల్యాణి తమ కుటుంబ విశేషాలతో రాసిన ''శ్రీ కల్యాణీయం'' అనే పుస్తకంలో యీ వివరాలన్నీ వున్నాయి. – (సశేషం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2015)