Advertisement

Advertisement


Home > Articles - Special Articles

డ‌బ్బున్నా.. పెళ్లి క‌ష్ట‌మ‌వుతోంది గురూ!

డ‌బ్బున్నా.. పెళ్లి క‌ష్ట‌మ‌వుతోంది గురూ!

2020 దాటాకా పెళ్లి విష‌యంలో సామాజిక ప‌రిస్థితులు చాలా మారిపోయాయి. ఇవి రాత్రికి రాత్రి మారిపోయిన‌వి ఏమీ కావు. క్ర‌మ‌క్ర‌మంగా మారుతూ వ‌స్తున్న‌వే. ఏతావాతా 21వ శ‌తాబ్దం తొలి క్వార్ట‌ర్ నాటికి.. స‌గ‌టు భార‌తీయ స‌మాజంలో, అందునా తెలుగు స‌మాజంలో.. పెళ్లి పెద్ద క‌ష్టంగా మారింది! ప్ర‌త్యేకించి ఆర్థిక విష‌యాల‌తో ముడిప‌డిన పెళ్లి అంశంలో రివ‌ర్స్ ట్రెండ్ న‌డుస్తోంది. 

చేతిలో డ‌బ్బు ఉంటే ఎంచ‌క్కా అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి చేసుకోవ‌చ్చు, చేయొచ్చు! ఆస్తులు ఉన్నాయంటే.. అది మంచి సంబంధం కిందే లెక్క‌. కుటుంబానికి ఆస్తిపాస్తులున్నాయంటే.. పుష్క‌ర కాలం కింద‌టి వ‌ర‌కూ అంత‌కు మించిన వ‌రుడు లేడు. అయితే కుటుంబాల‌కు త‌ర‌గ‌ని ఆస్తులున్నా.. అబ్బాయికి అది అర్హ‌త కాకుండాపోతోంది! నిజంగానే అమ్మాయిని ఆక‌ట్టుకునే టాలెంట్ ఉండి, ఏ ల‌వ్వో చేసినా.. అబ్బాయి గుణ‌గ‌ణాలు అమ్మాయి కుటుంబ ప‌రిగ‌ణ‌న‌లోకి వెళ్లాకా కూడా.. వారి లెక్క‌ప‌క్క‌ల‌న్నీ ఆ పెళ్లికి అడ్డంకులే అవుతూ ఉన్నాయి!

ఇది కేవ‌లం అబ్బాయిల స‌మ‌స్యే కాదు, అమ్మాయిల ఆలోచ‌నాధోర‌ణి వ‌ల్ల వారికీ స‌మ‌స్యే అవుతోంది. ఆర్థికంగా నిల‌దొక్కుకున్న కుటుంబం నుంచి వ‌చ్చిన అమ్మాయిల ఆలోచ‌న ధోర‌ణి మ‌రీ అతిగా ఉంటోంది. పెళ్లి ప్ర‌పోజ‌ల్ రాగానే.. నూరేళ్ల జీవితం గురించి ఆలోచించేస్తూ ఉన్నారు అమ్మాయి. అబ్బాయి ఏం చ‌దువుకున్నాడు.. ఏం జాబ్ చేస్తున్నాడు, ఎక్క‌డ జాబ్ చేస్తున్నాడు.. ఫారెన్ వెళ్లే ఛాన్సులు ఎంత వ‌ర‌కూ ఉన్నాయి, అత‌డికి అక్క‌చెల్లెళ్లున్నారా.. అన్నాద‌మ్ముడున్నారా.. వాళ్లు జాబ్ చేస్తున్నారా! వాళ్లు జాబ్ చేస్తుంటే.. అది వ‌రుడి చేస్తున్న జాబ్ క‌న్నా చిన్న‌దా, పెద్ద‌దా! కుటుంబంలో ఎవ‌రైనా ఆ వ‌రుడి మీద ఆధార‌ప‌డే అవ‌కాశాలు భ‌విష్య‌త్తులో ఉంటాయా! వాటాలు పెట్టుకుంటే ఒక్కోరికి ఎంత ఆస్తిపాస్తులు ద‌క్కుతాయి, అత‌డి పేరెంట్స్ కానీ ఆడ‌ప‌డుచులు కానీ రేపు త‌మ మీద ఏమైనా ఆధార‌ప‌డే ప‌రిస్థితి ఉంటుందా! అత‌డి త‌ల్లిదండ్రుల‌కు కాలూచేయి ఆడ‌ని ప‌రిస్థితుల్లో త‌మ అమ్మాయి వారికి సేవ‌లు చేయాల్సి వ‌స్తుందా! ఇలాంటి ఆరాల‌న్నీ స‌హ‌జం అయిపోయాయి. 

త‌మ ఇంటికి కోడ‌లు రావాల‌న్నా ఇలాంటి ఆరాలు తీస్తార‌నే నిష్టూర‌మైన నిజాన్ని అమ్మాయిల త‌ల్లిదండ్రులు ఒప్పుకోలేరు. త‌మ కూతురును ఇస్తున్నామంటే మాత్రం.. ఇలాంటి లెక్క‌ల‌న్నీ వేస్తున్నారు. అబ్బాయి త‌మ్ముడికో అన్న‌కో జాబ్ లేద‌నే విష‌యం తెలిసినా.. వీళ్లు ఆలోచ‌న‌లో ప‌డిపోతున్నారు! ఇలాంటి త‌ట‌ప‌టాయింపుల‌కు హ‌ద్దు లేకుండాపోతోంది.

మ‌రి ఇన్ని ఆలోచ‌న‌లు చేసే వారు, ఇలాంటి అతి చేసే వారు త‌మ కూతురుకు ఎప్ప‌టికి పెళ్లి చేయాలి? అందుకే చాలా మంది అమ్మాయిలకు సంవ‌త్స‌రాల‌కు సంవ‌త్స‌రాలు పెళ్లి సంబంధాల‌ను చూడ‌టంలోనే గ‌డిచిపోతూ ఉన్నాయి. పాతికేళ్ల వ‌య‌సులో పెళ్లి చూపులు చూడ‌టం మొద‌ల‌యినా.. ఆ త‌ర్వాత ఐదారేళ్లు అయినా వీళ్లు కోరిన త‌ర‌హా వ‌రుడు దొరికే అవ‌కాశాలు క‌న‌ప‌డ‌టం లేదు. 

అతిగా ఆలోచించ‌డం వ‌ల్ల అమ్మాయిలే ఇలాంటి ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. మంచి మంచి సంబంధాల‌ను కూడా మొద‌ట్లో కాద‌నేసుకోవ‌డం.. చివ‌ర‌కు వ‌య‌సు మీద ప‌డుతున్న‌ప్పుడు గ‌తంలో వ‌చ్చిన సంబంధాల‌తో పోల్చుకుని రాజీ ప‌డ‌లేక‌.. అంతిమంగా వివాహాలు లేట‌వుతున్నాయి!

ప్ర‌త్యేకించి 1990 నుంచి 1995ల మ‌ధ్య పుట్టిన అమ్మాయిల్లో ఈ త‌ర‌హా ధోర‌ణి ఎక్కువ‌గా ఉంది. అతిగా ఆలోచించ‌డం, త‌మ గురించి ఎక్కువ అంచ‌నాలు వేసుకోవ‌డం, క‌ల‌ల్లో మునిగి తేల‌డమో ఏమో కానీ.. ఈ వ‌య‌సుల అమ్మాయిల్లో పెళ్లి అన‌గానే సినిమాల్లో సాంగ్ వేసుకున్న త‌ర‌హా అనే ధోర‌ణి క‌నిపిస్తూ ఉంది. అబ్బాయికి మంచి ఉద్యోగం ఉండాలి, అందగాడూ అయ్యుండాలి, ఆస్తిపాస్తులు పెద్ద‌లు వెన‌కేసినివి ఉండాలి, ఆ పై ఇంట్లో వాళ్లెవ్వ‌రూ ఆ అబ్బాయి మీద ఆధార‌ప‌డ‌రాదు! త‌మ‌న అలవోక‌గా విదేశానికి తిప్పగ‌ల‌గాలి. 

అన్నింటికీ మించి తాము ఏం చేసినా అబ్బాయి దానికి తందానా అనేలా ఉండాలి త‌ప్ప‌, ఎందుకు? ఏమిటీ అనే ప్ర‌శ్నాలు  వేసేవాడైతే వ‌ద్దేవ‌ద్దు! పెళ్లి చూపుల ప్ర‌క్రియ‌లో... జాబ్, ఆస్తుల అర్హ‌త‌లు తేలిన త‌ర్వాత‌.. అమ్మాయి ఆ అబ్బాయిని ఇంట‌ర్వ్యూ చేయ‌డం మొద‌లుపెడుతుంది. ఫోన్లో వీళ్ల మాట‌లు మొద‌లైన త‌ర్వాత‌.. అత‌డికి అన్ని ర‌కాల లిట్మ‌స్ టెస్టులు పెడుతుంది అమ్మాయి. ఇందులో ఆమె అనుకున్న‌ట్టుగా.. ఆమె న‌చ్చిన‌ట్టుగా వాడు ఉంటే స‌రేస‌రి. లేక‌పోతే పేరెంట్స్ కు న‌చ్చినా ఆ ప్రపోజ‌ల్ వెన‌క్కువెళ్లిపోవాల్సిందే!

అబ్బాయి ఆటిట్యూడ్ బాగోలేద‌ని, గ‌ట్టిగా మాట్లాడ‌తాడ‌నో, ఖ‌రాఖండిగా చెబుతాడ‌నో, త‌న‌ను బుజ్జ‌గించి, బ‌తిమాలి, అంతిమంగా త‌ను చెప్పింది చెప్పిన‌ట్టుగా ఒప్పుకునేలా లేడ‌నే కార‌ణాల‌తో .. అబ్బాయిని తిర‌స్క‌రించేయ‌డం, అది కూడా ప‌దుల కొద్దీ సంబంధాల‌ను తిర‌స్క‌రించేయ‌డం కూడా త‌మ స్వ‌భావంలో త‌ప్పులేనిద‌నే అమ్మాయిలు భావిస్తున్నారు! అందులో త‌ప్పేం లేద‌ని, రేపు అత‌డితో కాపురం చేయాల్సింది తామే కాబ‌ట్టి .. అందుకు అన్ని ర‌కాలా సెట్ అయ్యే వాడిని తేల్చ‌డానికి వెనుకాడేది లేదంటున్నారు. 

ఇందు కోసం సంవ‌త్స‌రాల‌కు సంవ‌త్స‌రాలు స‌మ‌యం ప‌ట్టినా, ప‌దుల కొద్దీ సంబంధాలు చూస్తూనే ఉన్నా... పోయేదేం లేద‌న్న‌ట్టుగా అమ్మాయిల ధోర‌ణి ఉంది. అయితే.. దీని వ‌ల్ల తామేం మిస్ అవుతున్నామో అర్థం చేసుకోలేని అమాయ‌క‌త్వం వారిది. అస‌లైన య‌వ్వ‌నాన్ని, పెళ్లికి త‌గిన వ‌య‌సును వారు మిస్ అవుతున్నారు. ఏ వ‌య‌సులో ముచ్చ‌ట ఆ వ‌య‌సులో జ‌రిగితేనే దానికొక అందం. సినిమాలోనో, సినిమా సెల‌బ్రిటీల‌నో చూసి.. త‌మ ధోర‌ణిని అమ్మాయిలు సమ‌ర్థించుకుంటే అంద‌మైన స‌మ‌యం ఆవిర‌వుతూ ఉంటుందంతే!

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా